స్టెంటు.. బిల్లులో స్టంటు | Related to heart surgery | Sakshi
Sakshi News home page

స్టెంటు.. బిల్లులో స్టంటు

Published Wed, Mar 15 2017 1:00 AM | Last Updated on Tue, Sep 5 2017 6:04 AM

స్టెంటు.. బిల్లులో స్టంటు

స్టెంటు.. బిల్లులో స్టంటు

ధరలు తగ్గినా మారని బిల్లు
రోగుల జేబుకు కార్పొరేట్‌ చిల్లు
కొరవడిన నియంత్రణ
ప్రొసీజర్ల పేరిట అదనపు బాదుడు
లబోదిబోమంటున్న రోగులు


గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స సమయంలో అమర్చే స్టెంట్లు కొన్ని కార్పొరేట్‌ ఆస్పత్రులకు కాసులు కురిపిస్తున్నాయి. రాయలసీమలో మెడికల్‌ హబ్‌గా పేరొందిన తిరుపతిలో కొంతకాలంగా ఈ దోపిడీ జరుగుతోంది. ఇటీవల కాలంలో స్టెంట్ల ధరల విషయంలో కేంద్రం స్పందించింది.  ధరల స్థిరీకరణకు అన్ని చర్యలు తీసుకుంది. అయినా ఇక్కడ స్టెంట్ల విషయంలో మార్పు లేదు. స్టెంట్ల ధరలను ప్రభుత్వం భారీగా తగ్గించినా కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రుల తీరు మాత్రం మారడం లేదు. పాత స్టెంట్లను అమర్చుతూ అదేధరను వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వారం క్రితం తిరుపతికి చెందిన ఓ ఉద్యోగి(45 )కి గుండె పోటు   రావడంతో అర్ధరాత్రి నగరంలోని ఓ ప్రయివేట్‌ ఆసుపత్రికి తీసుకొచ్చారు.  పరీక్షించిన వైద్యులు గుండె రక్తనాళాల్లో పూడికను తొలగించే (యాంజియోప్లాస్టీ) ఆపరేషన్‌ చేయాలన్నారు. దీనికి ఖరీదైన స్టెంట్లు పెట్టాలని అందుకు రూ.1.60లక్షలు ఖర్చు అవుతుందని చెప్పి డిశ్చార్జీ అయ్యేలోగా దాదాపు రూ.2.40 లక్షల వరకు పిండేశారు.

పీలేరుకు చెందిన ఓ మహిళ (30)కు గుండె నొప్పి రావడంతో అత్యవసర వైద్యం  కోసం తిరుపతిలోని ఓ పేరున్న ప్రయివేట్‌ ఆసుపత్రికి వచ్చింది. ఆమెకు రక్తనాళాల్లో  పేరుకుపోయిన చెడు రక్తాన్ని తొలగించాలని వైద్యులు తెలిపారు.  అత్యవసర వెద్యం పేరుతో రూ.1.80 లక్షల విలువ చేసే స్టెంట్స్‌ ఆపరేషన్‌ చేసినా ప్రొసీజర్స్‌ పేరుతో రూ.2.25 లక్షలు బిల్లు ఇచ్చారు.  తలకుమించిన భారమైనా అప్పు చేయకతప్పలేదు.

తిరుపతి మెడికల్‌: గుండె ఆపరేషన్లలో వినియోగించే స్టెంట్స్‌ పరికరం గతంలో చాలా ఖరీదు ఉండేది. రూ.90 వేల నుంచి రూ.1.30 లక్షల వరకు కూడా వివిధ కంపెనీల స్టెంట్లు ఉన్నాయి. వీటి గురించి సరైన అవగాహన రోగులకు లేకపోవడంతో ఎక్కువ రేటును ఆస్పత్రులు వసూలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్టెంట్ల ధరలను స్థిరీకరించి తగ్గించింది. రూ.90వేలకు దొరికే స్టెంట్‌ ధర  ప్రస్తుతం అన్ని రకాల పన్నులతో కలిపి రూ.31,800  లభ్యమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఒక్కసారిగా 70 శాతం ధరలు తగ్గిపోయిందని భావిస్తే పొరబాటే.  తిరుపతిలోని కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు వీటి విషయంలో తమ ధోరణి మార్చుకోలేదు.  స్టెంట్ల, ప్రొసీజర్స్‌ బిల్లులు వేరువేరుగా ఇవ్వాలని చెబుతున్నా పట్టించుకోవడం లేదు. స్టెంట్‌ ధర తగ్గినా బిల్లు బాదుడు నుంచి ఉపశమనం కలగడం లేదని రోగులు వాపోతున్నారు. ఇటీవలే స్టెంట్లపై ధరను కచ్చితంగా ముద్రించాలని ఔషధ నియంత్రణ మండలి స్పష్టం చేసింది కూడా.. అయినా ఆస్పత్రులకు ఇవేమీ పట్టడం లేదు.

ఇక్కడి కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో మందుపూత స్టెంట్‌ను ఎక్కువగా కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వినియోగిస్తారు. ప్రస్తుతం మందుపూత స్టెంట్‌తోపాటు అత్యాధునికమైన రక్తనాళాల్లో కరిగిపోయే స్టెంట్‌ను ఉపయోగిస్తున్నారు. మందుపూత స్టెంట్‌ రూ.30 వేల నుంచి రూ.1.30 లక్షల వరకు ధర ఉంటే, కరిగిపోయే స్టెంట్‌ ధర మాత్రం  రూ.1.60 లక్షల వరకు ధర ఉంటోంది. సాధారణ స్టెంట్లు (కరగకుండా ఉండే) రూ.68వేలు, రూ.80 వేలు, రూ.90వేలు చొప్పున అందుబాటులో ఉన్నాయి. వీటిని కూడా వినియోగిస్తున్నారు. స్టెంట్‌ను ప్రభుత్వం సూచించిన విధంగా రూ.31,800 వేలకు విక్రయిస్తున్నట్లు కొన్ని ఆస్పత్రులు చెబుతున్నా మరో రూపంలో ఆ లోటును భర్తీ చేసుకుంటున్నాయి.  ప్రొసీజర్స్‌ పేరుతో దోపిడీ చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్టెంట్‌ ధర బిల్లులో రూ.31,800 వేసినా, వివిధ రకాల సేవల పేరుతో రూ.1.60 నుంచి 2.10 లక్షలు వరకు వసూలుచేస్తున్నారు. రోగి ఆర్థిక స్థితిని బట్టి కూడా చేతివాటం చూపిస్తున్నారని ఆరోపణలున్నాయి. పాత స్టెంట్లను వేస్తూ అదే ధర వసూలు చేస్తున్నాయనే వాదన కూడా ఉంది.

స్విమ్స్‌లో ఇందుకు భిన్నం
సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి స్విమ్స్‌లో స్టెంట్లు, ఆంజియోప్లాస్టీ, ఫేస్‌మేకర్, వాల్వ్‌ వంటి గుండె ఆపరేషన్లు ఏడాదికి 5వేల వరకు చేస్తున్నారు. సగటున రోజుకు 5 స్టెంట్ల ఆపరేషన్లు చేస్తున్నారు. స్విమ్స్‌లో 99 శాతం ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌ వంటి ప్రభుత్వ పథకాల ద్వారా రూ.65వేలు విలువైన స్టెంట్ల ఆపరేషన్లను క్యాష్‌లెస్‌ పేరుతో అందిస్తోంది. ప్రభుత్వం సూచించిన రూ.31,800 ధరలకు స్టెంట్‌ ధర నిర్ణయిస్తే స్విమ్స్‌లో కొన్నేళ్లుగా రూ.23,625లకే స్టెంట్‌లను రోగులకు అందించడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement