
ఉపయోగంలోలేని, నకిలీ ధ్రువపత్రాలతో తీసుకున్న 6.8 లక్షల మొబైల్ కనెక్షన్లను ధ్రువీకరించాలని టెలికాం శాఖ ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మొబైల్ నంబర్లను 60 రోజుల్లోపు గుర్తించి వెంటనే రీ-వెరిఫికేషన్ చేయాలని తెలిపింది. లేదంటే వాటిని డిస్‌కనెక్ట్ చేస్తామని హెచ్చరించింది.
నకిలీ ఫోన్ నంబర్లు, ఉపయోగంలోలేని కనెక్షన్లను గుర్తించడానికి టెలికాంశాఖ అధునాతన ఏఐను వినియోగించినట్లు ప్రకటనలో చెప్పింది. ఏఐ విశ్లేషణలో భాగంగా ఉపయోగంలోలేనివి, నకిలీ ఐడీ ప్రూఫ్‌లతో ఉన్న దాదాపు 6.8 లక్షల మొబైల్ కనెక్షన్లు గుర్తించినట్లు తెలిపింది. వెంటనే నెట్‌వర్క్ ఆపరేటర్లు వాటిని ధ్రువీకరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియ 60 రోజుల్లోపు పూర్తి చేయాలని చెప్పింది.
ఇదీ చదవండి: అప్పు తీసుకుంటున్నారా..? ఒక్కక్షణం ఆలోచించండి
ఒకవేళ ఆపరేటర్లు ముందుగా విధించిన గడువులోపు మొబైల్ నంబర్లను ధ్రువీకరించకపోతే వాటిని డిస్‌కనెక్ట్ చేస్తామని హెచ్చరించింది. అవసరమైతే కొందరు ఆపరేటర్లు ఈ తంతును మళ్లీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 2024 ఏప్రిల్‌లో టెలికాంశాఖ 10,834 మొబైల్ నంబర్‌లపై అనుమానం వ్యక్తంచేస్తూ వీటిని రీవెరిఫికేషన్ చేయాలని తెలిపింది. వీటిలో 8,272 కనెక్షన్లు ధ్రువీకరణలో విఫలమవడంతో డిస్‌కనెక్ట్ చేసినట్లు పేర్కొంది.