ఇంకా మానని గాయం..
► నిఖిల్‌రెడ్డికి తదుపరి వైద్య సేవలపై గందరగోళం
► ప్రభావం చూపుతున్న తెలంగాణ వైద్య మండలి తీర్పు
► ఆంక్షలతో వైద్యం చేయలేని స్థితిలో డాక్టర్ చంద్రభూషణ్
సాక్షి, హైదరాబాద్: ఎత్తుపెంపు శస్త్రచికిత్స చేయించుకున్న నిఖిల్‌రెడ్డికి తదుపరి వైద్య సేవలు అందించే అంశంపై గందరగోళం నెలకొంది. తెలంగాణ వైద్య మండలి తీర్పు నేపథ్యంలో నిఖిల్‌కు శస్త్రచికిత్స చేసిన డాక్టర్ చంద్రభూషణ్ వైద్యం చేయలేని పరిస్థితి ఎదురైంది. దీంతో నిఖిల్‌కు ఇకపై వైద్యసేవలు ఎవరు అందిస్తారనే అంశం ప్రశ్నార్థకంగా మారింది. ఒప్పందం మేరకు గాయం పూర్తిగా మానే వరకు శస్త్రచికిత్స చేసిన డాక్టరే స్వయంగా బాధితుని ఇంటికి వెళ్లి వైద్య సేవలు అందించాలి. ఇప్పటి వరకు డాక్టర్ చంద్రభూషణే స్వయంగా బాధితుని ఇంటికి వెళ్లి వైద్యం అందించారు. అయితే తమకు కనీసం మాట కూడా చెప్పకుండా తమ కుమారునికి ఎత్తుపెంపు శస్త్రచికిత్స చేయడం అనైతికమని ఆరోపిస్తూ నిఖిల్ తండ్రి గోవర్ధన్ రెడ్డి ఎంసీఐకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ వైద్య మండలి చంద్రభూషణ్‌పై రెండేళ్లు వేటు వేసింది. తీర్పు నేపథ్యంలో ఆయన బాధితునికి వైద్యం చేయలేని స్థితి. ఆయన స్థానంలో ఎవరు వైద్యం అందిస్తారో కూడా ఆస్పత్రి యాజమాన్యం ఇప్పటి వరకు స్పష్టం చేయలేదు. దీంతో నిఖిల్‌కు వైద్యసేవలు అందించే అంశం ప్రశ్నార్థకమైంది.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం: గ్లోబల్ యాజమాన్యం
నిఖిల్‌కు వైద్యం చేసేందుకు ఇప్పటి వరకు డాక్టర్ చంద్రభూషణే స్వయంగా బాధితుని ఇంటికి వెళ్లేవారు. ప్రస్తుతం ఎంసీఐ ఆయనపై ఆంక్షలు విధించింది. అయినప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం. ప్రస్తుతం బాధితుడు నడుస్తున్నాడు. మెట్లు కూడా ఎక్కి దిగుతున్నాడు. ఆయన ఆరోగ్యం కూడా మెరుగుపడింది. బాధితుడు నడవగలిగే స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆస్పత్రికి రావాల్సిందిగా సూచించాం. దానికి వారి తల్లిదండ్రులు అంగీకరించారు. బాధితునికి పూర్తిస్థాయి వైద్యసేవలు అందిస్తాం. ఇప్పటికే ప్రత్యామ్నాయ వైద్యులను కూడా ఏర్పాటు చేశాం.
గాయాన్ని శుభ్రం చేసి 11 రోజులైంది
నిఖిల్‌కు ఎత్తుపెంపు శస్త్రచికిత్స చేసి ఎనిమిది మాసాలైంది. ఇంకా గాయం మానలేదు. లేచి నాలుగు అడుగులు వేస్తే కాళ్లు వాస్తున్నాయి. ఇప్పటికీ భరించలేని నొప్పితో బాధపడుతున్నాడు. మా అభ్యంతరం మేరకు ఎత్తు పెంపు ప్రక్రియను మధ్యలోనే నిలిపివేశారు. కానీ రెండు కాళ్లకు వేసిన రాడ్లు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. గాయం మానకపోవడంతో దానికి కట్టుకట్టారు. ఇన్ఫెక్షన్ రాకుండా ఎప్పటికప్పుడు కట్లను విప్పి శుభ్రం చేయాల్సి ఉన్నా.. 11 రోజుల నుంచి ఎవరూ రాలేదు. ఆస్పత్రికి ఫో¯ŒS చేస్తే.. సరైన స్పందన రావడం లేదు. అదేమంటే డాక్టర్‌పై ఫిర్యాదు చేసి.. సస్పెండ్ చేయించారు కదా.. అంటూ వైద్య సేవల బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారు. – గోవర్ధన్ రెడ్డి, నిఖిల్ తండ్రి