Global hospital doctors
-
జ్ఞానసాయికి ఉచితంగా చికిత్స
- కాలేయ మార్పిడికి ముందుకొచ్చిన గ్లోబల్ ఆస్పత్రి - ప్రభుత్వమే ఖర్చును భరిస్తుందన్న సీఎం సాక్షి, హైదరాబాద్/అమరావతి: పుట్టుకతోనే కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్న చిన్నారి జ్ఞానసాయికి చికిత్స చేసేందుకు గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు ముందుకొచ్చారు. పైసా ఖర్చు లేకుండానే కాలేయ మార్పిడి చేయనున్నట్లు ప్రకటించారు. చిత్తూరుజిల్లా ములకలచెరువు మండలం బత్తలాపురానికి చెందిన రమణప్ప, సరస్వతి దంపతుల ఎనిమిది నెలల చిన్నారి జ్ఞానసాయి పుట్టుకతోనే అరుదైన కాలేయ సంబంధ వ్యాధి(బిలియరి అట్రీషియా)తో బాధపడుతోంది. దీనిపై ‘సాక్షి’ రాసిన కథనానికిగ్లోబల్ ఆస్పత్రి సీఎండీ డాక్టర్ రవీంద్రనాథ్సహా ప్రముఖ కాలేయ మార్పిడి నిపుణుడు డాక్టర్ మహ్మద్రేలా స్పందించారు. పైసా ఖర్చులేకుండా చెన్నై గ్లోబల్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయనున్నట్లు ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్ గోబల్ ఆస్పత్రిలో పాప ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. వైద్య ఖర్చుల్ని ప్రభుత్వమే భరిస్తుందన్న సీఎం : ఇదిలా ఉండగా జ్ఞానసాయి వైద్యానికయ్యే ఖర్చులన్నింటినీ భరిస్తామని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. జ్ఞానసాయిపై వచ్చిన కథనాన్ని ఆరోగ్యమంత్రి కామినేని శ్రీనివాస్ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందిస్తూ..చికిత్స అందించడానికి అవసరమైన నగదును సీఎం సహాయనిధి నుంచి మంజూరుచేయాలని అధికారుల్ని ఆదేశించారు. గ్లోబల్ హాస్పిటల్ వైద్యులతో మాట్లాడి చికిత్సకు ఏర్పాట్లు చేయాలని కోరారు. ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపిన జ్ఞానసాయి తల్లిదండ్రులు తంబళ్లపల్లె: చిన్నారి జ్ఞానసాయికి ‘సాక్షి’ చేయూతనిచ్చింది. ఆమె దీనస్థితి గురించి, సాక్షి పలు వార్తా కథనాలు రాసింది. దీనికి గ్లోబల్ ఆసుపత్రి యాజమాన్యం, సీఎం స్పందించడంలో పాటు స్పందించిన దాతలు విరాళాలను చెక్కుల రూపంలో రూ.16 వేలు, రూ.పదివేలు చొప్పున ఆర్థిక సాయాన్ని జ్ఞానసాయి తండ్రి రమణప్పకు అందజేశారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’కి చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. -
'నిఖిల్‌ను ప్రయోగవస్తువుగా వాడుకున్నారు'
గాజులరామారం: ఎత్తు పెరగాలన్న యువకుడి ఆసక్తిని అవకాశంగా తీసుకుని గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు అతనిపై ఆపరేషన్ పేరుతో ప్రయోగాలు చేసి బలి పశువుని చేశారని బీజేపీ శాసన సభ పక్ష నేత కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఎంఎన్ రెడ్డి నగర్‌లోని నిఖిల్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇంతకుముందు ఎవరికీ చేయని ఆపరేషన్‌ను నిఖిల్‌పై ప్రయోగాత్మకంగా చేసి అతని భవిష్యత్‌ను నాశనం చేశారన్నారు. 6 నెలలుగా ఎత్తు పెరగాలని తమను సంప్రదిస్తున్న నిఖిల్‌ను వైద్యులు తప్పుదారి పట్టించి అపరేషన్ చేసి చేతులు దులుపుకున్నారన్నారు. శస్త్ర చికిత్సకు ముందు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలన్న నిబంధనను కూడా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. దీనిపై బీజేపీ తరపున ప్రభుత్వ ఛీప్ సెక్రెటరీని కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సమస్యను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళతామన్నారు. ఆపరేషన్ చేసిన డాక్టర్ గుర్తింపును రద్దు చేయడంతో పాటు గ్లోబల్ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలన్నారు. బాధితునికి వైద్యం అందించాలని, నష్టపరిహారం చెల్లించాలని, భవిష్యత్‌లో ఎవరూ ఇలాంటి చికిత్సలను చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. -
నరకయాతనలో నిఖిల్
♦ నొప్పులకు తాళలేక దీనంగా మత్తు కోసం వేడుకోలు ♦ వాచిపోయిన రెండు కాళ్లు ♦ వైద్యుల తీరుపై సర్వత్రా విమర్శలు ♦ ఆపరేషన్ చేసిన వైద్యుడికి ఎంసీఐ నోటీసులు ♦ వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ సాక్షి, హైదరాబాద్: ఎత్తు పెరిగేందుకు ఆపరేషన్ చేయించుకుని గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిఖిల్‌రెడ్డి (22)నొప్పులకు తట్టుకోలేక నరకయాతన పడుతున్నాడు. రెండు కాళ్లు లావుగా వాచిపోయాయి. ఎటూ కదల్లేక పడి ఉన్నాడు. ‘నొప్పిని భరించలేక పోతున్నా.. మత్తు మందు ఇప్పించండి..’ అంటూ పరామర్శకు వెళ్లిన వారిని నిఖిల్ వేడుకోవడం కలచివేస్తోంది. మరోవైపు ఆపరేషన్ తర్వాత నొప్పి సహజమేనని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, మరో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జి చేసే అవ కాశం ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా ఎత్తు పెంచేందుకు ఆపరేషన్ చేయడంపై భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) ఆసుపత్రిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిఖిల్‌కు శస్త్రచికిత్స చేసిన వైద్యుడు డాక్టర్ చంద్రభూషన్కు నోటీసులు జారీ చేసింది. ఐదడుగుల కంటే తక్కువ ఎత్తు ఉన్న వారికే ఎత్తు పెంచే శస్త్రచికిత్స చేయాలని నిబంధన ఉన్నా.. 5.7 అడుగుల ఎత్తున్న నిఖిల్‌కు ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. సభ్యుల ముందు స్వయంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా ఎంసీఐ చైర్మన్ డాక్టర్ రవీందర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఎవరికి ఆపరేషన్ చేయొచ్చు? నిజానికి బోన్ క్యాన్సర్, పోలియో, ఫ్లోరైడ్ వల్ల కాళ్లు వంకర్లు పోవడం, ఏదైనా ప్రమాదంలో ఎముకలు విరిగి నుజ్జునుజై పోయిన వారికి ఈ తరహా చికిత్సలు చేయవచ్చు. ఎంసీఐ ప్రకారం ఐదడుగుల కంటె తక్కువ ఎత్తు, ఒక కాలు పొడవు, మరొక కాలు పొట్టిగా ఉన్న వారికి ఈ ఆపరేషన్ చేసి రెండు నుంచి మూడు అంగుళాల వరకు ఎత్తుపెంచుకునే అవకాశం ఉంది. అంతకు మించి ఎత్తు పెంచితే కండరాలు, నరాలు బిగుసుకు పోతాయి. మోకాళ్ల పనితీరు దెబ్బతింటుంది. రోగి కోలుకోవాలంటే తొమ్మిది మాసాలు పడుతుంది. బెడ్‌రెస్ట్, వీల్ చైర్‌కే పరిమితం కావాల్సి ఉంది. ఒక్కోసారి ఇన్ఫెక్షన్ వల్ల శస్త్రచికిత్స చేయించుకున్న భాగాన్ని పూర్తిగా కోల్పోవాల్సి ఉంటుందని పలువురు సీనియర్ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శస్త్రచికిత్సలో ఉన్న రిస్క్, తర్వాత తలెత్తే పరిణామాలను ముందే రోగి సహా బంధువులకు వివరించాలి. కానీ సదరు వైద్యుడు ఇవేవీ పట్టించుకోకుండా శస్త్రచికిత్స చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఏవీఎస్ ఇకలేరు
తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన హాస్యనటుడు కాలేయం, మూత్రపిండాలకు తీవ్ర ఇన్ఫెక్షన్ సాక్షి, హైదరాబాద్: ప్రముఖ తెలుగు హాస్యనటుడు ఏవీఎస్ శుక్రవారం రాత్రి తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన పూర్తి పేరు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం. వయసు 56 సంవత్సరాలు. స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. హైదరాబాద్‌లోని మణికొండలో నివసిస్తున్న ఏవీఎస్‌కు భార్య ఆశ, కుమారుడు ప్రదీప్, కూతురు ప్రశాంతి ఉన్నారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఏవీఎస్‌ను పది రోజుల కిందట చికిత్స కోసం గ్లోబల్ ఆస్పత్రిలో చేర్పించారు. కాలేయంలో తీవ్ర ఇన్ఫెక్షన్తో పాటు మూత్రపిండాలు పాడైపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పది రోజుల నుంచి ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకపోవటంతో శుక్రవారం సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. హైదరాబాద్ మణికొండ పంచాయతీ పరిధిలోని శివాజీనగర్ కాలనీలో గల దేవులపల్లి అపార్ట్మెంట్లో ఆయన స్వగృహానికి తరలించారు. ఏవీఎస్ రాత్రి 8.05 నిమిషాల ప్రాంతంలో కన్నుమూశారు. ఆయనకు 2008లో కాలేయం పాడైపోగా.. అప్పట్లో గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఏవీఎస్ కుమార్తె శ్రీప్రశాంతి ఆయనకు లివర్‌ను దానం చేశారు. శస్త్రచికిత్స తర్వాత కోలుకున్న ఆయన మళ్లీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు. ఐదేళ ్లపాటు ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే నటనే ప్రాణంగా బతుకుతున్న ఏవీఎస్ వేళకు మందులు వేసుకోకపోవడం, సమయానికి వైద్యుడిని సంప్రదించకపోవడం వంటి కారణాలతో కాలేయంలో ఇటీవల మళ్లీ ఇన్ఫెక్షన్ వ చ్చింది. మళ్లీ ఆస్పత్రిలో చికిత్స అందించినప్పటికీ.. ఇన్ఫెక్షన్ తగ్గకపోగా మూత్రపిండాలపై కూడా ప్రభావం పడింది. మూత్రపిండాలు కూడా పాడైపోవడంతో డయాలసిస్ చేస్తున్నారు. ఏవీఎస్‌కు మళ్లీ కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేసినా ఫలితం ఉండదని, కోలుకోలేని స్థితిలోకి వెళ్లిపోయారని, ఇక తాము ఏమీ చేయలేమని ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు చెప్పారు. దీంతో బంధువులు ఆయన్ను శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లారు. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్నాక తనను చూసేందుకు వచ్చిన వారితో ఏవీఎస్ మాట్లాడారు. ఆ తర్వాత కొద్ది గంటలకే ఆయన కన్నుమూశారు. ప్రముఖుల నివాళులు: పాత్రికేయుడు, హాస్యనటుడు, రచయిత, నిర్మాత, దర్శకుడిగా బహుముఖ ప్రతిభాశాలి అయిన ఏవీఎస్ మరణంతో మణికొండలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయనను చివరిసారిగా పరామర్శించిన వారిలో సినీ ప్రముఖులు మురళీమోహన్‌తో పాటు శివకృష్ణ, పరుచూరి గోపాలకృష్ణ, జయలలిత, అశోక్‌కుమార్, మహర్షి ఉన్నారు. ఏవీఎస్ మరణం విషయం తెలుసుకుని సినీనటులు సాయికుమార్, ఆలి, ఉత్తేజ్ లు నివాళులర్పించారు. పార్లమెంటు సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఏవీఎస్ మృతికి కిరణ్, బాబు, చిరంజీవి విచారం ఏవీఎస్ మృతి పట్ల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఏవీఎస్ ఉత్తమ నటుడని, తన ప్రతిభతో ఎన్నో అవార్డులు గెలుచుకున్నారని సీఎం పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఏవీఎస్ మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏవీఎస్ మృతి సినీ ప్రపంచానికి తీరనిలోటని కేంద్ర మంత్రి చిరంజీవి సంతాపం వ్యక్తంచేశారు. రాష్ట్ర మంత్రి డీకే అరుణ ఏవీఎస్ కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలిపారు. జర్నలిస్టుల ఉద్యమంలో ఏవీఎస్ ఎనలేని కృషి చేశారని స్మరించుకున్నారు. పాత్రికేయుల హక్కుల కోసం ఆయన పోరాటం చేశారని ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ) సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు సోమసుందర్, ప్రధాన కార్యదర్శి వై.నరేందర్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిడి సోమయ్యలు సంతాపం తెలిపారు. కళా రంగానికి తీరని లోటు: జగన్ సంతాపం హాస్యనటుడు ఏవీఎస్ మరణం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఏవీఎస్ మరణం కళా, సాంస్కృతిక రంగాలకు తీరనిలోటన్నారు. జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించిన ఏవీఎస్ సినీరంగంలో స్థిరపడి, తన నటనతో తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొన్నారని కీర్తించారు. ఏవీఎస్ మృతి సినిమా రంగానికి తీరని లోటంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.