కొత్త ఆస్పత్రుల నిర్మాణం ఎంత ముఖ్యమో, నిర్వహణా అంతే ముఖ్యం. ఇన్ని వేల కోట్లు ఖర్చు చేసి.. వైద్యులు లేరు, సిబ్బంది లేరు అంటే బావుండదు. వైద్యులు ఎంత మంది అవసరమో అందర్నీ తీసుకోండి. భవనాలు, వైద్య పరికరాలు, ఆహారం, ఆస్పత్రిలో వాతావరణం వీటి నిర్వహణ కోసం ఉత్తమ పద్ధతులను పాటించండి. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాస్పత్రుల్లో కూడా మెరుగైన పారిశుధ్యం, ప్రమాణాలు ఉండాలి. ఉత్తమ వైద్యం, ఉత్తమ నిర్వహణ, ఉత్తమ ప్రమాణాలే ప్రామాణికంగా ఉండాలి. బోధన ఆస్పత్రుల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. పడకల మీద వేసే బెడ్‌షీట్ల దగ్గర నుంచి అన్ని విషయాల్లో అత్యుత్తమ నాణ్యత పాటించాలి.
- సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా నిర్మించే వైద్య కళాశాలలు, ఇప్పటికే ఉన్న బోధనాస్పత్రుల్లో కార్పొరేట్‌కు దీటుగా ప్రమాణాలు ఉండాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఒక్క వైద్య రంగంలోనే రూ.16,270 కోట్లతో నాడు–నేడు కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రభుత్వాస్పత్రి లోపలికి వెళ్లగానే మంచి కార్పొరేట్ ఆస్పత్రికి వచ్చామనిపించేలా చక్కటి వాతావరణం, బెడ్స్, పరికరాలు, ఇతర వసతులు ఉండాలన్నారు. నిర్మాణం ఒకెత్తు అయితే నిర్వహణ మరో ఎత్తు అని చెప్పారు. ఆస్పత్రుల్లో పరిపాలన, క్లినికల్ వ్యవహారాలు చూసేందుకు నైపుణ్యమున్న వారిని తీసుకోవాలని.. పరిపాలన, క్లినికల్ వ్యవహారాలు వేర్వేరుగా ఉండాలని సూచించారు.
ఈ మేరకు ప్రత్యేకంగా వేర్వేరుగా ఎస్‌వోపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) రూపొందించాలని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వైద్య, విద్య రంగాల్లో నాడు–నేడు పనులను ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, నిర్దేశించిన గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని చెప్పారు. నాడు–నేడు పనులకు ఎలాంటి నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. భూసేకరణ, ఇతరత్రా ఎలాంటి సమస్యలైనా వస్తే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. పేషెంటుకు ఇచ్చిన గది నుంచి పడక వరకు ఆస్పత్రి వాతావరణం బాగుండాలన్నారు. రోగులకు అందిస్తున్న భోజనం కూడా బావుండాలని, ఇందులో కచ్చితంగా మార్పు కనిపించాలని ఆదేశించారు. ఎక్కడా అపరిశుభ్రత అన్నది కనిపించకూడదని చెప్పారు. విలేజ్ క్లినిక్స్ నుంచి బోధనాస్పత్రుల వరకు ఇదే విధానాన్ని కొనసాగించాలని, ఇందుకోసం ప్రత్యేక మార్గదర్శకాలను తయారు చేయాలని సీఎం సూచించారు. ఏ ఆస్పత్రిలోనూ పరికరాలు పని చేయలేదనే మాట వినిపించకూడదని, ఆస్పత్రుల నిర్వహణ ఎలా ఉండాలో స్కూళ్లలోనూ అలాగే ఉండాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే..
సెప్టెంబర్‌లోగా హెల్త్ క్లినిక్స్ పూర్తి చేయండి
► రాష్ట్రంలో మొత్తం 10,011 వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ ఉన్నాయి. వీటిలో 1,426 క్లినిక్స్‌ను పునరుద్ధరిస్తున్నారు. వీటి పనులు సెప్టెంబర్‌లోగా పూర్తి చేయండి.
► వీటి నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూడాలి. ప్రత్యేక పర్యవేక్షణతో సకాలంలో పనులు పూర్తి చేయాలి. అర్బన్ ప్రాంతాల్లో నిర్మించే పీహెచ్‌సీలు కూడా త్వరగా పూర్తి చేసే దిశగా కార్యాచరణ రూపొందించండి.
► పాడేరు, పులివెందుల, పిడుగురాళ్ల, మచిలీపట్నం సహా కొత్త వైద్య కళాశాలలు, ఆస్పత్రులు, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి సంబంధించి భూముల సేకరణ, వాటి చెల్లింపులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి.
మే 15కు మెడికల్ కాలేజీల టెండర్లు పూర్తి
► కొత్తగా నిర్మించనున్న అన్ని మెడికల్ కాలేజీలకు మే 15 నాటికి టెండర్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ఉన్న మెడికల్ కాలేజీల్లో కూడా అభివృద్ధి పనులకు ఏప్రిల్ నెలాఖరు కల్లా టెండర్లు ఖరారవుతాయన్నారు.
► కొత్త పీహెచ్‌సీల నిర్మాణానికి స్థలాల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యిందని, అక్టోబర్ నాటికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, కొత్త వాటి నిర్మాణం పూర్తవుతుందని వివరించారు. ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ ఆస్పత్రుల్లో నాడు–నేడు పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు.
► రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రస్తుత పరిస్థితి, పాజిటివిటీపై సీఎంకు వివరించారు. 69 ఆస్పత్రుల్లో 9,625 బెడ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం వైరస్ విస్తరణ మునుపటి అంత ఉధృతి లేకపోయినా అప్రమత్తంగానే ఉన్నామని తెలిపారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment