
'నిఖిల్ భవిష్యత్ కు ఢోకా లేదు'
హైదరాబాద్: నిఖిల్ రెడ్డి అనే యువకుడికి నిర్వహించిన ఎత్తు పెంపు ఆపరేషన్ కు అనుసరించిన విధానం సరైందేనని ప్రముఖ వైద్యులు తెలిపారు. ఈ వివాదంపై వివరణ ఇచ్చేందుకు వైద్యులంతా కలిపి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నిఖిల్ రెడ్డికి అందించిన చికిత్సలో గానీ, అనుసరించిన విధానంలో గానీ ఎలాంటి పొరపాటు లేదని స్పష్టం చేశారు. అతడి తల్లిదండ్రులకు తెలియకపోవడం వల్లే వివాదం తలెత్తిందని అన్నారు. తల్లిదండ్రుల ఆవేదన కారణంగానే ఈ వివాదం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పారు. వైద్యులు, రోగులకు మధ్య అపోహలు సృష్టించే ప్రయత్నం చేయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. మీడియా సహకారంతో హైదరాబాద్ లో ఆరోగ్య రంగం ఎదిగిందని తెలిపారు.
నిఖిల్ రెడ్డి విషయంలో శాస్త్రసాంకేతిక అంశాలను హైలెట్ చేయాలని కోరారు. అతడికి భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు రావని డాక్టర్లు హామీయిచ్చారు. ఎత్తు పెరగడానికి చేసిన ఆపరేషన్ అనైతికం కాదని అన్నారు. గురువారెడ్డి, గోపాల్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, చంద్రభూషణ్, ప్రసాద్ తదితర వైద్యులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. నిఖిల్ తల్లిదండ్రులకు తెలియకుండా అతడికి లక్డికాపూల్ లోని గ్లోబల్ ఆస్పత్రిలో వైద్యులు ఎత్తు పెంపు ఆపరేషన్ చేయడంతో వివాదం తలెత్తింది.