వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర ఆరోగ్య మంత్రితో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు. పక్కన మంత్రి పువ్వాడ, ఎంపీ నామా నాగేశ్వర్‌రావు
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాష్ట్రంలో ప్రారంభించిన జ్వర సర్వేను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ ప్రశంసించారు. తెలంగాణ అనుసరిస్తున్న పద్ధతిని మంచి వ్యూహంగా అభినందించారు. ఇదే విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో అనుసరించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వివిధ రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, లక్ష ద్వీప్, అండమాన్ నికోబార్, పుదుచ్చేరి రాష్ట్రాల వైద్య, ఆరోగ్యశాఖ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ తరఫున రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఖమ్మం కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, ప్రభుత్వ సన్నద్ధత, జ్వర సర్వే, వ్యాక్సినేషన్ తదితర అంశాలను హరీశ్‌రావు కేంద్ర మంత్రికి వివరించారు. రెండో వేవ్ సమయంలో కరోనా కట్టడి కోసం దేశంలోనే తొలిసారి తెలంగాణ జ్వర సర్వే మొదలు పెట్టి మంచి ఫలితాలు సాధించిందని హరీశ్‌రావు తెలిపారు. ఇప్పుడు మరోసారి జ్వర సర్వే ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
మొత్తం 21,150 బృందాలు జ్వర సర్వేలో పాలుపంచుకుంటున్నాయని చెప్పారు. వైద్య, ఆరోగ్య, పంచాయతీ లేదా మున్సిపల్ విభాగాల నుంచి ఒక్కో బృందంలో ముగ్గురు ఉంటారని, వీరంతా ప్రతి ఇంటికి వెళ్లి వారి ఆరోగ్యాన్ని పరీక్షిస్తారని తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి అక్కడే హోంఐసోలేషన్ కిట్స్ ఇస్తున్నామని, తదుపరి వారంపాటు వారి ఆరోగ్య పరిస్థితిని సిబ్బంది పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 77,33,427 ఇళ్లలో జ్వర సర్వే చేశామన్నారు. సర్వేతో ప్రభుత్వం వైద్యాన్ని ఇంటి వద్దకే చేర్చిందనీ, దీని వల్ల పాజిటివిటీ రేటు తగ్గి, ఆస్పత్రుల్లో చేరికలు తగ్గాయన్నారు.
60 ఏళ్లు దాటిన అందరికీ బూస్టర్ డోసు ఇవ్వాలి..
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులతోపాటు 60 ఏళ్ల వయసు పైబడిన వారందరికీ బూస్టర్ డోసు ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు కేంద్రానికి మరోసారి విజ్ఞప్తి చేశారు. కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య గడువును తగ్గించాలని, అలాగే 18 ఏళ్లు దాటిన ప్రతి పౌరుడికి బూస్టర్ ఇచ్చే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment