ఎంఎన్‌సీ టేకోవర్లతో దేశీ ఫార్మా కుదేలు
బ్రౌన్‌ఫీల్డ్ ఫార్మాలో ఎఫ్‌డీఐలను నిషేధించాలి
పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సులు
న్యూఢిల్లీ: నగదు నిల్వలు పుష్కలంగా ఉన్న బహుళజాతి సంస్థలు (ఎంఎన్‌సీ) టేకోవర్లు చేస్తుండటంతో ప్రస్తుత విధానాలు ఇలాగే కొనసాగితే దేశీ ఫార్మా సంస్థలు కుదేలయ్యే ప్రమాదం ఉందని పార్లమెంటరీ స్థాయీ సంఘం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న ఫార్మా యూనిట్లలో (బ్రౌన్ ఫీల్డ్ యూనిట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై (ఎఫ్‌డీఐ) ప్రభుత్వం పూర్తిగా నిషేధం విధించాలని సూచించింది.
లేని పక్షంలో జనరిక్ ఔషధాలను చౌకగా అందించడంలో దేశీ ఫార్మా సంస్థల సామర్ధ్యం దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొంది. ఫార్మా ఎఫ్‌డీఐలపై గతంలో చేసిన సిఫార్సుల మీద ప్రభుత్వం తీసుకున్న చర్యలకు సంబంధించి వాణిజ్యానికి సంబంధించి స్థాయీ సంఘం సమర్పించిన నివేదికను సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. కేవలం ఎఫ్‌డీఐ గణాంకాలపైనే దృష్టి పెట్టిన పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ).. దేశీ ఫార్మా కంపెనీలను ఎంఎన్‌సీలు ఇష్టారీతిగా టేకోవర్ చే స్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని నివేదిక తూర్పారబట్టింది.
చౌక జనరిక్స్‌కి కేంద్రంగా భారత్‌ను కేంద్రంగా తీర్చిదిద్దిన దేశీ దిగ్గజాలు కనుమరుగైపోతే విదేశీ కంపెనీల చేతిలో పడి భారత ఫార్మా పరిశ్రమ లాభాపేక్షే ధ్యేయంగా ముందుకు సాగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో దేశీయంగా అందుబాటు ధరలో ఔషధాలు లభించడానికి ఎటువంటి ఆటంకాలు ఎదురవకుండా చూసేందుకు కేంద్ర ఆరోగ్య శాఖతో డీఐపీపీ కలిసి పనిచేయాలని సూచించింది.