
స్వామికి ఝలక్ ఇచ్చిన జైట్లీ, బీజేపీ
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామికి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఝలక్ ఇచ్చారు. నిన్న మొన్నటి దాకా ఆర్బీఐ గవర్నర్ రఘురామ రాజన్ ను టార్గెట్ చేసిన స్వామి తాజాగా.. చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రమణియన్ పై దాడిని ఎక్కుపెట్టడంపై జైట్లీ బుధవారం స్పందించారు. ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ పై ప్రభుత్వానికి పూర్తి విశ్వాసం ఉందని తేల్చిపారేశారు. ఆయనపై తమకు పూర్తి నమ్మకముందని మీడియాకు చెప్పారు. అటు స్వామి వైఖరిని బీజేపీ కూడా తప్పుబట్టింది. ఆయనది వ్యక్తిగత అభిప్రాయమని ప్రకటించింది. సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయాలతో ఏకీభవించడంలేదని బీజేపీ స్పష్టం చేసింది.
కాగా అరవింద్ సుబ్రమణియన్ ను ఆ పదవి నుంచి తొలగించాలంటూ ట్వీట్ చేశారు స్వామి. అమెరికా ఫార్మా ప్రయోజనాలను కాపాడాలంటే భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరించాలని అమెరికా కాంగ్రెస్ కు 2013లో చెప్పింది ఎవరు.. అరవింద్ సుబ్రమణ్యం. ఎంఓఎఫ్.. (మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ )ఆయనను వెంటనే తొలగించాలంటూ స్వామి తన వరస ట్వీట్స్ లో పేర్కొన్నారు. జీఎస్టీ అంశంపై కఠినంగా వ్యవహరించాలని కాంగ్రెస్ పార్టీకి చెప్పింది కూడా అరవింద్ సుబ్రమణ్యమేనని గుర్తు చేసిన ఆయన తనదైన శైలిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రధాన ఆర్థిక సలహాదారును తొలగించాలని స్వామి ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే జైట్లీ స్పందించడం విశేషం.