నాన్నకు చెప్పకుండా తప్పు చేశా
‘సాక్షి’ ఇంటర్వ్యూలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నిఖిల్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘మా ఇంజినీరింగ్ క్లాస్‌లో మొత్తం 30 మంది స్టూడెంట్స్. అందులో ముగ్గురమే 5.7 అడుగుల కంటే తక్కువ ఎత్తు ఉండేటోళ్లం. అందుకే నేనూ మిగిలిన వాళ్లలా రెండు మూడు ఇంచ్‌లు పెరిగేందుకే శస్త్రచికిత్సతో సాహసం చేశా. ఈ చికిత్స విషయాన్ని నా తల్లితండ్రుల వద్ద దాచి తప్పే చేశా. అయితే డాక్టర్లు రెండు రోజుల్లో డిశ్చార్జి, వారం రోజుల్లో వాకర్ సహాయంతో నడవొచ్చని చెప్పారు. కానీ పది రోజులవుతున్నా కనీసం పూర్తిగా కూర్చోలేకపోతున్నా’ అంటూ ఏప్రిల్ 5న గ్లోబల్ ఆస్పత్రిలో ఎత్తు పెరిగేందుకు రెండు కాళ్లకూ శస్త్రచికిత్స చేయించుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నిఖిల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన గ్లోబల్ ఆస్పత్రిలో ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. వివరాలు నిఖిల్ మాటల్లోనే...
వారిలో ఒకడిగా...
ఇంజనీరింగ్ క్లాస్‌మేట్సంతా నాకన్నా రెండు నుంచి మూడు ఇంచుల ఎత్తు పెరిగారు. నేను వారితో సమానంగా పెరగాలనుకున్నా. ఎత్తు పెరిగే వైద్యం కోసం ఆన్‌లైన్‌లో ఏడాది పాటు సెర్చ్ చేశా. చివరకు రష్యా, చైనాలో ‘ఇల్‌జర్వ్’ ప్రక్రియతో ఎత్తు పెంచే (లింబ్ లెంగ్తెనింగ్) ఆపరేషన్స్‌ను పరిశీలిం చా. ఆపై మిత్రులతో కలసి గ్లోబల్ ఆస్పత్రిని సంప్రదించా. గతంలో మేం ఎత్తు పెంచేం దుకు చేసిన శస్త్ర చికిత్సలు పూర్తి సక్సెస్ అయ్యాయని ఇక్కడి వైద్యులు చెప్పారు. శస్త్రచికిత్సకు తొలుత రూ.2.5 లక్షలని చెప్పి.. చివరకు రూ.3 లక్షలు అన్నారు. 2.5-3 ఇంచుల ఎత్తు పెంచేందుకు పూర్తి శాస్త్రీయ పద్ధతిలో శస్త్రచికిత్స చేస్తామన్నారు. నాలుగైదు మాసాల్లో పూర్తిగా కోలుకోవచ్చన్నారు. అదే ధీమాతో జనవరి 23 నా 22వ పుట్టినరోజు నాడు గ్లోబల్ ఆస్పత్రికి వచ్చి లక్ష రూపాయల ఫీజు అడ్వాన్స్‌గా చెల్లించాను.
అమ్మానాన్నకు చెబితే వద్దంటారనే...
అమ్మానాన్నలకు చెబితే వద్దంటారనే వారికి చెప్పకుండా మిత్రులతో కలసి ఆస్పత్రిలో చేరా. నేను మేజర్ అవ్వడంతో అమ్మానాన్నలు ఎక్కడని ఆస్పత్రివారు అడగలేదు. నేను పనిచేసే కంప్యూటర్ సంస్థలో వచ్చే జీతం మొత్తాన్ని అమ్మకే ఇస్తుండేవాడిని. శస్త్రచికిత్సకు అవసరమయ్యే డబ్బు కోసం రాత్రిళ్లు పనిచేసి వివిధ రకాల కంప్యూటర్ అప్లికేషన్లు రూపొందించా. ఆ డబ్బుతోనే ఫీజు చెల్లించేశా. ఏప్రిల్ 5న ఆరు గంటల పాటు శస్త్రచికిత్స చేశారు. ఇప్పటికే పది రోజులవుతోంది. కాళ్లలో మంటలు, బొబ్బలు వస్తున్నాయి. మా అన్నయ్య ఇప్పటికే సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టారు. నేనూ సొంతంగా కంపెనీ పెట్టి హుందాగా ఎదగాలన్నదే లక్ష్యం. కాలేజీ రోజుల్లోనే నేను రూపొందించిన వివిధ అప్లికేషన్లకు మంచి డిమాండ్ వచ్చింది. కానీ ఇప్పుడు చూడాలి. దేవుడు ఏం చేస్తాడో!
ఇన్‌ఫెక్షన్... భయపెడుతోంది: తండ్రి గోవర్ధన్‌రెడ్డి
‘ఉగాది రోజునే మా వాడిని డిశ్చార్జి చేస్తామన్నారు. కానీ నిన్నటి నుంచి కాళ్లపై బొబ్బలు వచ్చాయి. విపరీతమైన మంటలు, నొప్పులు వస్తున్నాయి. కదల్లేకపోతున్నాడు. నా కుమారుడి విషయంలో పూర్తి అనైతికంగా వ్యవహరించిన వైద్యులు, ఆస్పత్రిపై కేసు పెట్టాం. త్వరలో ఇండియన్ మెడికల్ కౌన్సిల్‌కూ ఫిర్యాదు చేస్తాం.
చిన్నప్పటి నుంచే... ఎంతో ప్రతిభ...
టెన్త్‌లో ఫస్ట్‌క్లాస్‌లో పాసైన నిఖిల్ ఇంటర్, ఇంజనీరింగ్‌లో డిస్టింక్షన్ సాధించాడు. నగర శివారులోని ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్‌లోనే నిఖిల్ రూపొందించిన ‘నోటీస్‌బోర్డ్’ కంప్యూటర్ అప్లికేషన్ ఎంతో పాపులర్ అయింది. సెయింట్‌మార్టిన్ సహా సీబీఐటీ సైతం నిఖిల్ రూపొందించిన అప్లికేషన్‌తోనే విద్యార్థుల హాజరు, ఫలితాల వివరాలను అనుసంధానం చేసేసింది. ఇవి కాకుండా తన సీనియర్స్, జూనియర్స్ కోసం సుమారు 16 అప్లికేషన్స్‌ను నిఖిల్ రూపొందించారు.