నిఖిల్ కి రూ.కోటి పరిహారం ఇవ్వాలి
♦ గ్లోబల్ ఆస్పత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలి
♦ సీఎస్ రాజీవ్ శర్మను కోరిన బీజేపీ ముఖ్య నేతలు
సాక్షి, హైదరాబాద్: ఎత్తు పెంపు పేరుతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నిఖిల్‌రెడ్డి కాళ్లకు అశాస్త్రీయ పద్ధతిలో శస్త్రచికిత్స నిర్వహించిన గ్లోబల్ ఆస్పత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను గురువారం సచివాలయంలో కలసి ఈ ఉదంతంపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. అనంతరం బీజేపీ శాసనసభాపక్ష ఉప నేత చింతల రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు ఎస్.మల్లారెడ్డి, ఎం.చంద్రయ్యలతో కలసి విలేకరులతో మాట్లాడారు. నిఖిల్‌రెడ్డికి చేసిన శస్త్రచికిత్స హైదరాబాద్‌లో జరగడం ఇదే తొలిసారి అని, వైద్య ప్రయోగాల కోసం నిఖిల్‌రెడ్డిని పావుగా వాడుకున్నారని, నిఖిల్‌రెడ్డి ఎక్స్‌పెరిమెంట్‌గా ప్రచారం కోసమే ఈ శస్త్రచికిత్స జరిపారని మండిపడ్డారు.
వైద్యం పేరుతో ప్రజలను దోచుకోడానికి ఇలా కొత్త మార్గాన్ని కనుక్కున్నారని ఆరోపించారు. కుటుంబ సభ్యులకు సైతం సమాచారం ఇవ్వకుండా శస్త్రచికిత్స నిర్వహించడం అక్రమమన్నారు. వారం రోజుల్లోనే కోలుకుంటావని నిఖిల్‌రెడ్డికి వైద్యులు హామీ ఇచ్చారని, రెండు నెలలు గడుస్తున్నా అతను కదలలేని స్థితిలో నరకయాతన అనుభవిస్తున్నాడని చెప్పారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టకపోవడం దురదృష్టకరమన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి సైతం నిఖిల్‌రెడ్డిని పరామార్శించడానికి రాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు.
ఈ ఘటనపై భారత వైద్య మండలి(ఎంసీఐ)కి ఫిర్యాదు చేస్తామన్నారు. గ్లోబల్ ఆస్పత్రి యాజమాన్యం నుంచి నిఖిల్‌రెడ్డికి రూ.కోటి పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. నిఖిల్‌రెడ్డిని మోసం చేసిన ఆస్పత్రి సీఈవో శివాజీ చటోపాధ్యాయ, వైద్యుడు చంద్రభూషణ్‌పై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కార్పొరేట్ ఆస్పత్రులపై నిఘా ఉంచాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.