ఎత్తుపెంపు శస్త్రచికిత్స చేయించుకున్న నిఖిల్‌రెడ్డికి తదుపరి వైద్య సేవలు అందించే అంశంపై గందరగోళం నెలకొంది. తెలంగాణ వైద్య మండలి తీర్పు నేపథ్యంలో నిఖిల్‌కు శస్త్రచికిత్స చేసిన డాక్టర్ చంద్రభూషణ్ వైద్యం చేయలేని పరిస్థితి ఎదురైంది. దీంతో నిఖిల్‌కు ఇకపై వైద్యసేవలు ఎవరు అందిస్తారనే అంశం ప్రశ్నార్థకంగా మారింది. ఒప్పందం మేరకు గాయం పూర్తిగా మానే వరకు శస్త్రచికిత్స చేసిన డాక్టరే స్వయంగా బాధితుని ఇంటికి వెళ్లి వైద్య సేవలు అందించాలి. ఇప్పటి వరకు డాక్టర్ చంద్రభూషణే స్వయంగా బాధితుని ఇంటికి వెళ్లి వైద్యం అందించారు. అయితే తమకు కనీసం మాట కూడా చెప్పకుండా తమ కుమారునికి ఎత్తుపెంపు శస్త్రచికిత్స చేయడం అనైతికమని ఆరోపిస్తూ నిఖిల్ తండ్రి గోవర్ధన్ రెడ్డి ఎంసీఐకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ వైద్య మండలి చంద్రభూషణ్‌పై రెండేళ్లు వేటు వేసింది. తీర్పు నేపథ్యంలో ఆయన బాధితునికి వైద్యం చేయలేని స్థితి. ఆయన స్థానంలో ఎవరు వైద్యం అందిస్తారో కూడా ఆస్పత్రి యాజమాన్యం ఇప్పటి వరకు స్పష్టం చేయలేదు. దీంతో నిఖిల్‌కు వైద్యసేవలు అందించే అంశం ప్రశ్నార్థకమైంది.