
గ్లోబల్ నుంచి నిఖిల్‌రెడ్డి డిశ్చార్జ్
ఈ ఘటనపై ఎంసీఐ విచారణ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ఇటీవల ఎత్తుపెంపు శస్త్రచికిత్స చేయించుకున్న నిఖిల్‌రెడ్డిని వైద్యులు బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆయన ఆరోగ్యం కొంత మెరుగు పడటంతో ఆస్పత్రి నుంచి ఇంటికి పంపినట్లు డాక్టర్ చంద్రభూషణ్ తెలిపారు. అయితే డిశ్చార్జ్‌కి తల్లిదండ్రులు అంగీకరించలేదు. శస్త్రచికిత్స చేసి 15 రోజులైనా ఇప్పటి వరకు నిఖిల్‌రెడ్డి నడవలేకపోతున్నాడని, నొప్పితో బాధపడుతున్నాడని,ఈ పరిస్థితుల్లో డిశ్చార్జ్ చేస్తే ఎలాగని తండ్రి గోవర్ధన్‌రెడ్డి వైద్యులను ప్రశ్నించారు. శస్త్రచికిత్స చేసిన వైద్యుడే డిశ్చార్జ్ తర్వాత స్వయంగా మా ఇంటికి వచ్చి తదుపరి చికిత్సలు అందజేసేందుకు అంగీకరిస్తే డిశ్చార్జ్ ఒప్పుకుంటామని స్పష్టం చేశారు. దీంతో డాక్టర్ చంద్రభూషణ్ ఇందుకు అంగీకరిస్తూ ఓ హామీ పత్రం రాసిచ్చారు.
విచారణ ప్రారంభం...
ఎత్తుపెంపు శస్త్రచికిత్సపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బుధవారం విచారణ చేపట్టింది. తల్లిదండ్రులకు చెప్పకుండా నిఖిల్‌రెడ్డికి గ్లోబల్ ఆస్పత్రిలో వైద్యులు ఎత్తుపెంపు శస్త్రచికిత్స చేయడం వివాదాస్పదం కావడంతో ఆస్పత్రి వైద్యుడికి ఎంసీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. బుధవారం డాక్టర్ చంద్రభూషణ్ ఎంసీఐ ఎథిక్స్ కమిటీ ముందు హాజరయ్యారు. వైద్యుడు చెప్పిన వివరాలను కమిటీ సభ్యులు రికార్డు చేశారు. ఆ తర్వాత నిఖిల్‌రెడ్డి తండ్రి గోవర్ధన్‌రెడ్డి కమిటీ సభ్యుల ముందు హాజరై చెప్పిన వివరాలను కూడా రికార్డు చేసినట్లు ఎంసీఐ చైర్మన్ డాక్టర్ రవీందర్‌రెడ్డి స్పష్టం చేశారు.
నా కొడుకుపై ఇదో ప్రయోగం...
నిఖిల్‌రె డ్డిపై గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు చంద్రభూషణ్‌రెడ్డి ఓ ప్రయోగం చేశారని ఆయన తండ్రి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. మాకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఎత్తుపెంపు పేరుతో ఆరోగ్యంగా ఉన్న నా కుమారుని కాళ్లు నరకడం మానవ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందన్నారు. ఇప్పటి వరకు మూడున్నర లక్షలు దండుకున్నారని ఆరోపించారు. ఆపరేషన్ చేసి 15 రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు ఇతరుల సహాయం లేనిదే నడవలేని దుస్థితిలో ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాడని, పెయిన్‌కిల్లర్స్ ఇచ్చి వైద్యులు చేతులు దులుపుకుంటున్నారు. ఆసుపత్రిపై వినియోగదారుల ఫోరం, ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్, హెచ్‌ఆర్‌సీల్లో ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య, ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డిలకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం గ్లోబల్ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.