జన జీవితాల్లో కరోనా పెద్ద కల్లోలమే రేపింది. లక్షలాది కుటుంబాలను ఛిద్రం చేసింది. వేలాది కుటుంబాల్లో విషాదం నింపింది. 2020 మార్చిలో మొదలైన మహమ్మారి వైరస్ విజృంభణ... ఈ ఏడాది మరింత విజృంభించింది. రెండోవేవ్‌లో కలిగించిన నష్టం అంతా ఇంతా కాదు. ఇప్పటివరకు రాష్ట్రంలో 6.80 లక్షల మంది కరోనా బారినపడ్డారు.
అందులో 6.72 లక్షల మంది కోలుకున్నారు. 3,600 మంది ప్రస్తుతం ఆసుపత్రుల్లో లేదా ఇళ్లల్లో చికిత్స పొందుతున్నారు. 4,018 మంది కరోనాతో చనిపోయారు. అనేకమంది ఇప్పటికీ పోస్ట్ కోవిడ్, లాంగ్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 54,245 పడకలు ఉండగా, అవసరాన్ని బట్టి వాటిని కరోనా కేసులకు వాడుతున్నారు. కరోనా వైరస్ విజృంభణ సమయంలో వీటన్నింటినీ సంసిద్ధంగా ఉంచారు.
మూడోవేవ్‌కు ముందస్తు ఏర్పాట్లు
కరోనా మూడోవేవ్ వస్తే ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు ఏర్పాట్లు చేశాయి. కరోనా నిర్ధారణ పరీక్షల దగ్గరి నుంచి ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల వరకు అన్ని ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. ఇందులోభాగంగా కేంద్ర ప్రభుత్వం అత్యవసర కోవిడ్ రెస్పాన్స్ ప్యాకేజీ ఫేజ్–2 కింద రాష్ట్రానికి రూ.456 కోట్లు కేటాయించింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఏయే పనులకు నిధులు అవసరమన్న దానిపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రతిపాదనలు రూపొందించింది.
పీడియాట్రిక్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ప్రధాన ఆస్పత్రుల్లో ఐసీయూ పడకలను పెంచాలని, అందులో 20 పీడియాట్రిక్ బెడ్స్ ఉండేలా ఏర్పాట్లు చేయాలని చెప్పింది. కరోనా నిర్ధారణ పరీక్షల కోసం 27.04 లక్షల ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లను సిద్ధంగా ఉంచారు. 2.91 లక్షల ఆర్టీపీసీఆర్ కిట్లను అందుబాటులో ఉంచారు. 5.74 కోట్ల పారసిటమాల్ మాత్రలను, 2.44 లక్షల రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను నిల్వ ఉంచారు. 41.11 లక్షల ఎన్–95 మాస్క్‌లు సిద్ధంగా ఉంచారు.
రోజుకు 80వేలకుపైగా పరీక్షలు
కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ఏర్పాట్లు చేసింది. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను రోజుకు 80 వేలకుపైగా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ మేరకు ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లను లక్షల సంఖ్యలో ముందస్తుగా అందుబాటులోకి తెచ్చింది. ఎక్కడా కొరత లేకుండా ఏర్పాట్లు చేసింది. మరోవైపు ఆసుపత్రుల్లో రోగులకు అవసరమైన మందులను కొనుగోలు చేసింది.
ప్రధానంగా రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను అవసరమైన మేర కొనుగోలు చేసింది. అయితే కేంద్రం నుంచి ఇవి పూర్తిస్థాయిలో రాకపోవడంతో రోగుల బంధువులు అక్కడక్కడా బ్లాక్‌మార్కెట్లో కొనుగోలు చేశారు. కొన్ని సందర్భాల్లో రెండు మూడింతలు పెట్టి కొనాల్సిన పరిస్థితి నెలకొంది.
మిగిలిన మందుల విషయంలో ఇబ్బందులు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇక ఆక్సిజన్ విషయంలో మాత్రం ఎక్కడా కొరత లేకుండా చూశారు. అయితే, ప్రైవేట్ ఆసుపత్రులు రోగులను చేసిన దోపిడీని అరికట్టడంలో కొంతమేర వైఫల్యం కనిపించింది. దాదాపు 200 ఆసుపత్రులపై ఫిర్యాదులు వచ్చాయి.
కొత్త ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌ను ప్రభుత్వం ఏప్రిల్‌లో బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. కోవిడ్ తీవ్రత ఉన్న సమయంలో ఈ మార్పు జరగడంతో ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా కొన్ని నెలలపాటు వైద్య ఆరోగ్యశాఖ బాధ్యతలు కూడా నిర్వర్తించారు. దీంతో ఇబ్బందులు రాకుండా రెండో దశను ఎదుర్కొన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావుకు వైద్య ఆరోగ్యశాఖ బాధ్యతలు కూడా అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment