Nikhil reddy
-
దుఃఖ సాగరం
కుషాయిగూడ: స్నేహితులతో విహారయాత్రకు వెళ్లి పాండిచ్చేరి బీచ్‌లో సోమవారం గల్లంతైన నగరవాసి నారెడ్డి నిఖిల్‌రెడ్డి మృతదేహాం బుధవారం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. మృతదేహాన్ని విల్లుపురం పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. నగరానికి నేడు అవకాశముందని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. కుషాయిగూడ శ్మశానవాటికలో అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విషాద ఛాయలు.. శోక సంద్రంలో మునిగిన నిఖిల్‌రెడ్డి కుటుంబ సభ్యులను టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బండారి లక్ష్మారెడ్డి పరామర్శించారు. నిఖిల్ తల్లి రేణుకను, కుటుంబ సభ్యులను ఓదార్చారు. నిఖిల్‌రెడ్డి మరణవార్త తెలియడంతో ఆయన స్వగృహం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ఆపరేషన్..పరేషాన్
-
కిడ్నాపైన బాలుడు సురక్షితం
తెనాలి : గుంటూరు జిల్లాలో కిడ్నాప్‌కు గురైన బాలుడి కథ సుఖాంతమైంది. తెనాలి మారీస్‌పేటలో రెండు రోజుల క్రితం ఇంటి దగ్గర ఆడుకుంటున్న నిఖిల్ రెడ్డి(2) అనే చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. నిఖిల్ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. స్థానిక సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఫుటేజీలో ఓ వ్యక్తి నిఖిల్ రెడ్డిని తీసుకువెళ్తున్నట్లు స్పష్టంగా కనపడింది. ఆ దిశగా పోలీసులు కేసును దర్యాప్తు చేయడంతో కేసు కొలిక్కి వచ్చింది. విజయవాడ సమీపంలో నిఖిల్‌రెడ్డిని పోలీసులు గుర్తించారు. చిన్నారి ఆచూకీ తెలియడంతో నిఖిల్ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భారత సంతతి బాలుడి అరుదైన ఘనత!
బ్రిస్బేన్: భారత సంతతికి చెందిన బాలుడు జూనియర్ చెస్ చాంపియన్ షిప్ లో సత్తాచాటాడు. నికిల్ రెడ్డి అనే ఎనిమిదేళ్ల బాలుడు ఆస్ట్రేలియాలో జరిగిన చెస్ చాంపియన్ షిప్ లో విజేతగా నిలిచాడు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియా జూనియర్ చెస్ చాంపియన్ షిప్-2017 (ఏజేసీసీ) నిర్వహించారు. ఇందులో భారత సంతతికి చెందిన కర్రి బుచ్చిరెడ్డి, సంధ్యారెడ్డి దంపతుల కుమారుడు నికిల్ రెడ్డి పాల్గొన్నాడు. భారత సంతతికి చెందిన వీరు సిడ్నీ న్యూసౌత్ వెల్స్ లో నివాసం ఉంటున్నారు. ఈ చాంపియన్‌షిప్ మూడు రోజుల్లో మొత్తం తొమ్మిది రౌండ్లపాటు నిర్వహించారు. తుది ఫలితాలలో ఎక్కువ పాయింట్లు సాధించిన నిఖిల్ చాంపియన్‌షిప్ సాధించాడు. చిన్నప్పటినుంచీ నిఖిల్‌కు చెస్ అంటే ఎంతో ఇష్టమని, గేమ్‌పై ఉన్న ఆసక్తిని గమనించి కోచింగ్ ఇప్పించామని నిఖిల్ తండ్రి బుచ్చిరెడ్డి తెలిపారు. తరచుగా సోదరుడు నీయిల్ రెడ్డితో ప్రాక్టీస్ చేస్తూ ఆటపై పట్టుసాధించేందుకు నిఖిల్ తాపత్రయ పడేవాడని చెప్పారు. ఎట్టకేలకు ఆస్ట్రేలియా టాప్ మోస్ట్ చెస్ చాంపియన్ షిప్ సాధించి, భారతీయులు గర్వపడేలా చేశాడని కుమారుడిని తండ్రి బుచ్చిరెడ్డి ప్రశంసల్లో ముంచెత్తారు. -
7 నెలల తర్వాత నిఖిల్‌రెడ్డి నడిచాడు..
-
నిఖిల్‌రెడ్డి నడిచాడు..
హైదరాబాద్: అడుగులో అడుగు వేసుకుంటూ నిఖిల్‌రెడ్డి నడక నేర్చుకుంటున్నాడు. గ్లోబల్ ఆస్పత్రిలో ఎత్తు పెరగడానికి ఆపరేషన్ చేరుుంచుకున్న నిఖిల్ సుమారు 7 నెలల 22 రోజుల తర్వాత ఇప్పుడే లేచి నిలబడుతున్నాడు. మంగళవారం వాకర్ సాయంతో ఇంటిలో కొన్ని అడుగులు నడిచాడు. ‘చాలా రోజుల తర్వాత మా అబ్బారుు నడవడానికి ప్రయత్నిస్తున్నాడు. నొప్పిగా ఉన్నా కొన్ని అడుగులు వేశాడు. చాలా సంతోషంగా ఉంది’ అని నిఖిల్‌రెడ్డి తండ్రి గోవర్ధన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. వాకర్ సాయంతో అడుగులు వేస్తున్న నిఖిల్ రెడ్డి -
మూడు వారాల తర్వాతే రాడ్ల తొలగింపు
-
మూడు వారాల తర్వాతే రాడ్ల తొలగింపు
నిఖిల్‌రెడ్డి పరిస్థితిపై వైద్యబృందం సాక్షి, హైదరాబాద్: ఎత్తుపెంపు చికిత్స చేరుుంచుకున్న బాధితుడు నిఖిల్‌రెడ్డి రెండు కాళ్లలో అమర్చిన రాడ్లను తొలగించే అంశంపై మరో మూడు వారాల తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్(టిశా) ఏర్పాటు చేసిన ముగ్గురు నిపుణులతో కూడిన వైద్య బృందం స్పష్టం చేసింది. అప్పటి వరకు యధావిధి వైద్య సేవలు కొనసాగించనున్నట్లు ప్రకటించింది. కాళ్లలో ఏర్పాటు చేసిన రాడ్లను వదులు చేసి, ఎలాంటి సమస్య లేదని నిర్ధారణకు వచ్చిన తర్వాతే వాటిని తొలగిస్తామని పేర్కొంది. శనివారం గ్లోబల్ ఆస్పత్రికి వచ్చిన నిఖిల్‌రెడ్డిని వైద్య బృందం పరిశీలించింది. ఇదిలా ఉంటే అనైతిక చికిత్సలు చేసి తన కొడుకు కాళ్లు కోసిన వైద్యుడు చంద్రభూషణ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ గోవర్థన్‌రెడ్డి.. నగర కమిషనర్ మహేందర్‌రెడ్డిని కలిశారు. న్యాయ సలహా తీసుకుని సాధ్యమైనంత త్వరలో సదరు వైద్యునిపై చర్యలు తీసుకుంటామని సీపీ హామీ ఇచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. -
నిఖిల్ వైద్య సేవలపై గందరగోళం
-
ఇంకా మానని గాయం..
► నిఖిల్‌రెడ్డికి తదుపరి వైద్య సేవలపై గందరగోళం ► ప్రభావం చూపుతున్న తెలంగాణ వైద్య మండలి తీర్పు ► ఆంక్షలతో వైద్యం చేయలేని స్థితిలో డాక్టర్ చంద్రభూషణ్ సాక్షి, హైదరాబాద్: ఎత్తుపెంపు శస్త్రచికిత్స చేయించుకున్న నిఖిల్‌రెడ్డికి తదుపరి వైద్య సేవలు అందించే అంశంపై గందరగోళం నెలకొంది. తెలంగాణ వైద్య మండలి తీర్పు నేపథ్యంలో నిఖిల్‌కు శస్త్రచికిత్స చేసిన డాక్టర్ చంద్రభూషణ్ వైద్యం చేయలేని పరిస్థితి ఎదురైంది. దీంతో నిఖిల్‌కు ఇకపై వైద్యసేవలు ఎవరు అందిస్తారనే అంశం ప్రశ్నార్థకంగా మారింది. ఒప్పందం మేరకు గాయం పూర్తిగా మానే వరకు శస్త్రచికిత్స చేసిన డాక్టరే స్వయంగా బాధితుని ఇంటికి వెళ్లి వైద్య సేవలు అందించాలి. ఇప్పటి వరకు డాక్టర్ చంద్రభూషణే స్వయంగా బాధితుని ఇంటికి వెళ్లి వైద్యం అందించారు. అయితే తమకు కనీసం మాట కూడా చెప్పకుండా తమ కుమారునికి ఎత్తుపెంపు శస్త్రచికిత్స చేయడం అనైతికమని ఆరోపిస్తూ నిఖిల్ తండ్రి గోవర్ధన్ రెడ్డి ఎంసీఐకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ వైద్య మండలి చంద్రభూషణ్‌పై రెండేళ్లు వేటు వేసింది. తీర్పు నేపథ్యంలో ఆయన బాధితునికి వైద్యం చేయలేని స్థితి. ఆయన స్థానంలో ఎవరు వైద్యం అందిస్తారో కూడా ఆస్పత్రి యాజమాన్యం ఇప్పటి వరకు స్పష్టం చేయలేదు. దీంతో నిఖిల్‌కు వైద్యసేవలు అందించే అంశం ప్రశ్నార్థకమైంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం: గ్లోబల్ యాజమాన్యం నిఖిల్‌కు వైద్యం చేసేందుకు ఇప్పటి వరకు డాక్టర్ చంద్రభూషణే స్వయంగా బాధితుని ఇంటికి వెళ్లేవారు. ప్రస్తుతం ఎంసీఐ ఆయనపై ఆంక్షలు విధించింది. అయినప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం. ప్రస్తుతం బాధితుడు నడుస్తున్నాడు. మెట్లు కూడా ఎక్కి దిగుతున్నాడు. ఆయన ఆరోగ్యం కూడా మెరుగుపడింది. బాధితుడు నడవగలిగే స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆస్పత్రికి రావాల్సిందిగా సూచించాం. దానికి వారి తల్లిదండ్రులు అంగీకరించారు. బాధితునికి పూర్తిస్థాయి వైద్యసేవలు అందిస్తాం. ఇప్పటికే ప్రత్యామ్నాయ వైద్యులను కూడా ఏర్పాటు చేశాం. గాయాన్ని శుభ్రం చేసి 11 రోజులైంది నిఖిల్‌కు ఎత్తుపెంపు శస్త్రచికిత్స చేసి ఎనిమిది మాసాలైంది. ఇంకా గాయం మానలేదు. లేచి నాలుగు అడుగులు వేస్తే కాళ్లు వాస్తున్నాయి. ఇప్పటికీ భరించలేని నొప్పితో బాధపడుతున్నాడు. మా అభ్యంతరం మేరకు ఎత్తు పెంపు ప్రక్రియను మధ్యలోనే నిలిపివేశారు. కానీ రెండు కాళ్లకు వేసిన రాడ్లు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. గాయం మానకపోవడంతో దానికి కట్టుకట్టారు. ఇన్ఫెక్షన్ రాకుండా ఎప్పటికప్పుడు కట్లను విప్పి శుభ్రం చేయాల్సి ఉన్నా.. 11 రోజుల నుంచి ఎవరూ రాలేదు. ఆస్పత్రికి ఫో¯ŒS చేస్తే.. సరైన స్పందన రావడం లేదు. అదేమంటే డాక్టర్‌పై ఫిర్యాదు చేసి.. సస్పెండ్ చేయించారు కదా.. అంటూ వైద్య సేవల బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారు. – గోవర్ధన్ రెడ్డి, నిఖిల్ తండ్రి -
'ఆ డాక్టర్‌పై క్రిమినల్కేసు పెట్టాలి'
సాక్షి, హైదరాబాద్: వైద్య ప్రమాణాలు, నైతిక విలువలను తుంగలో తొక్కి డబ్బు సంపాదనే లక్ష్యంగా నిఖిల్‌రెడ్డి ఎత్తు పెంచడానికి శస్త్రచికిత్స చేసిన డాక్టర్ చంద్రభూషణ్‌ను వైద్య వృత్తి నుంచి రెండేళ్లు సస్పెండ్ చేయడం ఆలస్యమైనా సరైన నిర్ణయమని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి అన్నారు. డాక్టర్, గ్లోబల్ఆసుపత్రి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నిఖిల్ కుటుంబానికి ఆసుపత్రి యాజమాన్యం కనీసం రూ.కోటి పరిహారమివ్వాలన్నారు. -
ఆలస్యమైనా మంచి నిర్ణయమే: కిషన్‌రెడ్డి
హైదరాబాద్: వైద్య ప్రమాణాలు, నైతిక విలువలను తుంగలో తొక్కిన డాక్టర్ చంద్రభూషణ్‌ను సస్పెండ్ చేయడం ఆలస్యమైనా సరైన నిర్ణయమని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మోసపూరితంగా వ్యవహరించిన డాక్టర్, గ్లోబల్ ఆసుపత్రి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మెడికల్ కౌన్సిల్ సిఫారసు చేయకపోవడం సమంజసం కాదన్నారు. ఆరు నెలలుగా నిఖిల్ కుటుంబం అనుభవిస్తున్న మానసిక క్షోభ, ఆర్థిక ఇబ్బందులకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత మెడికల్ కౌన్సిల్‌పై ఉందన్నారు. డాక్టర్ చంద్రభూషణ్, సీఈవో శివాజీ చటోపాధ్యాయ, గ్లోబల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
గ్లోబల్ ఆసుపత్రి లెసైన్స్ రద్దు చేయాలి
హెచ్చార్సీలో నిఖిల్‌రెడ్డి తండ్రి ఫిర్యాదు హైదరాబాద్: గ్లోబల్ ఆసుపత్రి యాజమా న్యం తక్షణమే నిఖిల్ రెడ్డికి పూర్తిస్థాయి ఉచిత వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన తండ్రి ఎస్.గోవర్ధన్‌రెడ్డి బుధవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను కోరారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్.మల్లారెడ్డి, బీజేపీ నేత డాక్టర్ కె.రాజా గౌడ్‌తో కలసి బుధవారం నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు వెళ్లిన గోవర్ధన్ గ్లోబల్ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నిఖిల్ రెడ్డికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. మెడికల్ కౌన్సిల్ నిబంధనలు ఉల్లంఘించిన గ్లోబల్ ఆసుపత్రి లెసైన్స్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిఖిల్‌రెడ్డికి సర్జరీ చేసిన డాక్టర్ చంద్రభూషణ్ వైద్యవృత్తిలో కొనసాగకుండా నిషేధించాలని కోరారు. నిఖిల్ రెడ్డిని మోసం చేసిన ఆసుపత్రి సీఈవో శివాజీ ఛటోపాధ్యాయ, డాక్టర్ చంద్రభూషణ్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై నిపుణులైన డాక్టర్లతో విచారణ జరిపించాలని అన్నారు. -
గ్లోబల్ ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలి
అశాస్త్రీయ పద్దతిలో ఆపరేషన్ నిర్వహించిన ఆస్పత్రి యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు హెచ్ఆర్సీని ఆశ్రయించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నిఖిల్ రె డ్డి ఎత్తు పెంచే ఆపరేషన్ చేసిన ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని బుధవారం నిఖిల్ రెడ్డి తండ్రి బీజేపీ నాయకులతో కలిసి హెచ్ఆర్సీని ఆశ్రయించారు. గ్లోబల్ ఆస్పత్రిలో అనైతిక పద్దతిలో ఎత్తు పెంచే సర్జరీ చేయడం వల్ల నిఖిల్ రెడ్డి అనుక్షణం నరకయాతన అనుభవిస్తున్నాడని ఆరోపిస్తూ.. అందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. -
నిఖిల్ కి రూ.కోటి పరిహారం ఇవ్వాలి
♦ గ్లోబల్ ఆస్పత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలి ♦ సీఎస్ రాజీవ్ శర్మను కోరిన బీజేపీ ముఖ్య నేతలు సాక్షి, హైదరాబాద్: ఎత్తు పెంపు పేరుతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిఖిల్‌రెడ్డి కాళ్లకు అశాస్త్రీయ పద్ధతిలో శస్త్రచికిత్స నిర్వహించిన గ్లోబల్ ఆస్పత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను గురువారం సచివాలయంలో కలసి ఈ ఉదంతంపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. అనంతరం బీజేపీ శాసనసభాపక్ష ఉప నేత చింతల రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు ఎస్.మల్లారెడ్డి, ఎం.చంద్రయ్యలతో కలసి విలేకరులతో మాట్లాడారు. నిఖిల్‌రెడ్డికి చేసిన శస్త్రచికిత్స హైదరాబాద్‌లో జరగడం ఇదే తొలిసారి అని, వైద్య ప్రయోగాల కోసం నిఖిల్‌రెడ్డిని పావుగా వాడుకున్నారని, నిఖిల్‌రెడ్డి ఎక్స్‌పెరిమెంట్‌గా ప్రచారం కోసమే ఈ శస్త్రచికిత్స జరిపారని మండిపడ్డారు. వైద్యం పేరుతో ప్రజలను దోచుకోడానికి ఇలా కొత్త మార్గాన్ని కనుక్కున్నారని ఆరోపించారు. కుటుంబ సభ్యులకు సైతం సమాచారం ఇవ్వకుండా శస్త్రచికిత్స నిర్వహించడం అక్రమమన్నారు. వారం రోజుల్లోనే కోలుకుంటావని నిఖిల్‌రెడ్డికి వైద్యులు హామీ ఇచ్చారని, రెండు నెలలు గడుస్తున్నా అతను కదలలేని స్థితిలో నరకయాతన అనుభవిస్తున్నాడని చెప్పారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టకపోవడం దురదృష్టకరమన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి సైతం నిఖిల్‌రెడ్డిని పరామార్శించడానికి రాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. ఈ ఘటనపై భారత వైద్య మండలి(ఎంసీఐ)కి ఫిర్యాదు చేస్తామన్నారు. గ్లోబల్ ఆస్పత్రి యాజమాన్యం నుంచి నిఖిల్‌రెడ్డికి రూ.కోటి పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. నిఖిల్‌రెడ్డిని మోసం చేసిన ఆస్పత్రి సీఈవో శివాజీ చటోపాధ్యాయ, వైద్యుడు చంద్రభూషణ్‌పై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కార్పొరేట్ ఆస్పత్రులపై నిఘా ఉంచాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
నిఖిల్‌రెడ్డికి న్యాయం చేయండి
ఆస్పత్రిపై చర్య తీసుకోవాలని ఆరోగ్య వుంత్రికి ఫోను గ్లోబల్ ఆస్పత్రి వద్ద ఎంపీ వీహెచ్ ఆందోళన గాజులరామారం: కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడికి అదుపు లేకుండా పోతోందని ఆ బాధితుల్లో తానూ ఒకడినని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు వాపోయారు. ఎత్తు పెరగడానికి ఖైరతాబాద్ గ్లోబల్ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్న నిఖిల్ రెడ్డిని మంగళవారం సుచిత్రలోని అతడి నివాసానికి వెళ్లి ఎంపీ పరామర్శించారు. చిన్న ఆపరేషన్‌కు రెండు రోజులు ఆస్పత్రిలో ఉన్నందుకు తనకు రూ. 1.70 లక్షలు చార్జ్ చేశారన్నారు. ఎంపీకే ఇలా జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థమవుతుందన్నారు. నిఖిల్ రెడ్డి తల్లితండ్రులు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఆస్పత్రిపై ఫిర్యాదు చేసి రెండు నెలలైనా ఎందుకు చర్యల తీసుకోలేదని ప్రశ్నించారు. దీనిపై ఆయన హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డితోఫోన్లో మాట్లాడారు. అనంతరం వీహెచ్ ఆస్పత్రి విషయమై ఆరోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డితో గ్లోబల్ ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎత్తు పెరగడానికి ఆపరేషన్ చేయించుకుని మంచానికే పరిమితమైన నిఖిల్ రెడ్డికి నష్టపరిహారంగా రూ. 5 కోట్లు హాస్పటల్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గ్లోబల్ ఆస్పత్రి ఎదుట ఎంపీ వీహెచ్ ఆందోళన ఖైరతాబాద్: ఎత్తు పెంచుతామని శస్త్రచికిత్స చేసిన డాక్టర్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ వుంగళవారం రాత్రి ఎంపీ వి.హన్మంతరావు, నిఖిల్‌రెడ్డి తండ్రి గోవర్ధన్‌రెడ్డితో కలిసి గ్లోబల్ ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. ఆపరేషన్ చేసి రెండు నెలలవుతున్నా నిఖిల్ నడవలేని పరిస్థితిలో ఉన్నాడ న్నారు. నిఖిల్‌రెడ్డి విషయంలో సర్జరీ ప్రయోగాత్మకంగా చేశారని, ఇది అనైతిక శస్త్రచికిత్సగా ఆయన పేర్కొన్నారు. ఇందుకు కారణమైన డాక్టర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. లేకుంటే న్యాయ పోరాటం చేస్తామని ఆందోళన విరమించారు. -
'నిఖిల్‌ను ప్రయోగవస్తువుగా వాడుకున్నారు'
గాజులరామారం: ఎత్తు పెరగాలన్న యువకుడి ఆసక్తిని అవకాశంగా తీసుకుని గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు అతనిపై ఆపరేషన్ పేరుతో ప్రయోగాలు చేసి బలి పశువుని చేశారని బీజేపీ శాసన సభ పక్ష నేత కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఎంఎన్ రెడ్డి నగర్‌లోని నిఖిల్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇంతకుముందు ఎవరికీ చేయని ఆపరేషన్‌ను నిఖిల్‌పై ప్రయోగాత్మకంగా చేసి అతని భవిష్యత్‌ను నాశనం చేశారన్నారు. 6 నెలలుగా ఎత్తు పెరగాలని తమను సంప్రదిస్తున్న నిఖిల్‌ను వైద్యులు తప్పుదారి పట్టించి అపరేషన్ చేసి చేతులు దులుపుకున్నారన్నారు. శస్త్ర చికిత్సకు ముందు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలన్న నిబంధనను కూడా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. దీనిపై బీజేపీ తరపున ప్రభుత్వ ఛీప్ సెక్రెటరీని కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సమస్యను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళతామన్నారు. ఆపరేషన్ చేసిన డాక్టర్ గుర్తింపును రద్దు చేయడంతో పాటు గ్లోబల్ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలన్నారు. బాధితునికి వైద్యం అందించాలని, నష్టపరిహారం చెల్లించాలని, భవిష్యత్‌లో ఎవరూ ఇలాంటి చికిత్సలను చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. -
వాడి బాధ చూడలేకపోతున్నాం.. చికిత్స నిలిపేయండి
వైద్యుడికి నిఖిల్‌రెడ్డి తల్లిదండ్రుల అభ్యర్థన సాక్షి, హైదరాబాద్: మూడు ఇంచుల ఎత్తు పెంపు కోసం కాళ్లకు శస్త్రచికిత్స చేసుకున్న ఇంజనీరింగ్ విద్యార్థి నిఖిల్‌రెడ్డి కోరిక నెరవేరకుండానే చికిత్స ప్రక్రియ నిలిచిపోయింది. తమ కొడుకు రోజూ పడుతున్న నరకయాతన చూడలేకపోతున్నామని, రెండు కాళ్లలో ‘ఇల్‌జర్వ్’ పద్ధతిలో వేసిన రాడ్లతో ఎముకల పెంపు చికిత్సను నిలిపేయాల్సిందిగా తండ్రి గోవర్ధన్‌రెడ్డి వైద్యులను కోరారు. ఈ మేరకు వీడియో ఫుటేజీతో పాటు, లిఖిత పూర్వక లేఖను గ్లోబల్ ఆసుపత్రి వైద్యుడు చంద్రభూషణ్‌కు అందజేశారు. రెండు మాసాల్లో నిఖిల్‌రెడ్డి కాళ్ల ఎముకలు 1.1 ఇంచుల మేర పెరిగాయని వైద్యులు చెబుతుంటే... పెరిగింది కండ మాత్రమేనని అతడి తల్లిదండ్రులు పేర్కొన్నారు. నొప్పుల బాధ భరించలేక రోజూ మూడు పెయిన్‌కిల్లర్ ఇంజక్షన్లు తీసుకోవాల్సి వస్తోందన్నారు. అనైతికంగా, అశాస్త్రీయంగా తన కుమారుడికి చేసిన శస్త్రచికిత్స విఫలమైందని గోవర్ధన్ ఆవేదన వ్యక్తం చేశారు. మరెవరూ తన కుమారుడిలా బాధ పడకూడదని, ఈ విషయంలో న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. మెడికల్ కౌన్సిల్ విచారణ: నిఖిల్‌రెడ్డి శస్త్రచికిత్సపై ఇప్పటికే ఫిర్యాదులు స్వీకరించిన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విచారణను ముమ్మరం చేసింది. నిఖిల్ ఆరోగ్య పరిస్థితి, వైద్యులు ఏం చెప్పారు తదితర వివరాలు ఇవ్వాలని అతడి తండ్రి గోవర్ధన్‌రెడ్డికి లేఖ పంపించింది. -
నమ్మి మోసపోయా...
- వారం రోజులన్నారు...రెండు నెలలైనా నడవలేకపోతున్నా - అంగుళం కూడా పెరగలేదు నిఖిల్‌రెడ్డి ఆవేదన సాక్షి, హైదరాబాద్: ‘డాక్టర్ చెప్పిన మాటలు నమ్మి మోసపోయా. మూడు అంగుళాలు పెరుగుతావన్నారు. ఇప్పటివరకు అంగుళం కూడా పెరగలేదు. వారం రోజుల్లో స్వయంగా నడుస్తావని చెప్పారు. శస్త్రచికిత్స చేసి రెండు మాసాలు దాటింది. నడవడం కాదు కదా కనీసం లేచి నిలబడలేకపోతున్నా. నొప్పులకు నిద్ర కూడా పట్టడం లేదు. నరకయాతన అనుభవిస్తున్నా’ అని ఏప్రిల్ 5న గ్లోబల్ ఆస్పత్రిలో ఎత్తు పెరిగేందుకు శస్త్రచికిత్స చేయించుకున్న నిఖిల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు శనివారం తన ఇంట్లో విలేకరులతో మాట్లాడాడు. ‘ఎత్తు పెంచుతామన్న వైద్యుల మాటలు నమ్మి మోసపోయా. శస్త్రచికిత్స గాయాలు ఇంకా మానలేదు. తరచూ ఇన్ఫెక్షన్ వస్తోంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సమయంలో తానే రెండు రోజులకోసారి ఇంటికి వచ్చి చికిత్స చేస్తానని డాక్టర్ చంద్రభూషణ్ లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చారు. ఆ తర్వాత నన్ను పట్టించు కోకుండా వదిలేశారు. కనీసం పది రోజులకోసారి కూడా రావడం లేదు. ఇకపై నాలాగా మరెవరూ మోసపోవద్దు. ఇంట్లో చెప్పకుండా శస్త్రచికిత్స చేయించుకుని నేను బాధపడటమే కాకుండా ఇంట్లో వారిని కూడా ఇబ్బంది పెడుతున్నా’ అని నిఖిల్ చెప్పాడు. గాయాలు పచ్చిగానే ఉన్నాయని, నొప్పులతో కుమారుడు పడుతున్న బాధను చూసి తట్టుకోలేకపోతున్నామని నిఖిల్ తండ్రి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. ఈ అంశంపై చర్చలు జరపడానికి వైద్యులు ఇంటికి వస్తామన్నారని, కానీ మీడియా కూడా వస్తుందని తెలియడంతో రాలేదని వెల్లడించారు. దీనిపై అన్నిరకాలా న్యాయపోరాటం చేస్తానన్నారు. 1.1 ఇంచులు పెరిగాడు... చికిత్స విజయవంతమైంది. శస్త్రచికిత్సకు ముందుతో పోలిస్తే ప్రస్తుతం నిఖిల్ 1.1 ఇంచుల ఎత్తు పెరిగాడు. అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. ఎందుకో తెలియదు కానీ... నిఖిల్ కుటుంబ సభ్యులు చికిత్స నిలిపివేయమంటున్నారు. వారి వాదనలను న్యాయవాది సమక్షంలో వీడియో రికార్డు చేసి, ఆ తర్వాతే చికిత్స నిలిపివేస్తాం. ఆ తర్వాత వెయిట్ బేరింగ్ ప్రక్రియతో నడిచేలా చర్యలు తీసుకుంటాం. అతడిని పట్టించుకోవడం లేదనే ఆరోపణల్లో వాస్తవం లేదు. అతని ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నా. నిఖిల్ ఇంటికి కూడా వెళ్తున్నా. - డాక్టర్ చంద్రభూషణ్, చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, గ్లోబల్ ఆస్పత్రి -
మంచంపైనే నిఖిల్
ఆపరేషన్ జరిగి 50 రోజులైనా కదలలేని స్థితే హైదరాబాద్: నిఖిల్‌రెడ్డి... ఎత్తు పెరిగేందుకు నగరంలోని గ్లోబల్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న 22 ఏళ్ల యువకుడు ఇంకా మంచానికే పరిమితయ్యాడు. ఆపరేషన్ జరిగి యాభై రోజులయినా అడుగు కదపలేకపోతున్నాడు. జీడిమెట్లలోని మర్రి నారాయణరెడ్డినగర్లో నివసిస్తున్న నిఖిల్ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. వారం రోజుల్లో నడుస్తావని వైద్యులు చెప్పిన మాటలు అబద్ధాలని తేలింది. ఆరోగ్యం అంతకంతకూ క్షీణిస్తూ... నొప్పులు బాధిస్తూ... పెయిన్కిల్లర్లతో బతుకుతూ... వేరొకరు తోడుంటే గానీ నడవలేని దయనీయ స్థితిలో కాలం వెళ్లదీస్తున్నాడు. ఈ బాధ చూసి అతడి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కాగా, మూడంగుళాల ఎత్తు పెరుగుతావంటూ నిఖిల్‌రెడ్డికి గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు ఏప్రిల్ 5న శస్త్రచికిత్స చేశారు. రెండు రోజుల్లో లేచి తిరుగుతావని ఆపరేషన్ చేసిన వైద్యుడు చంద్రభూషణ్ నాడు చెప్పినా... నేటికీ మంచం దిగలేకపోతున్నాడు నిఖిల్. ‘డిశ్చార్జి అయిన తరువాత నుంచి రోజూ ఇంటికి వచ్చి ఫిజియోథెరపీ చేయిస్తామన్న వైద్యులు, వారానికోమారు వచ్చి వెళ్లిపోతున్నారు. పెయిన్‌కిల్లర్ మాత్రలు రోజూ వేసుకోమంటూ ఫోన్లోనే సలహా ఇచ్చి తప్పించుకొంటున్నారు’ అని నిఖిల్ తండ్రి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. తప్పు చేశా... ‘నేను తీసుకున్న నిర్ణయం తప్పు. నా వల్ల ఇంట్లో వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. సర్జరీ జరిగి యాభై రోజులైనా కనీసం నిలబడలేకపోతున్నా. ఆపరేషన్ సమయంలో రోజుకు 1 ఎంఎం బోన్ పెరుగుతుందని వైద్యులు చెప్పిన మాటలన్నీ అబ ద్ధాలే. నాన్న సాయం లేనిదే ఏమీ చేయలేకపోతున్నా. ఆపరేషన్ చేసిన ప్రాంతమంతా దద్దుర్లు వచ్చి విపరీతమైన దురద పుడుతోంది. ఇన్ఫెక్షన్ అయి పుండ్లు వచ్చాయి. ఇన్ని రోజులు సెలవుల్లో ఉంటే తిరిగి జాబ్ ఇస్తారన్న గ్యారంటీ లేదు’ అని నిఖిల్ ఆవేదన వ్యక్తం చేశాడు. -
గ్లోబల్ నుంచి నిఖిల్‌రెడ్డి డిశ్చార్జ్
ఈ ఘటనపై ఎంసీఐ విచారణ ప్రారంభం సాక్షి, హైదరాబాద్: ఇటీవల ఎత్తుపెంపు శస్త్రచికిత్స చేయించుకున్న నిఖిల్‌రెడ్డిని వైద్యులు బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆయన ఆరోగ్యం కొంత మెరుగు పడటంతో ఆస్పత్రి నుంచి ఇంటికి పంపినట్లు డాక్టర్ చంద్రభూషణ్ తెలిపారు. అయితే డిశ్చార్జ్‌కి తల్లిదండ్రులు అంగీకరించలేదు. శస్త్రచికిత్స చేసి 15 రోజులైనా ఇప్పటి వరకు నిఖిల్‌రెడ్డి నడవలేకపోతున్నాడని, నొప్పితో బాధపడుతున్నాడని,ఈ పరిస్థితుల్లో డిశ్చార్జ్ చేస్తే ఎలాగని తండ్రి గోవర్ధన్‌రెడ్డి వైద్యులను ప్రశ్నించారు. శస్త్రచికిత్స చేసిన వైద్యుడే డిశ్చార్జ్ తర్వాత స్వయంగా మా ఇంటికి వచ్చి తదుపరి చికిత్సలు అందజేసేందుకు అంగీకరిస్తే డిశ్చార్జ్ ఒప్పుకుంటామని స్పష్టం చేశారు. దీంతో డాక్టర్ చంద్రభూషణ్ ఇందుకు అంగీకరిస్తూ ఓ హామీ పత్రం రాసిచ్చారు. విచారణ ప్రారంభం... ఎత్తుపెంపు శస్త్రచికిత్సపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బుధవారం విచారణ చేపట్టింది. తల్లిదండ్రులకు చెప్పకుండా నిఖిల్‌రెడ్డికి గ్లోబల్ ఆస్పత్రిలో వైద్యులు ఎత్తుపెంపు శస్త్రచికిత్స చేయడం వివాదాస్పదం కావడంతో ఆస్పత్రి వైద్యుడికి ఎంసీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. బుధవారం డాక్టర్ చంద్రభూషణ్ ఎంసీఐ ఎథిక్స్ కమిటీ ముందు హాజరయ్యారు. వైద్యుడు చెప్పిన వివరాలను కమిటీ సభ్యులు రికార్డు చేశారు. ఆ తర్వాత నిఖిల్‌రెడ్డి తండ్రి గోవర్ధన్‌రెడ్డి కమిటీ సభ్యుల ముందు హాజరై చెప్పిన వివరాలను కూడా రికార్డు చేసినట్లు ఎంసీఐ చైర్మన్ డాక్టర్ రవీందర్‌రెడ్డి స్పష్టం చేశారు. నా కొడుకుపై ఇదో ప్రయోగం... నిఖిల్రె డ్డిపై గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు చంద్రభూషణ్రెడ్డి ఓ ప్రయోగం చేశారని ఆయన తండ్రి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. మాకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఎత్తుపెంపు పేరుతో ఆరోగ్యంగా ఉన్న నా కుమారుని కాళ్లు నరకడం మానవ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందన్నారు. ఇప్పటి వరకు మూడున్నర లక్షలు దండుకున్నారని ఆరోపించారు. ఆపరేషన్ చేసి 15 రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు ఇతరుల సహాయం లేనిదే నడవలేని దుస్థితిలో ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాడని, పెయిన్‌కిల్లర్స్ ఇచ్చి వైద్యులు చేతులు దులుపుకుంటున్నారు. ఆసుపత్రిపై వినియోగదారుల ఫోరం, ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్, హెచ్ఆర్సీల్లో ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య, ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డిలకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం గ్లోబల్ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
నాన్నకు చెప్పకుండా తప్పు చేశా
‘సాక్షి’ ఇంటర్వ్యూలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిఖిల్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ‘మా ఇంజినీరింగ్ క్లాస్‌లో మొత్తం 30 మంది స్టూడెంట్స్. అందులో ముగ్గురమే 5.7 అడుగుల కంటే తక్కువ ఎత్తు ఉండేటోళ్లం. అందుకే నేనూ మిగిలిన వాళ్లలా రెండు మూడు ఇంచ్‌లు పెరిగేందుకే శస్త్రచికిత్సతో సాహసం చేశా. ఈ చికిత్స విషయాన్ని నా తల్లితండ్రుల వద్ద దాచి తప్పే చేశా. అయితే డాక్టర్లు రెండు రోజుల్లో డిశ్చార్జి, వారం రోజుల్లో వాకర్ సహాయంతో నడవొచ్చని చెప్పారు. కానీ పది రోజులవుతున్నా కనీసం పూర్తిగా కూర్చోలేకపోతున్నా’ అంటూ ఏప్రిల్ 5న గ్లోబల్ ఆస్పత్రిలో ఎత్తు పెరిగేందుకు రెండు కాళ్లకూ శస్త్రచికిత్స చేయించుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిఖిల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన గ్లోబల్ ఆస్పత్రిలో ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. వివరాలు నిఖిల్ మాటల్లోనే... వారిలో ఒకడిగా... ఇంజనీరింగ్ క్లాస్మేట్సంతా నాకన్నా రెండు నుంచి మూడు ఇంచుల ఎత్తు పెరిగారు. నేను వారితో సమానంగా పెరగాలనుకున్నా. ఎత్తు పెరిగే వైద్యం కోసం ఆన్లైన్లో ఏడాది పాటు సెర్చ్ చేశా. చివరకు రష్యా, చైనాలో ‘ఇల్‌జర్వ్’ ప్రక్రియతో ఎత్తు పెంచే (లింబ్ లెంగ్తెనింగ్) ఆపరేషన్స్‌ను పరిశీలిం చా. ఆపై మిత్రులతో కలసి గ్లోబల్ ఆస్పత్రిని సంప్రదించా. గతంలో మేం ఎత్తు పెంచేం దుకు చేసిన శస్త్ర చికిత్సలు పూర్తి సక్సెస్ అయ్యాయని ఇక్కడి వైద్యులు చెప్పారు. శస్త్రచికిత్సకు తొలుత రూ.2.5 లక్షలని చెప్పి.. చివరకు రూ.3 లక్షలు అన్నారు. 2.5-3 ఇంచుల ఎత్తు పెంచేందుకు పూర్తి శాస్త్రీయ పద్ధతిలో శస్త్రచికిత్స చేస్తామన్నారు. నాలుగైదు మాసాల్లో పూర్తిగా కోలుకోవచ్చన్నారు. అదే ధీమాతో జనవరి 23 నా 22వ పుట్టినరోజు నాడు గ్లోబల్ ఆస్పత్రికి వచ్చి లక్ష రూపాయల ఫీజు అడ్వాన్స్‌గా చెల్లించాను. అమ్మానాన్నకు చెబితే వద్దంటారనే... అమ్మానాన్నలకు చెబితే వద్దంటారనే వారికి చెప్పకుండా మిత్రులతో కలసి ఆస్పత్రిలో చేరా. నేను మేజర్ అవ్వడంతో అమ్మానాన్నలు ఎక్కడని ఆస్పత్రివారు అడగలేదు. నేను పనిచేసే కంప్యూటర్ సంస్థలో వచ్చే జీతం మొత్తాన్ని అమ్మకే ఇస్తుండేవాడిని. శస్త్రచికిత్సకు అవసరమయ్యే డబ్బు కోసం రాత్రిళ్లు పనిచేసి వివిధ రకాల కంప్యూటర్ అప్లికేషన్లు రూపొందించా. ఆ డబ్బుతోనే ఫీజు చెల్లించేశా. ఏప్రిల్ 5న ఆరు గంటల పాటు శస్త్రచికిత్స చేశారు. ఇప్పటికే పది రోజులవుతోంది. కాళ్లలో మంటలు, బొబ్బలు వస్తున్నాయి. మా అన్నయ్య ఇప్పటికే సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టారు. నేనూ సొంతంగా కంపెనీ పెట్టి హుందాగా ఎదగాలన్నదే లక్ష్యం. కాలేజీ రోజుల్లోనే నేను రూపొందించిన వివిధ అప్లికేషన్లకు మంచి డిమాండ్ వచ్చింది. కానీ ఇప్పుడు చూడాలి. దేవుడు ఏం చేస్తాడో! ఇన్ఫెక్షన్... భయపెడుతోంది: తండ్రి గోవర్ధన్‌రెడ్డి ‘ఉగాది రోజునే మా వాడిని డిశ్చార్జి చేస్తామన్నారు. కానీ నిన్నటి నుంచి కాళ్లపై బొబ్బలు వచ్చాయి. విపరీతమైన మంటలు, నొప్పులు వస్తున్నాయి. కదల్లేకపోతున్నాడు. నా కుమారుడి విషయంలో పూర్తి అనైతికంగా వ్యవహరించిన వైద్యులు, ఆస్పత్రిపై కేసు పెట్టాం. త్వరలో ఇండియన్ మెడికల్ కౌన్సిల్‌కూ ఫిర్యాదు చేస్తాం. చిన్నప్పటి నుంచే... ఎంతో ప్రతిభ... టెన్త్‌లో ఫస్ట్‌క్లాస్‌లో పాసైన నిఖిల్ ఇంటర్, ఇంజనీరింగ్‌లో డిస్టింక్షన్ సాధించాడు. నగర శివారులోని ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లోనే నిఖిల్ రూపొందించిన ‘నోటీస్బోర్డ్’ కంప్యూటర్ అప్లికేషన్ ఎంతో పాపులర్ అయింది. సెయింట్‌మార్టిన్ సహా సీబీఐటీ సైతం నిఖిల్ రూపొందించిన అప్లికేషన్‌తోనే విద్యార్థుల హాజరు, ఫలితాల వివరాలను అనుసంధానం చేసేసింది. ఇవి కాకుండా తన సీనియర్స్, జూనియర్స్ కోసం సుమారు 16 అప్లికేషన్స్‌ను నిఖిల్ రూపొందించారు. -
నిఖిల్ బలమైన కోరికను కాదనలేకపోయా
సాక్షి, హైదరాబాద్: ‘ఎత్తు పెంపు శస్త్రచికిత్సలు సాధారణం. ఆత్మన్యూనతా భావానికి లోనై శస్త్రచికిత్స ద్వారా జీవితాన్ని మెరుగుపర్చుకోవాలని భావించే వారికి ఈ తరహా సర్జరీలు చేయడంలో తప్పులేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వీటిని చేస్తున్నారు. దేశంలోని షోలాపూర్, మిరాజ్‌లోనూ ఇలాంటివి జరుగుతున్నాయి. ఇటీవల గ్లోబల్ ఆస్పత్రిలో నిఖిల్‌రెడ్డికి చేసిన ఎత్తు పెంపు శస్త్రచికిత్స సైంటిఫిక్ సర్జరీ. అంతకు మించి ఇది సేఫ్’ అని తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, కీళ్ల మార్పిడి నిపుణుడు డాక్టర్ గురువారెడ్డి, ఉస్మానియా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ప్రసాద్, ప్రముఖ వైద్యుడు డాక్టర్ గోపాల్‌రెడ్డి, స్పైన్ సర్జన్ డా క్టర్ జీవీ సుబ్బయ్య, గ్లోబల్ ఆస్పత్రి ఆర్థోపెడిక్ సర్జరీ విభాగం చీఫ్ డాక్టర్ చంద్రభూషణ్ మాట్లాడారు. సంతకం చేసే దాకా కత్తిపట్టబోం ‘నిఖిల్ ఉదంతంపై మీడియా కథనాలు తీవ్ర మనోవేదనకు గురిచేశాయి. నిఖిల్ ఉదంతం వైద్యులకు ఓ గుణపాఠం వంటిదే. ఇక నుంచి కాస్మొటిక్ సర్జరీల్లోనే కాదు ఏ శస్త్రచికిత్సకైనా సరే తల్లిదండ్రులు వచ్చి అంగీకారపత్రంపై సంతకం పెట్టే వరకూ కత్తిపట్టబోం. సైన్స్‌కు ఎమోషన్‌ను ముడిపెట్టి కథనాలు రాయడం బాధాకరం. కాస్మొటిక్ సర్జరీ చేయించుకునే వ్యక్తి మేజరైనప్పుడు తల్లిదండ్రులకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎత్తు పెంపు శస్త్రచికిత్సను కోర్టులే కాదు ఇప్పటి వరకు ఎవరూ తప్పుపట్టలేదు’ అని గురువారెడ్డి స్పష్టం చేశారు. ఎంక్వైరీ చేసినా ఏమీ జరుగదు.. ‘ఆరోగ్య మంత్రి, కోర్టులు, ఎంసీఐ వివరణ అడిగినా ఏమీ జరగదు. ఈ విషయంలో అన్నీ నైతికంగానే జరిగాయి. బాధితుడికి ఆరు మాసాల నుంచే కౌన్సెలింగ్ ఇచ్చాం. ఎంత చెప్పినా వినలేదు. హైట్ పెంచాల్సిందేనని వేడుకున్నాడు. శస్త్రచికిత్స తర్వాత తలెత్తే సమస్యలను వైద్యులు ముందే వివరించారు. అంతా అనుకుంటున్నట్లు ఇది క్లిష్టమైన ప్రక్రియ కాదు. చాలా సులభమైంది. మహారాష్ట్రలోని మిరాజ్లోనే రోజుకు 20 శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. ఇదేదో రాత్రికి రాత్రి మభ్యపెట్టి చేసిన శస్త్రచికిత్స కాదు. నిఖిల్ నొప్పి తగ్గిన తర్వాత వాకర్ సాయంతో నడుస్తాడు. ఇందుకు మరో రెండు మూడు రోజుల సమయం పడుతుంది. మరో ఎనిమిది మాసాల్లో రెండు అంగుళాల పొడవు పెరుగుతాడు. అందరిలాగే నిఖిల్ సాధారణ జీవితం గడుపుతాడు’ అని గురువారెడ్డి చెప్పారు. బలమైన కోరికను కాదనలేకపోయా ‘తల్లిదండ్రులను తీసుకురావాల్సిందిగా నిఖిల్‌కు సూచించా. కానీ వారు అందుబాటులో లేరని చెప్పాడు. అతను మేజర్.. పైగా ఉద్యోగి కావడంతో ఎటువంటి అనుమానం రాలేదు. నిఖిల్ నా వద్దకు వచ్చిన ప్రతిసారి తిప్పిపంపాను. ఆరు మాసాల్లో ఐదారుసార్లు ఇలా చేశాను. అయినా వినిపించుకోలేదు. శస్త్రచికిత్స చేయించుకోవాలన్న అతని బలమైన కోరిక, ఎత్తుపెంపు పట్ల ఆయనకున్న ఫీలింగ్‌ను కాదనలేకపోయాను. ఈ శస్త్రచికిత్సలో విశేష అనుభవం ఉండటం, చికిత్స సులభమైనది కావడం, ఎత్తు పెంపు శస్త్రచికిత్సలను తెలుగు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతోనే శస్త్ర చికిత్సకు పూనుకున్నా’ అని గ్లోబల్ ఆస్పత్రి ఆర్థోపెడిక్ చీఫ్ చంద్రభూషణ్ స్పష్టం చేశారు. -
ఇక ఆరోగ్యం బతికే దారేది?
సమకాలీనం నిఖిల్ అనాకారి కాదు, 5.7 అడుగుల ఎత్తు తక్కువేం కాదు. ఒక మానసికవైద్యుడిని (సైకియాట్రిస్ట్) కూడా భాగస్వామిని చేసి నచ్చజెప్పి ఉండాల్సింది. ఇప్పటికీ వైద్య వృత్తి చేపట్టేటప్పుడు చేసే ప్రమాణం, 2500 ఏళ్ల కింద గ్రీక్ భాషలో రూపొందిన ‘హిపాక్రటిక్ ఓత్’లో కూడా ఇటువంటి ప్రతిపాదన ఉంది. ‘‘... నేను చేసే వైద్య చికిత్సలో నాకు తెలియని ఒక ప్రత్యేకమైన నైపుణ్యం అవసరమైతే, సదరు నిపుణుడ్ని పిలువడానికి సిగ్గుపడను, వెనుకాడను’’ అనే ఆ నైతికతను ఈ కేసులో ఏ మేరకు పాటించారన్నది అనుమానమే! యువకుడు నిఖిల్‌రెడ్డి కాళ్లకు జరిగిన శస్త్ర చికిత్స పెద్ద చర్చనే లేవనెత్తింది. వైద్యం పేరిట తెలుగునాట జరుగుతున్న మంచీ-చెడూ రెండూ మరోమారు చర్చకు వస్తున్నాయి. వైద్య పరిస్థితుల్ని ఏ మాత్రం మెరుగుపరచడానికి ఈ చర్చ ఉపయోగపడ్డా మేలే! ఈ కేసులో వైద్యులు చేసింది న్యాయసమ్మతమే అని కొందరు, అవొచ్చు కానీ, ధర్మసమ్మతం కాదని మరికొందరు, ఏ రకంగా చూసినా ఇది నైతికం మాత్రం కానే కాదని ఇంకొందరు.... ఇలా భిన్న వాదనలు వినిపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని వైద్యరంగంలో ఈరోజు, ఇంత సున్నితంగా చర్చించేంత, వైద్యుల ప్రతీ చర్య వెనుక హేతువును వెతికేంత ఆరోగ్య వాతావరణం ఉందా? హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో నిఖిల్‌రెడ్డి శస్త్ర చికిత్స ఎలా జరిగిందనే న్యాయ, ధర్మ, నైతిక సమీక్షను కొంతసేపు అలా ఉంచితే, ఇంతకన్నా వందలు, వేల రెట్ల న్యాయోల్లం ఘనలు, అధర్మ, అనైతిక వైద్య వ్యాపారాలు యథేచ్ఛగా సాగిపోతున్న సంగతి నిజం. ఓ చిన్న వైద్యశాలతో మొదలెట్టి గొలుసుకట్టు ఆస్పత్రులు నెల కొల్పి కుబేరులైన వైద్యులు, వాటాల పంపకాలకోసం పట్టపగలు రాజధాని నడిబొడ్డున తుపాకులతో కాల్చుకునే సంస్కృతికి దిగజారడం నేడు నెలకొన్న దుస్థితికి ఓ సంకేతం మాత్రమే! నేనీ మాటలు రాస్తున్న ఈ గురువారం ‘ప్రపంచ ఆరోగ్యదినం’ కూడా కావడం, సదరు బ్యానర్లతో మనం మొక్కు బడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నంత కాకతాళీయమే! ఈ దేశంలో వైద్య దోపిడీ విచ్చలవిడితనంపై రాష్ట్ర ప్రభుత్వానికి గానీ, కేంద్ర ప్రభుత్వానికి గానీ ఎటువంటి నియంత్రణా లేదు. పెపైచ్చు, ప్రభుత్వ వైద్య వ్యవస్థను ప్రత్యక్షంగా పరోక్షంగా నిర్వీర్యం చేసే కార్పొరేట్ శక్తులకు దన్నుగా నిలుస్తున్న దాఖలాలు కోకొల్లలు. సన్నపొర చెరగుతోంది పొడుగు పెరగాలని కోరుకున్న నిఖిల్‌కి రాగల సంక్లిష్టతల్ని వివరించి శస్త్ర చికిత్స వలదని కౌన్సిలింగ్ చేసి ఉండాల్సింది, తల్లిదండ్రులతో చర్చించాల్సిందని పలువురు పేర్కొంటున్నారు. భవిష్యత్ మంచి-చెడులతో ముడివడి ఉన్న కీలక అంశాన్ని అంత గోప్యంగా జరిపించడం అనైతికమనేది వారి వాదన. తమకు తెలిస్తే వారిస్తామనో, వెనుకాడితే ఆ యువకుడు ఇంకో ఆస్పత్రికి వెళ్లి చేయించుకుంటాడనో, డబ్బుకోసమే తగని శస్త్ర చికిత్స తొంద రపడి జరిపారని తండ్రి ఆరోపిస్తున్నారు. మేజరయి ఉండి, బుద్ధి వికాసంతో ఉన్న వ్యక్తి, చికిత్స గురించి తెలిసి స్వయంగా అంగీకరించినపుడు తల్లి దండ్రుల సంతకం తీసుకోవాలని ఏ చట్టమూ నిర్దేశించడం లేదనేది వారి వాదన. ఇది చట్టబద్ధత-నైతికతల మధ్య నలిగే సున్నితాంశం. ముఖ్యంగా మూడంశాల్లో ఈ ధర్మసంకటం వస్తుందని నిపుణులంటున్నారు. స్థూల కాయం తగ్గించుకునే లైఫోసెక్షన్, బేరియాట్రిక్ సర్జరీ వంటి శస్త్ర చికిత్సలు, సిజేరియన్, గర్భస్రావం, గర్భసంచి తొలగించడం వంటి ఆరోగ్య సంబంధ చికిత్సలు, అందం-ఆకారం కోసం చేసుకునే వివిధ కాస్మటిక్ సర్జరీలు చేసేటప్పుడు.... చట్టబద్ధతకు, నైతికతకు మధ్య సన్నని పొర ఉంటుంది. వ్యాపార దృక్పథంతో ఉన్న వైద్యులు, ఆస్పత్రుల వారు ఆ పొరను చెరిపేస్తు న్నారు. పై అన్ని సందర్భాల్లోనూ అనివార్యం, జీవన్మరణ సమస్య అయితే తప్ప ఆయా శస్త్ర చికిత్సలకు వెళ్లకూడదనేది నైతికాంశం. ముఖ్యంగా అందం-ఆకారం కోసం జరిపే శస్త్ర చికిత్సలకు ముందు కౌన్సిలింగ్ చేయాలి. నిఖిల్ అనాకారి కాదు, 5.7 అడుగుల ఎత్తు తక్కువేం కాదు. ఒక మానసికవైద్యుడిని (సైకియాట్రిస్ట్)ను కూడా భాగస్వామిని చేసి నచ్చజెప్పి ఉండాల్సింది. ఇప్పటికీ వైద్య వృత్తి చేపట్టేటప్పుడు చేసే ప్రమాణం, 2500 సంవత్సరాల కింద గ్రీక్ భాషలో రూపొందిన ‘హిపాక్రటిక్ ఓత్’లో కూడా ఇటువంటి ప్రతిపాదన ఉంది. ‘‘...... నేను చేసే వైద్య చికిత్సలో నాకు తెలియని ఒక ప్రత్యేకమైన నైపుణ్యం అవసరమైతే, సదరు నిపుణుడ్ని పిలు వడానికి సిగ్గుపడను, వెనుకాడను’’ అనే ఆ నైతికతను ఈ కేసులో ఏ మేరకు పాటించారన్నది అనుమానమే! వైద్య దాష్టికాలకు అంతే లేదు ఇది ఎత్తిచూపడమంటే, మంచి అసలే జరగటం లేదని చెప్పడం కానే కాదు. పెరిగిన శాస్త్ర-సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య విద్యా వికాసం వల్ల సమాజానికి మంచి జరుగుతోంది. కానీ, అధర్మం-అనైతికత మంచిని మించుతోంది. గ్రామాల్లో ఉండే ఆర్ఎంపీ వైద్యులకు పట్టణాలు, నగరాల్లో ఉండే పెద్దా స్పత్రులకు మధ్య, డయాగ్నస్టిక్ సెంటర్లకు కార్పొరేట్ వైద్యశాలలకు మధ్య ఓ అనైతిక సంబంధం. అనవసర పరీక్షలు, అడ్డగోలు శస్త్ర చికిత్సలు, అవస రానికి మించి ఆస్పత్రిలో ఉంచడాలు- ఇలా ఎన్ని దాష్టికాలు! హోటళ్ల తరహాలో 3 నక్షత్రాల, 5 నక్షత్రాల కార్పొరేట్ ఆస్పత్రులు వెలసి, వైద్యులకు రోజువారీ-నెలవారీ టార్గెట్లు పెట్టి కోట్లు గడిస్తున్నాయి. గుంటూరు, కరీంగనగర్‌లలో కాసుల కోసం ‘కడుపుకోత’లు, నల్లగొండ, ఖమ్మంలలో వ్యవస్థీకృతంగా కిడ్నీ రాకెట్లు, విజయవాడ, విశాఖ పట్నంలలో అద్దెగర్భాల నీడలో గుట్టుచప్పుడు కాకుండా పిండాల దొంగ విక్రయం, కర్నూలు, హైదరాబాద్‌లలో డబ్బు పిండటానికి మనిషి చచ్చిన తర్వాత కూడా చికిత్సలు.... ఇదీ వరస! ఇవి ఇటీవలి కాలంలో వెలుగు చూసిన కొన్ని ఉదాహరణలు మాత్రమే! ఖమ్మం జిల్లా నాయుడు పేటకు చెందిన మువ్వా నరేష్‌కు తరచూ జ్వరం వస్తుంటే తల్లిదండ్రులు వైద్యం చేయించినపుడు ఓ దయనీయమైన విషయం తెలిసింది. బెంగళూరుకు చెందిన ఓ దళారీ నమ్మించి, ఆర్థికంగా ఎంతో మేలని 3 లక్షలిచ్చి కిడ్నీ తీసుకొని చేతులు దులుపుకున్నారు. కిడ్నీ దానం చేసినపుడు, జీవితాంతం మందులు వాడాలని, ఖర్చులుంటాయిన చెప్పకుండా నిజం దాచి మోసం చేశారు. అట్లా ఎన్నో కేసులు! ఖమ్మం, నల్లగొండల్లో వెలుగు చూసిన రెండు, మూడు కేసులతో మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక... ఇలా వివిధ రాష్ట్రాలతో పాటు శ్రీలంక వరకు విస్తరించిన ఈ భాగోతం బయటపడింది. పోషకాహార లోపాల వల్ల కడుపునొప్పి అని ఫిర్యాదు చేసిన కరీంనగర్ జిల్లా కథలాపూర్ పేదింటి ఆడపిల్లల ఘోష దయనీయం. వసతి గృహాల ఆడపిల్లల వైద్యానికి స్థానిక ఆర్ఎంపీల సిఫారసులు, జగిత్యాల ప్రయివేటు పెద్దాసుపత్రిలో అవసరం లేకపోయినా కేవలం డబ్బు కోసమే అపెండిసైటిస్ ఆపరేషన్లు, గర్భసంచి తొలగించే శస్త్ర చికిత్సలు చేసిన దుర్మార్గాలు ఇటీవలే వెలుగు చూశాయి. వికృత చేష్టలకు ఎన్ని రూపాలో! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మద్యనిషేధం అమలవుతున్నపుడు ఓ చిత్రం జరిగేది. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉండే మందుప్రియులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి తాగేవారు. మెదక్ జిల్లా జహీరాబాద్‌కు చెందిన కొందరు మందు కోసమే సాయంకాలం పాతిక కిలోమీటర్ల దూరంలో ఉండే బీదర్ (కర్ణాటక)కు వెళ్లేది. వీరి సమయం, సౌలభ్యం కోసం జహీరాబాద్ వాళ్లే మాట్లాడుకొని బీదర్‌లో వైన్స్ నడిపేది. అక్కడి పనివాళ్లు, వైన్స్ నిర్వాహకులు, చిరుతిళ్లు అమ్మేటోళ్లు, మందు తాగేది... ఇలా అందరూ జహీరాబాద్ వాళ్లే! కాకపోతే భూభాగం మాత్రం మద్యనిషేధం అమల్లోలేని బీదర్. అచ్చం అలాగే, కిడ్నీ రాకెటు మనవాళ్ల వల్లే రాష్ట్ర సరిహద్దులు దాటి, దేశ సరిహద్దులు దాటి అంతర్జాతీయ రాకెట్‌గా అవతరించింది. మనస్పూర్తిగా అంగీకరించిన రక్త సంబంధీకుల నుంచి మాత్రమే కిడ్నీ దానాల్ని అనుమతిస్తామనే నిబంధన, అందుకోసం ఓ నిపుణుల కమిటీ ఇక్కడ అమల్లో ఉండటంతో వ్యవహార కేంద్రం నెమ్మదిగా శ్రీలంకకు మారింది. కిడ్నీ దాత, గ్రహీత, దళారి, అప్పుడప్పుడు వైద్యులు కూడా ఇక్కడి వారే! శస్త్ర చికిత్స జరిపే ఆస్పత్రి మాత్రమే శ్రీలంకది! డబ్బు గడించే కుయుక్తులతో కొందరు వైద్యులు, ఆస్పత్రుల వారు ఆరోగ్య బీమాను కూడ అభాసుపాలు చేస్తున్నారు. బీమా ఉందంటే చాలు, అవరసమా-అనవసరమా అన్న విచక్షణ కూడా లేకుండా శస్త్ర చికిత్సలు చేసి రోగుల శరీరాల్ని గుల్ల చేస్తున్నారు. పుణేకు చెందిన ‘సతి’ (ఎస్ఎటిహెచ్ఐ) అనే ఓ స్వచ్ఛంద సంస్థ జరిపిన అధ్యయనంలో కళ్లు చెదిరే వాస్తవాలు వెలుగు చూశాయి. కార్పొరేట్ ఆస్పత్రులకు చెందిన వైద్యులు 12500 మందికి శస్త్ర చికిత్సలు సిఫారసు చేయగా, 44 శాతం కేసుల్లో అసలా శస్త్ర చికిత్సలే అవసరం లేదని ఇతర వైద్యుల్ని సంప్రదించినపుడు రెండో అభిప్రాయంలో తేటతెల్లమైంది. .......దశ-దిశ కావాలిప్పుడు తెలుగు రాష్ట్రాల్లో, ఆ మాటకొస్తే దేశంలోనే వైద్యరంగంలో జరుగుతున్న అరాచకాలపై నిఘా లేదు, సరైన నియంత్రణ లేదు. మొత్తం వైద్యరంగమే దశ-దిశ లేకుండా సాగుతోంది. వైద్య ఖర్చులు తట్టుకోలేక ఏటా నాలుగు కోట్ల మంది భారతీయులు దారిద్య్రరేఖ దిగువకు జారిపోతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. ఒక రోగి, రోగం విషయంలో ఏ ఇద్దరు వైద్య నిపుణుల అభిప్రాయం ఒక్కలా ఉండదు. చాలా సందర్భాల్లో జవాబుదారితనమే లోపిస్తోంది. వైద్య ప్రక్రియకు ప్రమాణాలే ఉండవు. ఏయే జబ్బుల విషయంలో, ఏయే ఆస్పత్రుల విజయశాతమెంత? అన్న లెక్కలే లేక పోవడంతో వైద్యం కోసం వెళ్లే వారికి ఎంపిక అవకాశమే ఉండటం లేదు. భారత వైద్య మండలి (ఎమ్సీఐ) ఓ అలంకార ప్రాయమైన సంస్థ. అందువల్లే ఈ అరాచకం కొనసాగుతోందని విశ్లేషకులంటారు. తప్పు చేసినపుడు వైద్యుడ్ని, ఆస్పత్రిని గుర్తించి, చట్టబద్ధంగా శిక్షించే విధానాలే లేవు. వైద్య విద్య ఖరీదవడం వల్ల కూడా వ్యాపార ధోరణి పెరిగి కొన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ఇప్పుడు తయారవుతున్న వైద్యుల సంఖ్యా పద్ధతి ఇలాగే సాగితే, ప్రస్తుత అవసరాలు తీర్చగలిగిన వైద్యుల సంఖ్య ఓ 500 సంవత్సరాల తర్వాత సమకూరుతుందట. మరి అప్పటి అవసరా లకు? ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి సారించాలి. వైద్యవిద్య ఖర్చు తగ్గిం చాలి.. కార్పొరేట్ల దోపిడీపై నిఘా పెంచాలి. నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ప్రజావైద్య వ్యవస్థను బలోపేతం చేయాలి. సంపన్నులు, అధిక సంతృప్తి కోసం అర్రులు చాచే వాళ్లు మాత్రమే కార్పొరేట్ వైద్యం వైపు వెళ్లే వాతావరణం కల్పించాలి. భవిష్యత్ సమాజ ఆరోగ్య రక్షణ పాలకుల తక్షణ కర్తవ్యం అయితే తప్ప పరిస్థితి మారదు. దిలీప్ రెడ్డి ఈమెయిల్: dileepreddy@sakshi.com -
'నిఖిల్ భవిష్యత్ కు ఢోకా లేదు'
హైదరాబాద్: నిఖిల్ రెడ్డి అనే యువకుడికి నిర్వహించిన ఎత్తు పెంపు ఆపరేషన్ కు అనుసరించిన విధానం సరైందేనని ప్రముఖ వైద్యులు తెలిపారు. ఈ వివాదంపై వివరణ ఇచ్చేందుకు వైద్యులంతా కలిపి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నిఖిల్ రెడ్డికి అందించిన చికిత్సలో గానీ, అనుసరించిన విధానంలో గానీ ఎలాంటి పొరపాటు లేదని స్పష్టం చేశారు. అతడి తల్లిదండ్రులకు తెలియకపోవడం వల్లే వివాదం తలెత్తిందని అన్నారు. తల్లిదండ్రుల ఆవేదన కారణంగానే ఈ వివాదం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పారు. వైద్యులు, రోగులకు మధ్య అపోహలు సృష్టించే ప్రయత్నం చేయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. మీడియా సహకారంతో హైదరాబాద్ లో ఆరోగ్య రంగం ఎదిగిందని తెలిపారు. నిఖిల్ రెడ్డి విషయంలో శాస్త్రసాంకేతిక అంశాలను హైలెట్ చేయాలని కోరారు. అతడికి భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు రావని డాక్టర్లు హామీయిచ్చారు. ఎత్తు పెరగడానికి చేసిన ఆపరేషన్ అనైతికం కాదని అన్నారు. గురువారెడ్డి, గోపాల్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, చంద్రభూషణ్, ప్రసాద్ తదితర వైద్యులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. నిఖిల్ తల్లిదండ్రులకు తెలియకుండా అతడికి లక్డికాపూల్ లోని గ్లోబల్ ఆస్పత్రిలో వైద్యులు ఎత్తు పెంపు ఆపరేషన్ చేయడంతో వివాదం తలెత్తింది.