
అమలు చేస్తారా.. అటకెక్కిస్తారా?
ఉద్యోగులకు నగదు రహిత వైద్యంపై ఏపీ సర్కారు నిర్లిప్తం
హెల్త్ కార్డుల ప్యాకేజీల ధరలకు వైద్యానికి కార్పొరేట్ ఆస్పత్రుల నో
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించేందుకు పథకం అమలు చేస్తున్నామంటూ.. హెల్త్ కార్డులు ఇచ్చిన ప్రభుత్వం దానిని అమలు చేసే విషయంలో మాత్రం నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది. నవంబర్ 1 నుంచే ఈ పథకం అమలులోకి తెస్తున్నామని ప్రకటించిన టీడీపీ సర్కారు.. ఆ మాటను నిలబెట్టుకోలేదు.
అనేక రకాల ఆంక్షలు, అలవిమాలిన నిబంధనలు పెట్టటంతో.. ఇలాగైతే నగదు రహిత వైద్యం తాము అమలు చేయలేమని కార్పొరేట్ ఆస్పత్రులు చేతులెత్తేస్తున్నాయి. ఒకవైపు నగదు రహిత వైద్యం అమలు కాని పరిస్థితులు ఉంటే.. మరోవైపు.. డిసెంబర్ 1 నుంచి మెడికల్ రీయింబర్స్‌మెంట్ పథకం రద్దవుతుందని ప్రభుత్వం జారీ చేసిన జీవోలోనే పేర్కొంది. ఇటు నగదు రహిత వైద్యం లేక.. అటు రీయింబర్స్‌మెంటూ లేక ఉద్యోగులు ఇక్కట్లు పడుతున్నారు.
చేతులెత్తేస్తున్న కార్పొరేట్ ఆస్పత్రులు...
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నవంబర్ 1వ తేదీ నుంచి నగదు ప్రమేయం లేని వైద్యం అందిస్తామంటూ హెల్త్ కార్డులు ఇచ్చారు. హెల్త్ కార్డుల పథకం కింద ప్రభుత్వం నిర్ధారించిన ప్యాకేజీల ధరలకు తాము వైద్యం అందించలేమని కార్పొరేట్ ఆస్పత్రులు రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పాయి. ప్రస్తుతానికి ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలకే ఉద్యోగులకూ వైద్యం అందించాలని, ఆరు నెలల తర్వాత సమీక్షించి కొత్త ధరలు నిర్ణయిస్తామని ప్రభుత్వం చెప్తోంది. అందుకు కార్పొరేట్ ఆస్పత్రులు ససేమిరా అంటున్నాయి.
ఓపీ సేవలు ఎండమావే...
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన ఔట్ పేషెంట్ సేవలను ప్రభుత్వాసుపత్రుల్లోనే పొందాలని తాజాగా జీవో జారీచేశారు. దీనికోసం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకూ స్పెషలిస్టులతో ప్రత్యేక క్లినిక్‌లు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం పేర్కొంది.ప్రభుత్వ ఆస్పత్రుల్లో అసలే స్పెషలిస్టులు లేరు. ఉన్న కొద్దిమంది రూ. 50 కీ, రూ. 100 కూ ఓపీ సేవలకు రారనేది వైద్యవిద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి.సూపర్ స్పెషలిస్టులు అసలే లేరు. ప్రభుత్వాస్పత్రులకు వస్తున్న రోగుల్లో 20 శాతం మందికి కూడా రక్తపరీక్షలు చేయడానికి సదుపాయాలు లేవు. ఉద్యోగులకు పరీక్షలు చేయడం సాధ్యం కాదని అధికారులు నివేదించారు. వైద్యం అందక ఉద్యోగులు, పెన్షనర్లు అల్లాడిపోతున్నారు.
సంతకాలే జరగలేదు
‘‘రెండు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటి వరకూ అవగాహనా ఒప్పందాలపై ఎలాంటి సంతకమూ జరగలేదు. నగరంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులేవీ ప్రభుత్వ ప్రతిపాదనను ఆమోదించలేదు. ఓపీలు ఫ్రీ అంటే ఎలా కుదురుతుంది? ఎంప్లాయిస్ హెల్త్ స్కీం చెయ్యలేకపోతే ఆరోగ్యశ్రీ నుంచి తప్పుకోవాలని అంటున్నారు. దానిక్కూడా మేము సిద్ధమే.’’
- డాక్టర్ గురవారెడ్డి, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం అధ్యక్షులు, తెలంగాణ
ఆశించిన స్థాయిలో పథకం లేదు
ఆంధ్రప్రదేవ్ ప్రభుత్వ ఉద్యోగులు ఆశించిన స్థాయిలో హెల్త్ కార్డుల పథకం లేదు. తిరుపతి స్విమ్స్, హైదరాబాద్‌లోని నిమ్స్‌లో కూడా ట్రీట్‌మెంటు ఇవ్వబోమని చెప్తున్నారు. అలాగే.. చిత్తూరు, అనంతపురం ఉద్యోగులు అటు చెన్నై, ఇటు బెంగుళూరులలో వైద్యం చేయించుకుంటారు. ఢిల్లీలో ఉన్న ఏపీ ఉద్యోగుల విషయంలో స్పష్టత లేదు. మేం ఆర్థికశాఖ, వైద్యశాఖ కార్యదర్శులను కలిసి సమస్యలు వివరించాం. ఉద్యోగులకు మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను మరో రెండు నెలలు పొడిగించాలని కోరాం. ఇందుకు వైద్య శాఖ కార్యదర్శి అంగీకరించారు.’’
- అశోక్‌బాబు, ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు
ఈహెచ్‌ఎస్‌పై కుదరని ఏకాభిప్రాయం
విజయవాడ: ఉద్యోగుల ఆరోగ్య పథకంపై ఇప్పటికీ ఏకాభిప్రాయం కుదరలేదు. గురువారం విజయవాడలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్.. ఆశ ప్రతినిధులు, ఎన్‌జీఓ అసోసియేషన్ నేతలతో మూడు గంటల పాటు చర్చలు జరిపినా అవి సఫలం కాలేదు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం తాము వైద్యం అందించలేమని ఆషా తేల్చిచెప్పింది. దీంతో ఈ నెలాఖరుతో ముగియనున్న రీయింబర్స్‌మెంట్ వైద్య సేవలను ఈహెచ్‌ఎస్ సమస్య పరిష్కారం అయ్యేవరకూ కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని మంత్రి కామినేని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా ఈహెచ్‌ఎస్ కార్డులున్న వారందరికీ ఉచిత కన్సల్టేషన్‌తో పాటు ఇన్వెస్టిగేషన్స్ (రక్తపరీక్షలు, ఎంఆర్‌ఐ, సీటీ స్కానింగ్ వంటివి) కూడా ఉచితంగా చేయాలని పేర్కొంది. ఈ విషయంలో ఆశ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఇన్వెస్టిగేషన్స్‌ను స్టాండర్డ్ షెడ్యూల్ రేట్ (ఎస్‌ఎస్‌ఆర్) ప్రకారం చేస్తాం కానీ.. ఉచితంగా చేయలేమని మంత్రికి తేల్చి చెప్పారు.