నరకయాతనలో నిఖిల్
♦ నొప్పులకు తాళలేక దీనంగా మత్తు కోసం వేడుకోలు
♦ వాచిపోయిన రెండు కాళ్లు
♦ వైద్యుల తీరుపై సర్వత్రా విమర్శలు
♦ ఆపరేషన్ చేసిన వైద్యుడికి ఎంసీఐ నోటీసులు
♦ వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ
సాక్షి, హైదరాబాద్: ఎత్తు పెరిగేందుకు ఆపరేషన్ చేయించుకుని గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిఖిల్‌రెడ్డి (22)నొప్పులకు తట్టుకోలేక నరకయాతన పడుతున్నాడు. రెండు కాళ్లు లావుగా వాచిపోయాయి. ఎటూ కదల్లేక పడి ఉన్నాడు. ‘నొప్పిని భరించలేక పోతున్నా.. మత్తు మందు ఇప్పించండి..’ అంటూ పరామర్శకు వెళ్లిన వారిని నిఖిల్ వేడుకోవడం కలచివేస్తోంది. మరోవైపు ఆపరేషన్ తర్వాత నొప్పి సహజమేనని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, మరో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జి చేసే అవ కాశం ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
కాగా, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా ఎత్తు పెంచేందుకు ఆపరేషన్ చేయడంపై భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) ఆసుపత్రిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిఖిల్‌కు శస్త్రచికిత్స చేసిన వైద్యుడు డాక్టర్ చంద్రభూషన్‌కు నోటీసులు జారీ చేసింది. ఐదడుగుల కంటే తక్కువ ఎత్తు ఉన్న వారికే ఎత్తు పెంచే శస్త్రచికిత్స చేయాలని నిబంధన ఉన్నా.. 5.7 అడుగుల ఎత్తున్న నిఖిల్‌కు ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. సభ్యుల ముందు స్వయంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా ఎంసీఐ చైర్మన్ డాక్టర్ రవీందర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ఎవరికి ఆపరేషన్ చేయొచ్చు?
నిజానికి బోన్ క్యాన్సర్, పోలియో, ఫ్లోరైడ్ వల్ల కాళ్లు వంకర్లు పోవడం, ఏదైనా ప్రమాదంలో ఎముకలు విరిగి నుజ్జునుజై పోయిన వారికి ఈ తరహా చికిత్సలు చేయవచ్చు. ఎంసీఐ ప్రకారం ఐదడుగుల కంటె తక్కువ ఎత్తు, ఒక కాలు పొడవు, మరొక కాలు పొట్టిగా ఉన్న వారికి ఈ ఆపరేషన్ చేసి రెండు నుంచి మూడు అంగుళాల వరకు ఎత్తుపెంచుకునే అవకాశం ఉంది. అంతకు మించి ఎత్తు పెంచితే కండరాలు, నరాలు బిగుసుకు పోతాయి. మోకాళ్ల పనితీరు దెబ్బతింటుంది. రోగి కోలుకోవాలంటే తొమ్మిది మాసాలు పడుతుంది. బెడ్‌రెస్ట్, వీల్ చైర్‌కే పరిమితం కావాల్సి ఉంది. ఒక్కోసారి ఇన్‌ఫెక్షన్ వల్ల శస్త్రచికిత్స చేయించుకున్న భాగాన్ని పూర్తిగా కోల్పోవాల్సి ఉంటుందని పలువురు సీనియర్ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శస్త్రచికిత్సలో ఉన్న రిస్క్, తర్వాత తలెత్తే పరిణామాలను ముందే రోగి సహా బంధువులకు వివరించాలి. కానీ సదరు వైద్యుడు ఇవేవీ పట్టించుకోకుండా శస్త్రచికిత్స చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.