
భారత సంతతి బాలుడి అరుదైన ఘనత!
బ్రిస్బేన్: భారత సంతతికి చెందిన బాలుడు జూనియర్ చెస్ చాంపియన్ షిప్ లో సత్తాచాటాడు. నికిల్ రెడ్డి అనే ఎనిమిదేళ్ల బాలుడు ఆస్ట్రేలియాలో జరిగిన చెస్ చాంపియన్ షిప్ లో విజేతగా నిలిచాడు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియా జూనియర్ చెస్ చాంపియన్ షిప్-2017 (ఏజేసీసీ) నిర్వహించారు. ఇందులో భారత సంతతికి చెందిన కర్రి బుచ్చిరెడ్డి, సంధ్యారెడ్డి దంపతుల కుమారుడు నికిల్ రెడ్డి పాల్గొన్నాడు. భారత సంతతికి చెందిన వీరు సిడ్నీ న్యూసౌత్ వెల్స్ లో నివాసం ఉంటున్నారు. ఈ చాంపియన్‌షిప్ మూడు రోజుల్లో మొత్తం తొమ్మిది రౌండ్లపాటు నిర్వహించారు. తుది ఫలితాలలో ఎక్కువ పాయింట్లు సాధించిన నిఖిల్ చాంపియన్‌షిప్ సాధించాడు.
చిన్నప్పటినుంచీ నిఖిల్‌కు చెస్ అంటే ఎంతో ఇష్టమని, గేమ్‌పై ఉన్న ఆసక్తిని గమనించి కోచింగ్ ఇప్పించామని నిఖిల్ తండ్రి బుచ్చిరెడ్డి తెలిపారు. తరచుగా సోదరుడు నీయిల్ రెడ్డితో ప్రాక్టీస్ చేస్తూ ఆటపై పట్టుసాధించేందుకు నిఖిల్ తాపత్రయ పడేవాడని చెప్పారు. ఎట్టకేలకు ఆస్ట్రేలియా టాప్ మోస్ట్ చెస్ చాంపియన్ షిప్ సాధించి, భారతీయులు గర్వపడేలా చేశాడని కుమారుడిని తండ్రి బుచ్చిరెడ్డి ప్రశంసల్లో ముంచెత్తారు.