
నిఖిల్‌రెడ్డికి న్యాయం చేయండి
ఆస్పత్రిపై చర్య తీసుకోవాలని ఆరోగ్య వుంత్రికి ఫోను
గ్లోబల్ ఆస్పత్రి వద్ద ఎంపీ వీహెచ్ ఆందోళన
గాజులరామారం: కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడికి అదుపు లేకుండా పోతోందని ఆ బాధితుల్లో తానూ ఒకడినని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు వాపోయారు. ఎత్తు పెరగడానికి ఖైరతాబాద్ గ్లోబల్ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్న నిఖిల్ రెడ్డిని మంగళవారం సుచిత్రలోని అతడి నివాసానికి వెళ్లి ఎంపీ పరామర్శించారు. చిన్న ఆపరేషన్‌కు రెండు రోజులు ఆస్పత్రిలో ఉన్నందుకు తనకు రూ. 1.70 లక్షలు చార్జ్ చేశారన్నారు. ఎంపీకే ఇలా జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థమవుతుందన్నారు. నిఖిల్ రెడ్డి తల్లితండ్రులు సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఆస్పత్రిపై ఫిర్యాదు చేసి రెండు నెలలైనా ఎందుకు చర్యల తీసుకోలేదని ప్రశ్నించారు. దీనిపై ఆయన హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డితోఫోన్‌లో మాట్లాడారు. అనంతరం వీహెచ్ ఆస్పత్రి విషయమై ఆరోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డితో గ్లోబల్ ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎత్తు పెరగడానికి ఆపరేషన్ చేయించుకుని మంచానికే పరిమితమైన నిఖిల్ రెడ్డికి నష్టపరిహారంగా రూ. 5 కోట్లు హాస్పటల్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
గ్లోబల్ ఆస్పత్రి ఎదుట ఎంపీ వీహెచ్ ఆందోళన
ఖైరతాబాద్: ఎత్తు పెంచుతామని శస్త్రచికిత్స చేసిన డాక్టర్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ వుంగళవారం రాత్రి ఎంపీ వి.హన్మంతరావు, నిఖిల్‌రెడ్డి తండ్రి గోవర్ధన్‌రెడ్డితో కలిసి గ్లోబల్ ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. ఆపరేషన్ చేసి రెండు నెలలవుతున్నా నిఖిల్ నడవలేని పరిస్థితిలో ఉన్నాడ న్నారు. నిఖిల్‌రెడ్డి విషయంలో సర్జరీ ప్రయోగాత్మకంగా చేశారని, ఇది అనైతిక శస్త్రచికిత్సగా ఆయన పేర్కొన్నారు. ఇందుకు కారణమైన డాక్టర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. లేకుంటే న్యాయ పోరాటం చేస్తామని ఆందోళన విరమించారు.