=అవసరం లేకున్నా టెస్టులు రాసేస్తున్న వైద్యులు
=రోగ నిర్ధారణ పేరుతో నిలువు దోపిడీ
=ఒక్కో ఆస్పత్రిలో ఒక్కో రేటు
=టెక్నాలజీ పెరిగినా తగ్గని ఖర్చులు
=ఇదీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల తీరు
సాక్షి, సిటీబ్యూరో : తలనొప్పికి ఎంఆర్‌ఐ స్కాన్... అసిడిటీకి టూడీ ఎకో టెస్ట్.. మోకాలి నొప్పికి.. స్పైన్ ఎక్స్‌రే.. ఇదీ నగరంలో పలు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల తీరు. ‘అవసరమున్నా లేకున్నా ఎడాపెడా టెస్టులు రాసేయ్... అందిన కాడికి రోగులను దోచేయ్’ అన్న సూత్రాన్ని ఒంటబట్టించుకొని వైద్యాన్ని వైట్ కాలర్ వ్యాపారంగా మార్చేస్తున్నాయవి. రోగనిర్ధారణ పరీక్షల పేరుతో పేషెంట్లను నిలువుదోపిడీ చేసేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి పలు రాయితీలు పొందే ఈ ‘సూపర్’ ఆస్పత్రులు.. ఆ మేరకు ఉచిత సేవలందించే బాధ్యత మాత్రం విస్మరిస్తున్నాయి.
ఓ సాధారణ డయాగ్నోస్టిక్స్‌లో సీబీపీ (కంప్లీట్ బ్లడ్ పిక్చర్)కి రూ.50 ఖర్చు అవుతుంది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఇదే పరీక్షకు రూ.350కి పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. చెస్ట్ ఎక్స్‌రేకు బయట రూ.100-150 ఖర్చు అవుతుండగా, కార్పొరేట్ ఆస్పత్రుల్లో మాత్రం రూ.500 వరకు చార్జీ చేస్తున్నారు. అదే విధంగా తెల్లరేషన్ కార్డులేని రోగులకు గాంధీలో ఎంఆర్‌ఐ బ్రెయిన్ టెస్ట్‌కు రూ.2000 చార్జీ చేస్తుండగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ. 8500 నుంచి రూ. 12,000 వరకు వసూలు చేస్తున్నారు.
నిజానికి గత పదేళ్లతో పోలిస్తే నగరంలో డయాగ్నోస్టిక్ సెం టర్ల సంఖ్యతోపాటు సాంకేతిక పరిజ్ఞానం కూడా పెరిగింది. అదేస్థాయిలో ఆయా టెస్టుల కోసం ఉపయోగించే మిషనరీ ఖర్చులు కూడా భారీగా తగ్గాయి. కానీ వైద్య పరీక్షల ఖర్చులు తగ్గకపోగా, భారీగా పెరగడాన్ని పరిశీలిస్తే రోగ నిర్ధారణ పేరుతో కార్పొరేట్ ఆస్పత్రులు ఏ స్థాయిలో దోపిడీకి పాల్పడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒకే టెస్టు, ఒకే కంపెనీ మిషన్, కానీ రోగ నిర్ధారణ పరీక్షల పేరుతో ఆస్పత్రులు వసూలు చేస్తున్న చార్జీల్లో మాత్రం భారీగా వ్యత్యాసం కానవస్తోంది.
వైద్యులకూ టార్గెట్లు...
నగరంలోని పలు కార్పోరేట్ ఆస్పత్రులు అందులో పనిచేస్తున్న వైద్యులకు టార్గెట్లు పెడుతున్నాయి. దీంతో వారు అవసరం లేకపోయినా రోగనిర్ధారణ పరీక్షలు రాస్తున్నారు. సాధారణ జ్వరంతో బాధపడుతున్న రోగికి సీబీపీ, సీయూఎస్, ప్లేట్‌లెట్స్ కౌంట్ టెస్టులతో పాటు జబ్బుతో సంబంధం లేని పరీక్షలు రాస్తున్నారంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ‘నేను కొంతకాలంగా ఛాతీలో మంట, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వంటి సమస్యతో బాధపడుతున్నాను. వైద్యుడికి చూపించుకుందామని ఎర్రమంజిల్ సమీపంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్తే, అక్కడి వైద్యులు ఎండోస్కోపి, కొలనోస్కోపిలే కాదు, సమస్యతో సంబంధం లేని సీబీపీ, సీయూపీ, ఈసీజీ, టూడీఎకో వంటి టెస్టులన్నీ రాశారు.
వైద్యులు సిఫార్సు చేశారు కదా! అని ఆయా పరీక్షలన్ని చేయించుకుని రిపోర్టులు తీసుకెళ్లి సంబంధిత వైద్యుడికి చూపిస్తే కడుపులో ఏమీ లేదన్నారు. చివ రకు మసాలాలు కలిగిన ఆహారం తగ్గిస్తే సరిపోతుందన్నారు’ అని బంజారాహిల్స్‌కు చెందిన రఘురామ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నాకు ఇటీవల మోకాళ్ల నొప్పులు ఎక్కువయ్యాయి. ప్యారడైజ్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్తే స్పైన్ ఎక్స్‌రే, సీటీస్కాన్, ఎంఆర్‌ఐ వంటి టెస్టులన్నీ రాసి రూ.50 వేలకు పైగా బిల్లు వేసి చేతికిచ్చారు.
పరీక్షలన్నీ చేయించుకురి రిపోర్టులు తీసుకుని వైద్యుడి వద్దకు వెళ్తే ఏ సమస్య లేదని చెప్పి పంపారు’ అని నల్లగొండకు చెందిన రవీందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘రోగుల ఆర్థిక పరిస్థితి చూస్తే జాలేస్తుంది. కానీ మేము మాత్రం ఏమి చేయగలం. ఆస్పత్రిలో వేతనం తీసుకుంటున్నందుకు యాజమాన్యం చెప్పినట్లు వినాల్సి వస్తోంది. అవసరం లేకపోయినా ఆస్పత్రి అవసరాల దృష్ట్యా రోగ నిర్ధారణ పరీక్షలు రాయాల్సి వస్తోంది. లేదంటే వైద్యులకూ పనిష్మెంట్లు తప్పడం లేదు’ అని సోమాజిగూడలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ సీనియర్ కార్డియాలజిస్ట్ ఆవేదన వ్యక్తం చేశారు.
రాయితీలు పొందినా.. ఉచిత సేవలేవి?
రోగ నిర్ధారణలో కీలకమైన ఎంఆర్‌ఐ, సీటీస్కాన్, ఆల్ట్రాసౌండ్ స్కానింగ్, ఎండోస్కోపి, కొలనోస్కోపి, ఎక్స్‌రే తదితర మిషన్లలో చాలావరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. ప్రభుత్వం వీటికి రాయితీ కూడా ఇస్తుంది. మిషనరీపై ప్రభుత్వం నుంచి రాయితీ పొందినందుకు గానూ ఒప్పందం ప్రకారం ఆస్పత్రుల్లో 20 శాతం ఉచిత సేవలు అందించాల్సి ఉండగా.. నగరంలోని ఏ ఒక్క ఆస్పత్రి కూడా ఈ నిబంధనలు పాటించడం లేదు. చివరకు వైద్య సేవల పేరుతో ఆస్పత్రుల ఏర్పాటు కోసం ప్రభుత్వం నుంచి ఖరీదైన భూములు పొందిన వైద్యులు సైతం వీటిని అమలు చేయడం లేదు. డయాగ్నోస్టిక్ సెంటర్లోనూ, ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ ఒకే కంపెనీకి చెందిన ఎంఆర్‌ఐ, సిటీస్కాన్, ఆల్ట్రాసౌండ్, ఎక్స్‌రే యంత్రాలే ఉన్నా... టెస్టుల పేరుతో అవి వసూలు చేస్తున్న చార్జీల్లో మాత్రం భారీ వ్యత్యాసం కన్పిస్తూ ఉండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెరుగుతున్న ఈ రోగ నిర్ధారణ ఖర్చులను ఎప్పటికప్పుడు నియంత్రించాల్సిన ప్రభుత్వం వీటిని పట్టించుకోవడం లేదు.
నిర్వహణ వ్యయం పెరగడం వల్లే..
నిజానికి ఆస్పత్రులతో పాటు ఎంఆర్‌ఐ, సీటీస్కాన్, ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి యంత్రాల సంఖ్య పెరిగినప్పుడు రోగ నిర్ధారణ పరీక్షల ఖర్చు తగ్గాలి. కానీ గత పదేళ్లతో పోలిస్తే ఆస్పత్రుల నిర్వహణ వ్యయం రెట్టింపైంది. దీనికి తోడు పదేళ్ల క్రితం ఎంఆర్‌ఐ ధర రూ.1.5 కోట్లు ఉంటే, ప్రస్తుతం రూ.3-6 కోట్లకు చేరింది. పెరిగిన ధరల భారాన్ని రోగులపై మోపక తప్పడం లేదు.
- డాక్టర్ భాస్కర్‌రావు, ప్రెసిడెంట్,
ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్
వైట్‌కాలర్ వ్యాపారమైన వైద్యం
మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు.. వైద్యాన్ని వైట్ కాలర్ వ్యాపారంగా మార్చేశాయి. ఇక్కడ పనిచేస్తున్న కొంతమంది వైద్యులు రోగుల ఆరోగ్య, ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా అవసరం లేకపోయినా ప్రతి చిన్న సమస్యకూ ఎంఆర్‌ఐ వంటి ఖరీదైన టెస్టులు రాస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై తప్పుడు ప్రచారం చేస్తూ రోగుల దృష్టిని మరల్చుతున్నారు.
- డాక్టర్ నాగేందర్, ఉస్మానియా శాఖ అధ్యక్షుడు, తెలంగాణ వైద్యుల సంఘం
తలనొప్పితో వెళ్తే ఎంఆర్‌ఐ రాశారు
ఇటీవల తలనొప్పి రావడంతో కొత్తపేటలోని ఓ ఆస్పత్రికి వెళ్లాను. అక్కడి వైద్యుడు ఎంఆర్‌ఐ తీసుకోవాలన్నాడు. రూ.8500 చెల్లించి బ్రెయిన్ ఎంఆర్‌ఐ తీయించాను. రిపోర్టు తీసుకుని మళ్లీ వైద్యుడి వద్దకు వెళ్తే, తీరా ఏమీ లేదని చెప్పి సాధారణ తలనొప్పి మాత్రలు రాసి పంపారు.
- ఎన్.కేశవరాజు, నల్లగొండ
‘సూపర్’ దోపిడీ
Published Mon, Dec 9 2013 3:28 AM | Last Updated on Sat, Sep 2 2017 1:24 AM
Advertisement