
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో ఏ ఒక్కరికీ వైద్యం నిరాకరించకూడదు.. వైద్య ఖర్చులు అందరికీ అందుబాటులో ఉండాలి. ఇది రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా చెబుతున్నా..’అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించారు.వైద్యం అందలేదన్న దైన్యం మన రాష్ట్రంలో అసలే రాకూడదన్నారు. ప్రతి ఒక్కరికీ వైద్యం అందాలన్నదే తన తపన అని చెప్పారు. మంగళవారం ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు, వైద్యులతో రాజ్‌భవన్ నుంచి ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ వైద్య చికిత్స బిల్లుల్లో పూర్తి పారదర్శకత ఉండాలని స్పష్టంచేశారు. పేషెంట్‌ను అడ్మిట్ చేసేటప్పుడే పూర్తి పారదర్శకతతో చికిత్స వివరాలు, ఖర్చులు వివరించాలని, వారి నమ్మకాన్ని చూరగొనాలని ఆమె ఆకాంక్షించారు. ఆస్పత్రుల్లో పడకల అందుబాటు కోసం ‘బెడ్స్ పూల్’విధానం ద్వారా పేషెంట్లకు పడకల వివరాలు ముందే తెలిసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. పేషెంట్లను ఆస్పత్రుల్లో పడకల కోసం అన్ని చోట్లా తిరిగే శ్రమ నుంచి ఉపశమనం కల్పించాలని సూచించారు.
ప్రభుత్వ–ప్రైవేట్ సమన్వయంతో..: కరోనా కేసులు మరిన్ని పెరిగినా ప్రభుత్వ–ప్రైవేట్ సమన్వయంతో అందరికీ వైద్యం అందించే విధం గా సిద్ధంగా ఉండాలని గవర్నర్ సూచించారు. దాదాపు 80% బాధితులకు చాలా తక్కువ స్థాయి లో లక్షణాలుంటాయని, వారికి హోమ్ ఐసోలేషన్ ద్వారా చికిత్స అందించే క్రమంలో వీడియో కన్సల్టేషన్, కౌన్సెలింగ్, టెలి మెడిసిన్ పద్ధతుల్లో నిరంతరం వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. హైదరాబాద్ ఫార్మా, మెడికల్, ఐటీ హబ్‌గా గుర్తింపున్న దృష్ట్యా వీరంతా కలసి టెక్నాలజీ ద్వారా సమన్వయంతో రోగులకు సేవలు, వైద్యం అందించే విధంగా చూడాలని చెప్పారు.
ఈ సందర్భంగా ప్రైవేట్ హాస్పిటల్స్ వైద్యులు గవర్నర్ దృష్టికి కొన్ని సమస్యలు తెచ్చారు. పేషెంట్లు రెమిడెసివిర్, ఫారావిర్ లాంటి ఖరీదైన మందులు అడుగుతున్నారని, ఎక్కువ మంది దీర్ఘకాలిక రోగాలతో వస్తున్నారని, అందుకే వైద్యం ఖర్చు పెరుగుతోందని వివరించారు. రెమిడెసివిర్ లాంటి మందుల కొరత ఉంది, తయారీ పెంచాలి, వాటిపై ప్రభుత్వ సబ్సిడీ కావాలని చెప్పారు.
ఇక వెంటిలేటర్ల తయారీ పెంచాలని, వైద్య సిబ్బందికి ఇన్సూరెన్స్ కల్పించాలని కోరారు. ఈ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని గవర్నర్ చెప్పారు. కాగా మంగళవారం సీఎస్ సోమేశ్‌కుమార్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గవర్నర్ తమిళిసైతో రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. రాష్ట్రంలో కరోనా చికిత్సకు సంబంధించిన వివరాలను ఆమెకు తెలిపారు.