ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి బారినపడి విలవిల్లాడుతున్న బాధితుల నుంచి నిబంధనలకు విరు ద్ధంగా రూ. లక్షల్లో ఫీజులు గుంజుతున్న కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. కరోనా ఫీజులను నిర్దే శించినా అధిక వసూళ్లకు పాల్పడుతున్న ఆయా ఆస్పత్రులకు ముకుతాడు వేయాలని భావిస్తోంది. కేంద్ర అంటువ్యాధుల నియంత్రణ చట్టానికి అనుగుణంగా మార్చిలో జారీ చేసిన తెలంగాణ అంటువ్యాధుల (కోవిడ్–19) నియంత్రణ–2020 నోటిఫికేషన్ ప్రకారం చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. అన్ని రకాల ఆస్పత్రులపై సర్కారుకు సర్వాధి కారాలు కల్పించే ఈ చట్టాన్ని ప్రయోగించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఆస్పత్రులను దారిలోకి తేవడంపై కసరత్తు చేస్తోంది.
సర్కారు నిర్దేశించిన ఫీజులు బేఖాతరు
రాష్ట్రంలో అనేక ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు కరోనా రోగులను ఫీజుల పేరుతో దోచుకుం టున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. కరోనా బాధితులకు సాధారణ వార్డులో ఐసోలేషన్‌కు రూ. నాలుగు వేలు (రోజుకు), ఐసీయూలో వెంటిలేటర్ లేకుండా రోజుకు చికిత్స రూ. 7,500, ఐసీయూలో వెంటిలేటర్ సౌకర్యంతో రోజుకు రూ. తొమ్మిది వేలను ఫీజుగా సర్కారు నిర్దేశించింది. ఈ ఫీజులను మించి వసూలు చేయరాదని ఆస్ప త్రుల యాజమాన్యాలకు స్పష్టం చేసింది.
కానీ చాలా ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు కరోనా బాధితుల నుంచి ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులకు పది రెట్లకుపైగా ప్రతిరోజూ వసూలు చేస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. కొన్ని ఆస్పత్రులు కరోనా చికిత్సకు రూ. 7–8 లక్షలు వసూలు చేస్తుండగా కార్పొరేట్ ఆస్పత్రులైతే ఏకంగా రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకూ వసూలు చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అంటు వ్యాధుల నియంత్రణ చట్టం ప్రకారం ఆయా ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులకు ముకుతాడు వేయాలని తెలంగాణ సర్కారు యోచిస్తోంది.
అంటువ్యాధుల చట్టం ఏం చెబుతోంది?
కేంద్ర అంటువ్యాధుల నియంత్రణ చట్టానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెలలో జారీ చేసిన నోటిఫికేషన్ ఏడాదిపాటు అమలులో ఉంటుంది. కరోనా నియంత్రణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవడంలో ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్), వైద్య, విద్య సంచాలకులు (డీఎంఈ), వైద్య విధాన పరిషత్ కమిషనర్, జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలు, కార్పొరేషన్ల కమిషనర్లకు ఈ చట్టం సర్వాధికారాలు కల్పించింది. వ్యాధిని నిరోధించడానికి ఎటువంటి చర్యలైనా తీసుకొనే అధికారం వారికి ఉంది.
అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులపైనా వారికి అధికారాలుంటాయి. ఈ చట్టం ప్రకారం కరోనా లక్షణాలున్న కేసులను పరీక్షించడానికి, వైద్యం చేయడానికి అవసరమైనప్పుడు ఆస్పత్రులు ముందుకు రావాలి. వైద్యం చేసే ప్రైవేట్ ఆస్పత్రులు ఐసీఎంఆర్ మార్గదర్శకాలను పాటించాలి. ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ భవనాన్ని నిర్బంధంగా స్వాధీనంలోకి తీసుకోవచ్చు. అంటువ్యాధుల నియంత్రణ చట్టాన్ని, నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే ఆ వ్యక్తి లేదా సంస్థ చట్ట ప్రకారం శిక్షార్హమైన నేరానికి పాల్పడినట్లుగా పరిగణించి తగు విధంగా చర్యలు తీసుకోవడంతోపాటు జరిమానా విధించవచ్చు.
ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే చర్యలు...
వివిధ రాష్ట్రాల్లో అంటువ్యాధుల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించిన ప్రైవేట్ ఆస్పత్రులపై ఆయా ప్రభుత్వాలు తీసుకున్న చర్యలపై తెలంగాణ సర్కార్ అధ్యయనం చేస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా ప్రభుత్వాలు కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులకు నోటీసులు జారీ చేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకున్నాయి. ముంబైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిపై మహారాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది.
ఆ రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్పత్రులు వేసే బిల్లులను చూడటానికి ప్రతి ప్రైవేట్ ఆస్పత్రిలో కనీసం ఇద్దరు ఆడిటర్లను ఏర్పాటు చేసింది. హిమాచల్‌ప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాలు రోగులకు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కరోనా చికిత్స కొనసాగిస్తున్నాయి. పుదుచ్చేరి ప్రభుత్వం ప్రైవేటు వైద్య కళాశాలలను నియంత్రణలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది.
ఇక్కడెలా చేద్దాం?
కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రుల ఆగడాలను అడ్డుకొనేందుకు ఏం చేయాలన్న దానిపై వైద్య, ఆరోగ్య శాఖ కసరత్తు ప్రారంభించింది. అంటువ్యాధుల నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేసి నిబంధనలను ఉల్లంఘించిన ఆస్పత్రులపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని యోచిస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతస్థాయి అధికారి ఒకరు తెలిపారు. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనుకుంటోందని, ప్రైవేటు ఆస్పత్రులు వేస్తున్న బిల్లులను సేకరిస్తున్నామని వైద్య వర్గాలు అంటున్నాయి.
చూస్తూ ఊరుకోం..
కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా కరోనా ఫీజులు వసూలు చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. అలా చేసే ఆస్పత్రులను చూస్తూ ఊరుకోం. ఏం చేయాలన్న దానిపై సమాలోచనలు చేస్తున్నాం. మరోవైపు ప్రభుత్వ రంగంలోనే పరీక్షలను పెంచాం. సర్కారు ఆస్పత్రుల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నాం. ప్రజలు ప్రైవేట్ వైపు వెళ్లకుండా చైతన్యం చేస్తున్నాం. – ఈటల రాజేందర్, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment