ఇక ఆరోగ్యం బతికే దారేది? | nikhil reddy hight growth create sensation | Sakshi
Sakshi News home page

ఇక ఆరోగ్యం బతికే దారేది?

Published Fri, Apr 8 2016 12:43 AM | Last Updated on Sun, Sep 3 2017 9:25 PM

ఇక ఆరోగ్యం బతికే దారేది?

ఇక ఆరోగ్యం బతికే దారేది?

సమకాలీనం
నిఖిల్ అనాకారి కాదు, 5.7 అడుగుల ఎత్తు తక్కువేం కాదు. ఒక మానసికవైద్యుడిని (సైకియాట్రిస్ట్) కూడా భాగస్వామిని చేసి నచ్చజెప్పి ఉండాల్సింది. ఇప్పటికీ వైద్య వృత్తి చేపట్టేటప్పుడు చేసే ప్రమాణం, 2500 ఏళ్ల కింద గ్రీక్ భాషలో రూపొందిన ‘హిపాక్రటిక్ ఓత్’లో కూడా ఇటువంటి ప్రతిపాదన ఉంది. ‘‘... నేను చేసే వైద్య చికిత్సలో నాకు తెలియని ఒక ప్రత్యేకమైన నైపుణ్యం అవసరమైతే, సదరు నిపుణుడ్ని పిలువడానికి సిగ్గుపడను, వెనుకాడను’’ అనే ఆ నైతికతను ఈ కేసులో ఏ మేరకు పాటించారన్నది అనుమానమే!
 
యువకుడు నిఖిల్‌రెడ్డి కాళ్లకు జరిగిన శస్త్ర చికిత్స పెద్ద చర్చనే లేవనెత్తింది. వైద్యం పేరిట తెలుగునాట జరుగుతున్న మంచీ-చెడూ రెండూ మరోమారు చర్చకు వస్తున్నాయి. వైద్య పరిస్థితుల్ని ఏ మాత్రం మెరుగుపరచడానికి ఈ చర్చ ఉపయోగపడ్డా మేలే! ఈ కేసులో వైద్యులు చేసింది న్యాయసమ్మతమే అని కొందరు, అవొచ్చు కానీ, ధర్మసమ్మతం కాదని మరికొందరు, ఏ రకంగా చూసినా ఇది నైతికం మాత్రం కానే కాదని ఇంకొందరు.... ఇలా భిన్న వాదనలు వినిపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని  వైద్యరంగంలో ఈరోజు, ఇంత సున్నితంగా చర్చించేంత, వైద్యుల ప్రతీ చర్య వెనుక హేతువును వెతికేంత ఆరోగ్య వాతావరణం ఉందా? హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో నిఖిల్‌రెడ్డి శస్త్ర చికిత్స ఎలా జరిగిందనే న్యాయ, ధర్మ, నైతిక సమీక్షను కొంతసేపు అలా ఉంచితే, ఇంతకన్నా వందలు, వేల రెట్ల న్యాయోల్లం ఘనలు, అధర్మ, అనైతిక వైద్య వ్యాపారాలు యథేచ్ఛగా సాగిపోతున్న సంగతి నిజం.  ఓ చిన్న వైద్యశాలతో మొదలెట్టి గొలుసుకట్టు ఆస్పత్రులు నెల కొల్పి కుబేరులైన వైద్యులు, వాటాల పంపకాలకోసం పట్టపగలు రాజధాని నడిబొడ్డున తుపాకులతో కాల్చుకునే సంస్కృతికి దిగజారడం నేడు నెలకొన్న దుస్థితికి ఓ సంకేతం మాత్రమే! నేనీ మాటలు రాస్తున్న ఈ గురువారం ‘ప్రపంచ ఆరోగ్యదినం’ కూడా కావడం, సదరు బ్యానర్లతో మనం మొక్కు బడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నంత కాకతాళీయమే! ఈ దేశంలో వైద్య దోపిడీ విచ్చలవిడితనంపై రాష్ట్ర ప్రభుత్వానికి గానీ, కేంద్ర ప్రభుత్వానికి గానీ ఎటువంటి నియంత్రణా లేదు. పెపైచ్చు, ప్రభుత్వ వైద్య వ్యవస్థను ప్రత్యక్షంగా పరోక్షంగా నిర్వీర్యం చేసే కార్పొరేట్ శక్తులకు దన్నుగా నిలుస్తున్న దాఖలాలు కోకొల్లలు.

సన్నపొర చెరగుతోంది
పొడుగు పెరగాలని కోరుకున్న నిఖిల్‌కి రాగల సంక్లిష్టతల్ని వివరించి శస్త్ర చికిత్స వలదని కౌన్సిలింగ్ చేసి ఉండాల్సింది, తల్లిదండ్రులతో చర్చించాల్సిందని పలువురు పేర్కొంటున్నారు. భవిష్యత్ మంచి-చెడులతో ముడివడి ఉన్న కీలక అంశాన్ని అంత గోప్యంగా జరిపించడం అనైతికమనేది వారి వాదన. తమకు తెలిస్తే వారిస్తామనో, వెనుకాడితే ఆ యువకుడు ఇంకో ఆస్పత్రికి వెళ్లి చేయించుకుంటాడనో, డబ్బుకోసమే తగని శస్త్ర చికిత్స తొంద రపడి జరిపారని తండ్రి ఆరోపిస్తున్నారు. మేజరయి ఉండి, బుద్ధి వికాసంతో ఉన్న వ్యక్తి, చికిత్స గురించి తెలిసి స్వయంగా అంగీకరించినపుడు తల్లి దండ్రుల సంతకం తీసుకోవాలని ఏ చట్టమూ నిర్దేశించడం లేదనేది వారి వాదన. ఇది చట్టబద్ధత-నైతికతల మధ్య నలిగే సున్నితాంశం. ముఖ్యంగా మూడంశాల్లో ఈ ధర్మసంకటం వస్తుందని నిపుణులంటున్నారు. స్థూల కాయం తగ్గించుకునే లైఫోసెక్షన్, బేరియాట్రిక్ సర్జరీ వంటి శస్త్ర చికిత్సలు, సిజేరియన్, గర్భస్రావం, గర్భసంచి తొలగించడం వంటి ఆరోగ్య సంబంధ చికిత్సలు, అందం-ఆకారం కోసం చేసుకునే వివిధ కాస్మటిక్ సర్జరీలు చేసేటప్పుడు.... చట్టబద్ధతకు, నైతికతకు మధ్య సన్నని పొర ఉంటుంది.

వ్యాపార దృక్పథంతో ఉన్న వైద్యులు, ఆస్పత్రుల వారు ఆ పొరను చెరిపేస్తు న్నారు. పై అన్ని సందర్భాల్లోనూ అనివార్యం, జీవన్మరణ సమస్య అయితే తప్ప ఆయా శస్త్ర చికిత్సలకు వెళ్లకూడదనేది నైతికాంశం. ముఖ్యంగా అందం-ఆకారం కోసం జరిపే శస్త్ర చికిత్సలకు ముందు కౌన్సిలింగ్ చేయాలి. నిఖిల్ అనాకారి కాదు, 5.7 అడుగుల ఎత్తు తక్కువేం కాదు. ఒక మానసికవైద్యుడిని (సైకియాట్రిస్ట్)ను కూడా భాగస్వామిని చేసి నచ్చజెప్పి ఉండాల్సింది. ఇప్పటికీ వైద్య వృత్తి చేపట్టేటప్పుడు చేసే ప్రమాణం, 2500 సంవత్సరాల కింద గ్రీక్ భాషలో రూపొందిన ‘హిపాక్రటిక్ ఓత్’లో కూడా ఇటువంటి ప్రతిపాదన ఉంది. ‘‘...... నేను చేసే వైద్య చికిత్సలో నాకు తెలియని ఒక ప్రత్యేకమైన నైపుణ్యం అవసరమైతే, సదరు నిపుణుడ్ని పిలు వడానికి సిగ్గుపడను, వెనుకాడను’’ అనే ఆ నైతికతను ఈ కేసులో ఏ మేరకు పాటించారన్నది అనుమానమే!

వైద్య దాష్టికాలకు అంతే లేదు
ఇది ఎత్తిచూపడమంటే, మంచి అసలే జరగటం లేదని చెప్పడం కానే కాదు. పెరిగిన శాస్త్ర-సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య విద్యా వికాసం వల్ల సమాజానికి మంచి జరుగుతోంది. కానీ, అధర్మం-అనైతికత మంచిని మించుతోంది. గ్రామాల్లో ఉండే ఆర్‌ఎంపీ వైద్యులకు పట్టణాలు, నగరాల్లో ఉండే పెద్దా స్పత్రులకు మధ్య, డయాగ్నస్టిక్ సెంటర్లకు కార్పొరేట్ వైద్యశాలలకు మధ్య ఓ అనైతిక సంబంధం. అనవసర పరీక్షలు, అడ్డగోలు శస్త్ర చికిత్సలు, అవస రానికి మించి ఆస్పత్రిలో ఉంచడాలు- ఇలా ఎన్ని దాష్టికాలు! హోటళ్ల తరహాలో 3 నక్షత్రాల, 5 నక్షత్రాల కార్పొరేట్ ఆస్పత్రులు వెలసి, వైద్యులకు రోజువారీ-నెలవారీ టార్గెట్లు పెట్టి కోట్లు గడిస్తున్నాయి.
 గుంటూరు, కరీంగనగర్‌లలో కాసుల కోసం ‘కడుపుకోత’లు, నల్లగొండ, ఖమ్మంలలో వ్యవస్థీకృతంగా కిడ్నీ రాకెట్లు, విజయవాడ, విశాఖ పట్నంలలో అద్దెగర్భాల నీడలో గుట్టుచప్పుడు కాకుండా పిండాల దొంగ విక్రయం, కర్నూలు, హైదరాబాద్‌లలో డబ్బు పిండటానికి మనిషి చచ్చిన తర్వాత కూడా చికిత్సలు.... ఇదీ వరస! ఇవి ఇటీవలి కాలంలో వెలుగు చూసిన కొన్ని ఉదాహరణలు మాత్రమే!

ఖమ్మం జిల్లా నాయుడు పేటకు చెందిన మువ్వా నరేష్‌కు తరచూ జ్వరం వస్తుంటే తల్లిదండ్రులు వైద్యం చేయించినపుడు ఓ దయనీయమైన విషయం తెలిసింది. బెంగళూరుకు చెందిన ఓ దళారీ నమ్మించి, ఆర్థికంగా ఎంతో మేలని 3 లక్షలిచ్చి కిడ్నీ తీసుకొని చేతులు దులుపుకున్నారు. కిడ్నీ దానం చేసినపుడు, జీవితాంతం మందులు వాడాలని, ఖర్చులుంటాయిన చెప్పకుండా నిజం దాచి మోసం చేశారు. అట్లా ఎన్నో కేసులు! ఖమ్మం, నల్లగొండల్లో వెలుగు చూసిన రెండు, మూడు కేసులతో మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక... ఇలా వివిధ రాష్ట్రాలతో పాటు శ్రీలంక వరకు విస్తరించిన ఈ భాగోతం బయటపడింది. పోషకాహార లోపాల వల్ల కడుపునొప్పి అని ఫిర్యాదు చేసిన కరీంనగర్ జిల్లా కథలాపూర్ పేదింటి ఆడపిల్లల ఘోష దయనీయం. వసతి గృహాల ఆడపిల్లల వైద్యానికి స్థానిక ఆర్‌ఎంపీల సిఫారసులు, జగిత్యాల ప్రయివేటు పెద్దాసుపత్రిలో అవసరం లేకపోయినా కేవలం డబ్బు కోసమే అపెండిసైటిస్ ఆపరేషన్లు, గర్భసంచి తొలగించే శస్త్ర చికిత్సలు చేసిన దుర్మార్గాలు ఇటీవలే వెలుగు చూశాయి.

వికృత చేష్టలకు ఎన్ని రూపాలో!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మద్యనిషేధం అమలవుతున్నపుడు ఓ చిత్రం జరిగేది. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉండే మందుప్రియులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి తాగేవారు. మెదక్ జిల్లా జహీరాబాద్‌కు చెందిన కొందరు మందు కోసమే సాయంకాలం పాతిక కిలోమీటర్ల దూరంలో ఉండే బీదర్ (కర్ణాటక)కు వెళ్లేది. వీరి సమయం, సౌలభ్యం కోసం జహీరాబాద్ వాళ్లే మాట్లాడుకొని బీదర్‌లో వైన్స్ నడిపేది. అక్కడి పనివాళ్లు, వైన్స్ నిర్వాహకులు, చిరుతిళ్లు అమ్మేటోళ్లు, మందు తాగేది... ఇలా అందరూ జహీరాబాద్ వాళ్లే! కాకపోతే భూభాగం మాత్రం మద్యనిషేధం అమల్లోలేని బీదర్. అచ్చం అలాగే, కిడ్నీ రాకెటు మనవాళ్ల వల్లే రాష్ట్ర సరిహద్దులు దాటి, దేశ సరిహద్దులు దాటి అంతర్జాతీయ రాకెట్‌గా అవతరించింది. మనస్పూర్తిగా అంగీకరించిన రక్త సంబంధీకుల నుంచి మాత్రమే కిడ్నీ దానాల్ని అనుమతిస్తామనే నిబంధన, అందుకోసం ఓ నిపుణుల కమిటీ ఇక్కడ అమల్లో ఉండటంతో వ్యవహార కేంద్రం నెమ్మదిగా శ్రీలంకకు మారింది. కిడ్నీ దాత, గ్రహీత, దళారి, అప్పుడప్పుడు వైద్యులు కూడా ఇక్కడి వారే! శస్త్ర చికిత్స జరిపే ఆస్పత్రి మాత్రమే శ్రీలంకది!  

డబ్బు గడించే కుయుక్తులతో కొందరు వైద్యులు, ఆస్పత్రుల వారు ఆరోగ్య బీమాను కూడ అభాసుపాలు చేస్తున్నారు. బీమా ఉందంటే చాలు,  అవరసమా-అనవసరమా అన్న విచక్షణ కూడా లేకుండా  శస్త్ర చికిత్సలు చేసి రోగుల శరీరాల్ని గుల్ల చేస్తున్నారు. పుణేకు చెందిన ‘సతి’ (ఎస్‌ఎటిహెచ్‌ఐ) అనే ఓ స్వచ్ఛంద సంస్థ జరిపిన అధ్యయనంలో కళ్లు చెదిరే వాస్తవాలు వెలుగు చూశాయి. కార్పొరేట్ ఆస్పత్రులకు చెందిన వైద్యులు 12500 మందికి శస్త్ర చికిత్సలు సిఫారసు చేయగా, 44 శాతం కేసుల్లో అసలా శస్త్ర చికిత్సలే అవసరం లేదని ఇతర వైద్యుల్ని సంప్రదించినపుడు రెండో అభిప్రాయంలో తేటతెల్లమైంది.

.......దశ-దిశ కావాలిప్పుడు
 తెలుగు రాష్ట్రాల్లో, ఆ మాటకొస్తే దేశంలోనే వైద్యరంగంలో జరుగుతున్న అరాచకాలపై నిఘా లేదు, సరైన నియంత్రణ లేదు. మొత్తం వైద్యరంగమే దశ-దిశ లేకుండా సాగుతోంది.  వైద్య ఖర్చులు తట్టుకోలేక ఏటా నాలుగు కోట్ల మంది భారతీయులు దారిద్య్రరేఖ దిగువకు జారిపోతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. ఒక రోగి, రోగం విషయంలో ఏ ఇద్దరు వైద్య నిపుణుల అభిప్రాయం ఒక్కలా ఉండదు. చాలా సందర్భాల్లో జవాబుదారితనమే లోపిస్తోంది. వైద్య ప్రక్రియకు ప్రమాణాలే ఉండవు. ఏయే జబ్బుల విషయంలో, ఏయే ఆస్పత్రుల విజయశాతమెంత? అన్న లెక్కలే లేక పోవడంతో వైద్యం కోసం వెళ్లే వారికి ఎంపిక అవకాశమే ఉండటం లేదు. భారత వైద్య మండలి (ఎమ్‌సీఐ) ఓ అలంకార ప్రాయమైన సంస్థ. అందువల్లే ఈ అరాచకం కొనసాగుతోందని విశ్లేషకులంటారు. తప్పు చేసినపుడు వైద్యుడ్ని, ఆస్పత్రిని గుర్తించి, చట్టబద్ధంగా శిక్షించే విధానాలే లేవు.

వైద్య విద్య ఖరీదవడం వల్ల కూడా వ్యాపార ధోరణి పెరిగి కొన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ఇప్పుడు తయారవుతున్న వైద్యుల సంఖ్యా పద్ధతి ఇలాగే సాగితే, ప్రస్తుత అవసరాలు తీర్చగలిగిన వైద్యుల సంఖ్య ఓ 500 సంవత్సరాల తర్వాత సమకూరుతుందట. మరి అప్పటి అవసరా లకు? ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి సారించాలి. వైద్యవిద్య ఖర్చు తగ్గిం చాలి.. కార్పొరేట్ల దోపిడీపై నిఘా పెంచాలి. నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ప్రజావైద్య వ్యవస్థను బలోపేతం చేయాలి. సంపన్నులు, అధిక సంతృప్తి కోసం అర్రులు చాచే వాళ్లు మాత్రమే కార్పొరేట్ వైద్యం వైపు వెళ్లే వాతావరణం కల్పించాలి. భవిష్యత్ సమాజ ఆరోగ్య రక్షణ పాలకుల తక్షణ కర్తవ్యం అయితే తప్ప పరిస్థితి మారదు.

 దిలీప్ రెడ్డి
 ఈమెయిల్:
 dileepreddy@sakshi.com      
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement