గ్లోబల్ ఆసుపత్రి లెసైన్స్ రద్దు చేయాలి
హెచ్చార్సీలో నిఖిల్‌రెడ్డి తండ్రి ఫిర్యాదు
హైదరాబాద్: గ్లోబల్ ఆసుపత్రి యాజమా న్యం తక్షణమే నిఖిల్ రెడ్డికి పూర్తిస్థాయి ఉచిత వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన తండ్రి ఎస్.గోవర్ధన్‌రెడ్డి బుధవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను కోరారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్.మల్లారెడ్డి, బీజేపీ నేత డాక్టర్ కె.రాజా గౌడ్‌తో కలసి బుధవారం నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు వెళ్లిన గోవర్ధన్ గ్లోబల్ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నిఖిల్ రెడ్డికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. మెడికల్ కౌన్సిల్ నిబంధనలు ఉల్లంఘించిన గ్లోబల్ ఆసుపత్రి లెసైన్స్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిఖిల్‌రెడ్డికి సర్జరీ చేసిన డాక్టర్ చంద్రభూషణ్ వైద్యవృత్తిలో కొనసాగకుండా నిషేధించాలని కోరారు. నిఖిల్ రెడ్డిని మోసం చేసిన ఆసుపత్రి సీఈవో శివాజీ ఛటోపాధ్యాయ, డాక్టర్ చంద్రభూషణ్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై నిపుణులైన డాక్టర్లతో విచారణ జరిపించాలని అన్నారు.