వైద్య ధర్మం ఏమైంది?
‘కాసు’పత్రులుగా ఎప్పుడో అపకీర్తి గడించిన కార్పొరేట్ ఆసుపత్రుల చరిత్రలో ఇది మరో వికృత అధ్యాయం! ఎత్తు పెరగాలని మనసుపడి వచ్చిన ఓ యువకుడి పూర్వాపరాలు పూర్తిగా తెలుసుకోకుండా, అతని రక్తసంబంధీకులకు కనీస సమా చారం ఇవ్వకుండా కాళ్లు రెండూ కోసిన వైనమిది. ఎక్కడో మారుమూల ప్రాం తంలో కాదు... హైదరాబాద్ మహానగరంలో ఇది చోటుచేసుకోవడం అందరినీ దిగ్భ్రాంతిపరుస్తోంది. ఏదైనా సమస్యతో ఒక రోగి తమ వద్దకు వచ్చినప్పుడు అతనికి సంబంధించిన సమస్త వివరాలూ కనుక్కోవడం వైద్యుల కనీస బాధ్యత.
ఆ తర్వాతే రోగికి అందించాల్సిన వైద్యం గురించి అయినా, శస్త్ర చికిత్సల గురించి అయినా చర్చించాలి. అత్యవసరంగా చికిత్స అవసరమైన రోగి విషయం వేరు. ప్రాణాలు కాపాడటమే అక్కడ ప్రధానమవుతుంది. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. కానీ గ్లోబల్ ఆసుపత్రికొచ్చిన నిఖిల్ రెడ్డి సంపూర్ణ ఆరో గ్యంతో ఉన్న యువకుడు. అతని సమస్యల్లా ఆరడుగుల పొడవుతో ఆకర్షణీ యంగా కనబడటం ఎలాగన్నదే! ఈ మాదిరి కోరికతో వచ్చిన ఇరవెరైండేళ్ల కుర్రవాడికి వైద్యులు ఏం చెప్పాలి? అలాంటి శస్త్ర చికిత్సలో ఇమిడి ఉండే సంక్లిష్టతల గురించి ఏకరువు పెట్టాలి.
శస్త్ర చికిత్సవల్ల ఎదురుకాగల సమస్యల గురించి చెప్పాలి. అది విఫలమైనపక్షంలో ఏం జరిగే అవకాశం ఉందో కూడా తప్పనిసరిగా తేటతెల్లం చేయాలి. అసలు ఈ మాదిరి ఆపరేషన్ ఎవరికి, ఎలాంటి సమయాల్లో అవసరమవుతుందో వివరించాలి. ఆ శస్త్ర చికిత్స తర్వాత దాదాపు తొమ్మిదినెలలపాటు మరొకరిపై ఆధారపడటం తప్పదుసుమా అని హెచ్చరిం చాలి. ఇన్ని చెప్పాక...‘అయినాసరే, చేయించుకు తీరతాన’ని అంటే అలాంటి యువకుడి మానసిక పరిణతి గురించి ఆలోచించాలి. మీ తల్లిదండ్రులనో, వారు అందుబాటులో లేకపోతే మీ రక్త సంబంధీకులైన పెద్దవాళ్లనో తీసుకురమ్మని సలహా ఇవ్వాలి.
అలా వచ్చినవారికి సైతం ఆ శస్త్ర చికిత్స గురించి అన్నీ చెప్పి వారి అనుమతి తీసుకున్న తర్వాతనే ప్రారంభించాలి. అన్నిటికన్నా ముందు ఆ యువకుడికి పొడవు పెరగాలన్న వాంఛలోని నిరర్ధకత గురించి చెప్పాలి. ఎందుకంటే ఆ వయసు పిల్లల్లో తమను తాము ఎదుటివారితో పోల్చుకునే తత్వం అతిగా ఉంటుంది. అవతలివారితో పోలిస్తే తాము తీసికట్టుగా ఉన్నామన్న భ్రమ ఉంటుంది. కొన్ని చిన్న చిన్న లోపాలను సరిచేసుకుంటే తాము ముందుకు దూసు కెళ్లగలమన్న విశ్వాసం ఉంటుంది. ఆ పిల్లలతో పోలిస్తే వయసులోనూ, చదువు లోనూ, అనుభవంలోనూ అధికులుగా ఉండే వైద్యులు అలాంటి ధోరణులను కట్టడి చేసే విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి.
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పూర్తి వ్యాపార దృక్పథం ఆవరించి ఉన్న కార్పొరేట్ ఆసుపత్రుల నుంచి ఇలాంటి ప్రవర్తనను ఆశించలేం. అయిదు నక్ష త్రాల హోటళ్లను తలపించే రీతిలో ధగధగలాడుతున్న కార్పొరేట్ ఆసుపత్రుల మాటెలా ఉన్నా మన చట్టాలు ఇప్పటికీ వైద్యాన్ని సేవారంగంగానే గుర్తిస్తున్నాయి. కానీ కార్పొరేట్ ఆసుపత్రులు దాన్ని పక్కా బిజినెస్‌గా చూస్తున్నా కళ్లుమూసు కుంటున్నాయి. ఈ మాదిరి ఆసుపత్రుల ప్రచారార్భాటాలపై చాలా ఆంక్షలే ఉన్నాయి. కానీ అవి ఏమేరకు అమలవుతున్నాయో చూసే నాథుడేడీ? అలా చూసే దక్షతే ప్రభుత్వ యంత్రాంగంలో ఉంటే ఇన్ని అక్రమాలు ఎలా చోటు చేసుకుంటాయి? రోగులు అనైతిక, అహేతుక విధానాల బారినపడకుండా రక్షించేందుకు 2010లో కేంద్రం క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఎనిమిదేళ్లు కావస్తున్నా చాలా రాష్ట్రాలు దాన్నింకా సమ్మతిస్తూ తీర్మానించలేదు. అలా సమ్మతించినట్టు చెప్పిన రాష్ట్రాలు సైతం దాని అమలులో శ్రద్ధ తీసు కోవడంలేదు.
వైద్యం వ్యాపారమయం అయినప్పుడే మానవీయత మంచంపట్టింది. కనుకనే తమ చర్యలో తప్పేమీ లేదని గ్లోబల్ ఆసుపత్రి సీఓఓ శివాజీ చటో పాధ్యాయ అంత బింకంగా చెప్పగలిగారు. పొడవు పెరగడానికి శస్త్ర చికిత్స చేయించుకుంటానని వచ్చిన నిఖిల్ నేపథ్యం గురించి తెలుసుకోని వైద్యులు ఆ శస్త్ర చికిత్సకు అతని స్నేహితుడి సంతకం సరిపోతుందనుకోవడంలో వ్యాపార ధర్మం ఉంది తప్ప మానవీయత లేదు. అదే ఉంటే శస్త్ర చికిత్స అనంతరం తలెత్తగల ఇన్ఫెక్షన్ల గురించీ, ఆ ప్రక్రియ పర్యవసానంగా ఏర్పడగల నరాల సంబంధమైన సమస్యల గురించీ నిఖిల్‌కు వివరించేవారు. ఆ యువకుడికి సొంతంగా నిర్ణయించుకోగల వయసు వచ్చింది గనుకే మరెవరి అనుమతీ అవసరం లేదనుకున్నామని చటోపాధ్యాయ చేసిన వాదనలో పసలేదు. పాశ్చాత్య సమాజాల విషయంలోనైతే బహుశా ఆ వాదన సరిపోవచ్చునేమో! కానీ మన కుటుంబాల్లో పిల్లలకు అంత స్వేచ్ఛ ఉండదు. వారికి సంబంధించిన విషయాల్లో, మరీ ముఖ్యంగా ఇలాంటి శస్త్ర చికిత్సల విషయంలో తల్లిదండ్రుల ప్రమేయం ఉంటుంది. ఇది చటోపాధ్యాయకు తెలియదనుకోవడానికి లేదు.
బయటికెళ్లి వస్తానని చెప్పిన కుమారుడు ఏమైపోయాడో తెలియక తల్లడిల్లి... అతని ఆచూకీ కోసం తెలిసినవారందరి దగ్గరా గాలించి... చివరకు గత్యంతరం లేక పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు నిఖిల్‌ని అలాంటి స్థితిలో చూస్తా మని ఊహించి ఉండరు. నిక్షేపంగా ఉన్న కుమారుడు ఒక్కసారిగా ఐసీయూలో కనబడటాన్ని చూసి కన్నీరుమున్నీరైన ఆ తల్లిదండ్రుల విషయంలో సైతం ఆసుపత్రి యాజమాన్యం పద్ధతిగా వ్యవహరించలేకపోయింది. ఇలాంటి ఉదం తాలు ఇకపై జరగకూడదనుకుంటే పటిష్టమైన నియంత్రణ వ్యవస్థలు అమలులో ఉండాలి. తప్పు జరిగితే కఠిన చర్యలు తప్పవన్న సంకేతాలు వెళ్లాలి. ఆసు పత్రులకు జవాబుదారీతనాన్ని అలవాటు చేయాలి. ప్రతిదీ వ్యాపారమయమై, అన్ని వ్యాపారాలూ రాజకీయంతో పెనవేసుకుపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి చర్యలను ఊహించడం సాధ్యమేనా?