సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ ప్రశంసల జల్లు కురిపించారు. కేసీఆర్ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన, భారీ ఎత్తిపోతల పథకాల నిర్మాణం, కేసీఆర్ కిట్స్, రైతులకు పంట పెట్టుబడి సాయం పథకాలను గొప్ప కార్యక్రమాలుగా అభివర్ణించారు. ఈ పథకాలను దేశమంతా అధ్యయనం చేసి అమలు చేయాలని అభిప్రాయపడ్డారు. సోమవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో అరవింద్ సుబ్రమణ్యన్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా అధికారులు ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రజెంటేషన్‌ను తిలకించిన అనంతరం సుబ్రమణ్యన్ మాట్లాడుతూ భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం సుపరిపాలనకు గుండె వంటిదని వ్యాఖ్యానించారు. మొదటి విడతలోనే 93 శాతం భూములకు సంబంధించిన రికార్డులను క్లియర్ చేసి యాజమాన్య హక్కులపై స్పష్టత ఇవ్వడం అద్భుతమని కితాబిచ్చారు.
తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యయానికి వెనుకాడకుండా అమలు చేస్తున్న కేసీఆర్ కిట్స్ చాలా గొప్ప కార్యక్రమమని, తననెంతో ప్రభావితం చేసిందని అభినందించారు. రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే నిర్ణయం తీసుకోవడం చాలా గొప్పదని, ఏప్రిల్ 20న ప్రారంభమయ్యే తొలి విడత సాయం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని జాతీయ కార్యక్రమంగా నిర్వహించాలని, తాను కూడా అందులో పాల్గొంటానని వెల్లడించారు. తెలంగాణలో శాంతిభద్రతల పరిరక్షణకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఆయన అభినందించారు.
తెలంగాణకు మరింత తోడ్పాటు అందించాలి: కేసీఆర్
అంతకుముందు సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఆదాయవృద్ధిలో ముందంజలో ఉండి అప్పులు తీర్చగలిగే శక్తి ఉన్న తెలంగాణకు ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిని పెంచి మరింత తోడ్పాటు అందించాలని అరవింద్ సుబ్రమణ్యన్‌ను కోరారు. ప్రగతి పథంలో దూసుకుపోతున్న రాష్ట్రాలకు నిధులు తగ్గించకుండా ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వ విధానం ఉండాలన్నారు. ఈ దిశగా కేంద్రం ఆలోచించేలా చొరవ చూపాలని ఆయనకు సూచించారు. వెనుకబడిన రాష్ట్రాలకు ప్రోత్సాహం అందించడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, కానీ ముందడుగు వేసే రాష్ట్రాలను నిలువరించే చర్యలను కేంద్రం మానుకోవాలన్నారు.
రైతు సంక్షేమానికి ప్రాధాన్యం
తెలంగాణలో రాష్ట్రంలో రైతులే ఎక్కువ మంది ఉన్నారని, వారు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే గట్టి నమ్మకంతో తామున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. అందుకే రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, వ్యవసాయరంగాభివృద్ధి కోసం ఎక్కువ నిధులు కేటాయిస్తున్నామని సీఎం వివరించారు. తెలంగాణకు గోదావరి, కృష్ణా నదుల్లో ఉన్న వాటా కేవలం కాగితాలకే పరిమితమని, సమైక్య పాలనలో నీళ్లు తెలంగాణ పొలాలకు రాలేదని వివరించారు.
అందుకే తాము సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, కాళేశ్వరం, పాలమూరు, సీతారామ లాంటి భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నామన్నారు. 2020 నుంచి తెలంగాణ రాష్ట్రంలో రైతులు రెండు పంటలు పండించుకుంటారని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఆర్థిక సలహాదారు జీఆర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, రామకృష్ణారావు, శాంత కుమారి, ఎంపీ బాల్క సుమన్, విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వృద్ధిరేటులో నంబర్ వన్
దేశ తలసరి ఆదాయం రూ. 1.03 లక్షలుంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదా యం రూ. 1.55 లక్షలు ఉందని సీఎం కేసీఆర్ అరవింద్ సుబ్రమణ్యన్‌కు వివ రించారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలుకు ముందు తెలంగాణ ఆదాయ వృద్ధిరేటు 21 శాతం ఉండగా జీఎస్టీ అమలు తర్వాత కూడా 16.5 శాతం వృద్ధిరేటు సాధించి దేశంలోనే తొలిస్థానంలో నిలిచామని సీఎం చెప్పారు.
2013–14లో 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రూ. 1.36 లక్షల కోట్లయితే 2017–18 తెలంగాణ బడ్జెట్ రూ. 1.49 వేల కోట్లుగా ఉందన్నారు. ఇంత ముందడుగు వేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచాలని కోరారు. రాష్ట్రాలు పురోగమిస్తేనే దేశం పురోగమిస్తుందని, రాష్ట్రాల అభివృద్ధిని అడ్డుకుంటే దేశ ప్రగతి కూడా కుంటుపడుతుందని సీఎం పేర్కొన్నారు.
కేంద్రానికి సీఎం కేసీఆర్ డిమాండ్లు ఇవీ
♦ ఎప్పుడో నిర్ణయించిన కనీస మద్దతు ధరను సవరించాలి. గోధుమలు, ధాన్యానికి రూ. 2,200, మక్కలకు రూ. 2,000 మద్దతు ధర ప్రకటించాలి.
♦ వ్యవసాయ అనుబంధ రంగాలైన గొర్రెల పెంపకం, పాల ఉత్పత్తి, చేపలు, కోళ్ల పెంపకం చేపట్టే వారిని ఆదాయ పన్ను పరిధి నుంచి తొలగించాలి.
♦ కేంద్ర పథకాల నిధుల వినియోగంలో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వాలి.
♦ కాంపా నిధుల్ని ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు అందించాలి. గ్రీన్ కవర్ పెంచడానికి కృషిచేస్తున్న తెలంగాణ లాంటి రాష్ట్రాలకు ఎక్కువ నిధులివ్వాలి.
♦ పెద్ద నోట్ల రద్దు తర్వాత రాష్ట్రంలో నెలకొన్న కరెన్సీ కొరతను అధిగమిం చేందుకు ఎక్కువ కరెన్సీ విడుదల చేసేలా ఆర్‌బీఐని ఒప్పించాలి.
కేసీఆర్ కిట్ తెప్పించుకొని మరీ పరిశీలన...
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కేసీఆర్ కిట్స్ పథకం గురించి కేంద్ర ప్రభుత్వానికి వివరిస్తానని అరవింద్ సుబ్రమణ్యన్ తెలిపారు. ఇతర రాష్ట్రాలకు ఈ పథకం ఆదర్శమని కొనియాడారు. పేద గర్భిణులు కూలికి వెళ్లలేకపోవడం వల్ల జరిగే వేతన నష్టాన్ని కేసీఆర్ కిట్స్ పథకం ద్వారా ప్రభుత్వమే భరిస్తోందని ఆయనకు కేసీఆర్ వివరించారు. ఆడపిల్ల పుడితే రూ. 13 వేలు, మగ పిల్లాడు పుడితే రూ. 12 వేల నగదు అందించడంతోపాటు తల్లీబిడ్డలకు ఉపయోగపడే 16 వస్తువులతో కూడిన రూ. 3 వేల విలువైన కేసీఆర్ కిట్‌ను కూడా ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు.
దీంతో సుబ్రమణ్యన్ కేసీఆర్ కిట్‌ను అడిగి మరీ తెప్పించుకుని అందులోని ప్రతి వస్తువునూ పరిశీలించారు. తల్లీబిడ్డల ఆరోగ్యానికి ఇది ఉపయోగకరమైన పథకమని కొనియాడారు. తాను త్వరలో తెలంగాణ లో పర్యటిస్తానని అప్పుడు కేసీఆర్ కిట్స్, ఎత్తిపోతల పథకాలు, హరితహారం లాంటి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానని వెల్లడించారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా నిరుపేద ఆడపిల్లల పెళ్లిళ్లకు రూ. 75,116 చొప్పున ప్రభుత్వమే సాయం అందించడాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వమే ఆడపిల్లకు కట్నం ఇస్తున్నట్లా అని చమత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment