
రింగు బాటలో..
హైదరాబాద్ మహానగరాభివృద్ధి (హెచ్‌ఎండీఏ) ప్రభుత్వ/అసైన్డ్ భూముల లెక్క తీస్తోంది. ఔటర్‌రింగ్‌రోడ్డు సమీపంలోని సర్కారీ భూములను గుర్తించాలని జిల్లా యంత్రాంగానికి సూచించింది.
♦ ‘ఔటర్’ జంక్షన్లను రవాణా ఆధారిత కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయం
♦ ఔటర్ కారిడార్లలో సర్కారీ భూములపై హెచ్‌ఎండీఏ కన్ను
♦ భూముల జాబితా పంపమని జిల్లా యంత్రాంగానికి లేఖ
♦ సేకరించే భూముల్లో ఐటీఐఆర్, రవాణా ఆధారిత కేంద్రాల అభివృద్ధి
హైదరాబాద్ మహానగరాభివృద్ధి (హెచ్‌ఎండీఏ) ప్రభుత్వ/అసైన్డ్ భూముల లెక్క తీస్తోంది. ఔటర్‌రింగ్‌రోడ్డు సమీపంలోని సర్కారీ భూములను గుర్తించాలని జిల్లా యంత్రాంగానికి సూచించింది. ఐటీ పెట్టుబడుల అభివృద్ధి ప్రాంతం (ఐటీఐఆర్), రవాణా ఆధారిత కేంద్రాలు (టీఓజీసీ), కౌంటర్ మాగ్నెట్ సిటీలు, ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)ప్రాజెక్టుల అభివృద్ధికి గుర్తించిన భూముల జాబితాను పంపమని జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసింది. రాజధానిని విశ్వనగరంగా మలచాలని కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం.. ఔటర్‌రింగ్‌రోడ్డు జంక్షన్లను రవాణా ఆధారిత కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ప్రతి కారిడార్‌కు పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి.. వాటిని ఐటీఐఆర్ మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా ప్రణాళికలు తయారు చేయాలని సంకల్పించింది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పదమూడు ఔటర్ కారిడార్లను ట్రాన్సిట్ ఓరియెంటెడ్ గ్రోత్ సెంటర్స్ (టీఓజీసీ)గా మలిచేదిశగా ప్రతిపాదనలు తయారు చేస్తోంది. ఈ క్రమంలోనే ఐటీఐఆర్ ప్రతిపాదిత ప్రాంతాల్లో వివిధ హబ్‌లకు చోటు కల్పించేలా మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాలని ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశం నిర్ణయించింది. దీంట్లో భాగంగా బొంగ్లూరు జంక్షన్‌ను టెక్స్‌టైల్, అపరెల్, ఎలక్ట్రానిక్స్,ఐటీ, తుక్కుగూడ ఐటీఐఆర్, ఏరోస్పేస్, హర్డ్‌వేర్ కంపెనీల స్థాపనకు వీలుగా అభివృద్ధి చేయనున్నారు. పెద్దఅంబర్‌పేట కారిడార్ సమీపంలో మీడియా, ఆటోమొబైల్, హోల్‌సేల్ మార్కెట్లను నెలకొల్పేలా మాస్టర్‌ప్లాన్‌ను తయారుచేస్తున్నారు.
ఘట్‌కేసర్ ఐటీ,హెల్త్, ట్రాన్స్‌పోర్టునగర్, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కొలువుదీరనున్నాయి. కీసర ఉన్నత విద్యాసంస్థలు, శామీర్‌పేట పార్కులు, ఎగ్జిబిషన్ గ్రౌండ్లు, మేడ్చల్ లాజిస్టిక్, హెల్త్ గుండ్లపోచంపల్లి, శంషాబాద్ కొత్త మెడికల్ కాలేజీలు, కార్పొరేట్ ఆస్పత్రులు, కోకాపేట ఐఎఫ్‌సీ, బడా ఐటీ సంస్థలు, ఐటీఐఆర్.. తెల్లాపూర్ లాజిస్టిక్ సిటీ , పటాన్‌చెరు ఆటోమొబైల్, పండ్ల మార్కెట్, ఫౌల్ట్రీ, దుండిల్ బయోటెక్, ఫార్మా కంపెనీలు, ఆదిబట్ల ఐటీఐఆర్, ఏరోస్పేస్, హార్డ్‌వేర్ ఆధారిత కేంద్రాల అభివృద్ధికి అనుగుణంగా మాస్టర్‌ప్లాన్‌కు రూపకల్పన చేయాలని ఆదేశించిన ప్రభుత్వం.. ఈ మేరకు ఆయా శాఖల అధికారులతో వర్కింగ్ కమిటీని నియమించింది. ఈ నేపథ్యంలో ఔటర్‌రింగ్‌రోడ్డు కారిడార్లలో సర్కారు, అసైన్డ్ భూములను గుర్తించాలని జిల్లా యంత్రాంగానికి హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు లేఖ రాశారు. మేహ శ్వరం, యాచారం, వికారాబాద్, శంకర్‌పల్లి తదితర ప్రాంతాల్లో సర్కారు భూముల జాబితా, మ్యాపులు, నీటి వనరులు, భూ స్థితిగతులపై నివేదిక పంపమని కోరారు.