గురువారం హైదరాబాద్‌లో జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షలో పాల్గొన్న బీజేపీ నేతలు రఘనందన్ రావు, ఈటల, సోయం బాపూరావు, కె. లక్ష్మణ్, మురళీధర్ రావు, రాజాసింగ్, డి.కె. అరుణ
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేస్తే.. మళ్లీ బీజేపీకి దగ్గర కావొచ్చని సీఎం కేసీఆర్ అనుకుంటున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ప్రస్తుతం అది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యంకాదని స్పష్టం చేశారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై సీఎం కేసీఆర్, ఆర్థికమంత్రి హరీశ్‌రావు బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
బడ్జెట్‌పై తాను చెప్పేది తప్పైతే ముక్కు నేలకు రాస్తానన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి ముగ్గురు బీజేపీ సభ్యుల సస్పెన్షన్, వారిని అనుమతించడంపై హైకోర్టు సూచనలను స్పీకర్ తిరస్కరించడాన్ని నిరసిస్తూ.. గురువారం రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద ‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష’ చేపట్టారు. బుధవారం దీక్షకు అనుమతి ఇవ్వని పోలీసులు.. గురువారం ఉదయం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
దీక్షలో పాల్గొన్న నాయకులంతా పార్టీ కండువాలతో పాటు నల్లకండువాలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణకు, సీఎం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఈ దీక్ష చేపట్టామన్నారు. సీఎం పంపిన స్లిప్‌లను చూశాకే స్పీకర్ తమను అప్రజాస్వామికంగా సస్పెండ్ చేశారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్‌ను ఓడించి బీజేపీని గెలిపించడం ఖాయమని జోస్యం చెప్పారు.
ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం...
రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ అంశా న్ని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. రాష్ట్ర పార్టీ అనుమతి తీసుకొని ఎమ్మెల్యేలం.. అన్ని జిల్లాలు, గ్రామాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపడతామని పేర్కొన్నారు. అసెంబ్లీ జరిగినన్నీ రోజులు కేసీఆర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. పరస్పరం పొగుడుకోవడమే సరిపోయిందని చెప్పారు.
కాంగ్రెస్, టీఆర్‌ఎస్ వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేయనున్నాయని వెల్లడించారు. బీజేఎల్పీనేత రాజాసింగ్ మాట్లాడుతూ.. ‘సంజయ్ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో ఒక బుల్డోజర్ లాంటి అభ్యర్థులు వచ్చే ఎన్నికల్లో నిలబడతారు. అవినీతి దొంగలపై ఈ బుల్డోజర్లను ఎక్కిస్తాం. అక్రమ కేసులతో బీజేపీ నేతలను, కార్యకర్తలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదు.
తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. రావణవధలా.. త్రిబుల్ ఆర్ చేతిలో వథకు కేసీఆర్ సిద్ధంగా ఉండాలి’అని హెచ్చరించారు. కేసీఆర్ రాష్ట్రాల పర్యటన ఎందుకు ఆగిపోయిందో చెప్పాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. మహిళా గవర్నర్‌ను అవమానించిన కేసీఆర్‌ను ఇంటికి పంపిస్తామన్నారు.
కేసీఆర్ అవినీతి బండారం బయటపెడ్తారన్న భయంతోనే బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని చెప్పా. ఉద్యమ సమయంలో తెలంగాణకు వ్యతిరేకంగా సంతకం చేసిన పోచారం శ్రీనివాసరెడ్డి ఇప్పుడు స్పీకర్‌గా ఉన్నారని శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ ధ్వజమెత్తారు. పార్టీ నేత యెండల లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఇన్‌చార్జీ పి. మురళీధర్‌రావు, ఎంపీ సోయం బాపూరావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, డాక్టర్ వివేక్ వెంకటస్వామి, ఏపీ జితేందర్‌రెడ్డి, నల్లు ఇంద్రసేనారెడ్డి, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment