సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అప్పుల పద్దు రూ.3 లక్షల కోట్లు దాటుతోంది. ప్రభుత్వం 2022–23 ఆర్థిక సంవత్సరంలో సమీకరించుకుంటామని ప్రతిపాదించిన రుణాలతో కలిపి మొత్తం అప్పులు రూ.3,29,988 కోట్లకు చేరనున్నాయి. 2021–22 ఏడాదికిగాను సవరించిన బడ్జెట్ అంచనాలు.. రాష్ట్ర అప్పులు రూ.2,85,120 కోట్లు. తాజా బడ్జెట్‌లో కొత్తగా రూ.59 వేల కోట్లకుపైగా రుణాలు తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది.
ఇందులో పాత రుణాలకు సంబంధించి చెల్లింపులు పోగా.. రూ.45 వేల కోట్లు అదనంగా జతకానున్నాయి. మొత్తం అప్పులు రూ.3.29 లక్షల కోట్లు దాటనున్నాయి. ఈ అప్పులను 2011 జనాభా లెక్కలతో పోల్చితే, తలసరి అప్పు రూ.94,272 కోట్లకు చేరుతోంది. ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల పేరిట పూచీకత్తులతో తీసుకున్న రుణాలను కూడా కలిపితే.. తలసరి అప్పు మరో రూ.30 వేల వరకు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఆర్థిక సంవత్సరానికి తలసరి అప్పు రూ.81,935 మాత్రమే కావడం గమనార్హం.
బహిరంగ మార్కెట్ నుంచే ఎక్కువ
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అప్పుల వివరాలను పరిశీలిస్తే.. బహిరంగ మార్కెట్ నుంచి సేకరించే రుణాలే 90 శాతం మేర ఉంటున్నాయి. 2021–22 నాటికి బహిరంగ మార్కెట్‌లో మొత్తం రూ.2,44,238 కోట్లు అప్పుగా తీసుకోగా.. ఈ ఏడాది మరో రూ.53,970 కోట్లను అదే తరహాలో సమీకరించాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు.
►కేంద్రం నుంచి ఇప్పటివరకు రూ.755.59 కోట్లు అప్పుగా తీసుకోగా.. వచ్చే ఆర్థిక సం వత్సరంలో మరో రూ.4,102 కోట్లు తీసుకుంటామన్నారు. 2021–22 సవరించిన బడ్జెట్ అంచనాలు.. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.6,377.77 కోట్ల సెక్యూరిటీలు వేలం వేసి అప్పులు సేకరించారు.
►పలు ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుంచి రూ.14,161.74 కోట్లు.. ప్రావిడెంట్ ఫండ్, ఇన్సూరెన్స్ ఫండ్‌ల ద్వారా రూ.12,785 కోట్ల రుణాలను ప్రభుత్వం సేకరించింది.
►ఈ రుణాలన్నీ ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారమే తీసుకుంటున్నామని.. ఇందులో రిస్క్ ఉన్న రుణాలు తక్కువేనని, చెల్లింపు సజావు గా జరుగుతోందని ప్రభుత్వం చెప్తోంది. ఈ రుణాల ద్వారా రాష్ట్ర సంపద కూడా పెరుగుతోందని పేర్కొంటోంది.
వడ్డీలకే రూ.18,911 కోట్లు
►రాష్ట్ర అప్పులకు వడ్డీల కింద ఈసారి రూ.18,911 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అయితే, వడ్డీల కింద ప్రస్తుతం రూ.17,584 కోట్లున్న అప్పు వచ్చే ఏడాది మరో రూ.1,300 కోట్లు పెరగనున్నాయి.
►రుణాల్లో చెల్లింపుల కోసం తాజా బడ్జెట్‌లో రూ.11,601 కోట్లు చూపారు. ఇందులో ప్రజారుణం కింద రూ.8,336 కోట్లు, కేం ద్రం నుంచి తీసుకునే రుణాలకు రూ.367.94 కోట్లు, ఇతర రుణాలకు రూ.2,897 కోట్లు తిరిగి చెల్లించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment