నిఖిల్ రెడ్డిని పరామర్శిస్తున్న ఎమ్మెల్యే కిషన్ రెడ్డి
గాజులరామారం: ఎత్తు పెరగాలన్న యువకుడి ఆసక్తిని అవకాశంగా తీసుకుని గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు అతనిపై ఆపరేషన్ పేరుతో ప్రయోగాలు చేసి బలి పశువుని చేశారని బీజేపీ శాసన సభ పక్ష నేత కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఎంఎన్ రెడ్డి నగర్‌లోని నిఖిల్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇంతకుముందు ఎవరికీ చేయని ఆపరేషన్‌ను నిఖిల్‌పై ప్రయోగాత్మకంగా చేసి అతని భవిష్యత్‌ను నాశనం చేశారన్నారు. 6 నెలలుగా ఎత్తు పెరగాలని తమను సంప్రదిస్తున్న నిఖిల్‌ను వైద్యులు తప్పుదారి పట్టించి అపరేషన్ చేసి చేతులు దులుపుకున్నారన్నారు.
శస్త్ర చికిత్సకు ముందు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలన్న నిబంధనను కూడా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. దీనిపై బీజేపీ తరపున ప్రభుత్వ ఛీప్ సెక్రెటరీని కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సమస్యను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళతామన్నారు. ఆపరేషన్ చేసిన డాక్టర్ గుర్తింపును రద్దు చేయడంతో పాటు గ్లోబల్ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలన్నారు. బాధితునికి వైద్యం అందించాలని, నష్టపరిహారం చెల్లించాలని, భవిష్యత్‌లో ఎవరూ ఇలాంటి చికిత్సలను చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు.