మోదీ విధానాల ఫలితమే దేశాభివృద్ధి | Wagon Manufacturing Facility In Kazipet: Ashwini Vaishnaw | Sakshi
Sakshi News home page

మోదీ విధానాల ఫలితమే దేశాభివృద్ధి

Published Sun, Feb 5 2023 4:10 AM | Last Updated on Sun, Feb 5 2023 7:47 AM

Wagon Manufacturing Facility In Kazipet: Ashwini Vaishnaw - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అగ్రరాజ్యాలు ఆర్థికంగా పలు సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ తన విధానాల ద్వారా దేశాన్ని వృద్ధి పథంలో ఉంచారని కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్పష్టం చేశారు. ఒకవైపు పేదలను ఆదుకుంటూనే... మౌలిక వస­తుల కల్పనలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టడం ద్వారా అమృత్‌కాల్‌ సమయంలో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ప్రధాని మోదీ పునాదులు వేశారని ఆయన శనివారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ చెప్పారు.

ఈ నెల ఒకటిన పార్లమెంటులో ప్రవేశపెట్టిన ‘కేంద్ర బడ్జెట్‌ 2023–24’ ప్రాముఖ్యతను వివరించేందుకు భారతీయ జనతాపార్టీ ఏర్పాటుచేసిన ఈ మేధావుల సదస్సులో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, మూడేళ్లుగా బడ్జెట్‌ల మూలధన వ్యయం పెరుగుతూ వచ్చిందని, రహదారులు, రైల్వేలైన్లు, రైల్వేలైన్ల విద్యుదీకరణ, ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుళ్లు వేయడం వంటి మౌలికరంగ పనుల కోసం ఈ నిధులను ఖర్చుపెట్టడం వల్ల వృద్ధి పెరిగిందని, అదే సమయంలో కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకునేందుకు 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేయ­డం వల్ల ద్రవ్యోల్బణం పెద్దగా పెరగలేదని వివరించారు.

2020–21లో మూలధన వ్యయం 3.5 లక్షల కోట్ల రూపాయలుంటే.. తరువాతి సంవత్సరంలో రూ.5.5 లక్షల కోట్లు, 2022–23లో రూ.7.5 లక్షల కోట్లు, తాజా బడ్జెట్‌లో ఏకంగా రూ.10 లక్షల కోట్లకు చేరుకుందని చెప్పారు. రైల్వే పనుల్లో తెలంగాణకు తగిన ప్రాధాన్యమిస్తున్నామని, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో ఆధునికీకరించేందుకు రూ.715 కోట్లు కేటాయించామని వివరించారు.  

త్వరలో వందే మెట్రో రైళ్లు...
నగరాల్లో రవాణా కోసం మెట్రో రైళ్లు ఉన్న విధంగానే తక్కువ దూరమున్న రెండు నగరాలను కలిపేందుకు త్వరలో ‘వందే మెట్రో’ రైళ్లను ప్రవేశపెట్టనున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. తెలంగాణలోని 39 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని, కాజీపేటలో వ్యాగన్‌ తయారీ కేంద్రం ఏర్పాటు కానుందని తెలిపారు. సుమారు రూ.521 కోట్లతో ఏర్పాటు కానున్న ఈ ఫ్యాక్టరీకి తెలంగాణ ప్రభుత్వం 150 ఎకరాలు అందించిందని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలని అన్నారు. కార్యక్రమంలో కొండా విశ్వేశ్వరరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ నేత ప్రేమేందర్‌ రెడ్డి, మాజీ ఐపీఎస్‌ అధికారి కృష్ణ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement