న్యూఢిల్లీ: స్టాక్స్ ధరలు భారీ స్థాయిలో పెరిగిపోవడం ఆందోళనకరమని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మరింత అప్రమత్తత అవసరమని, తగినంత స్థాయిలో వృద్ధి దన్ను లేకపోతే... షేర్ల ధరలు భారీ పతనానికి గురికావచ్చని హెచ్చరించారు. 2016–17లో 7.1 శాతంగా ఉన్న వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.75 శాతానికి మందగించవచ్చన్న అంచనాలున్నట్లు అరవింద్ పేర్కొన్నారు.
భారత్, అమెరికా ఆర్థిక వ్యవస్థలు భిన్న విధానాలను అనుసరిస్తున్నప్పటికీ... ఈ మధ్య కాలంలో రెండు దేశాల స్టాక్ మార్కెట్స్‌కి సంబంధించి ధర– రాబడుల నిష్పత్తి దాదాపు ఒకే స్థాయికి చేరిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వేల్యుయేషన్స్‌ని నిలబెట్టుకోవాలంటే అందుకు తగ్గట్లుగా వృద్ధి సాధించడంతో పాటు అంచనాలకు అనుగుణంగా కంపెనీల ఆదాయాలు కూడా ఉండాలన్నారు. లేని పక్షంలో కరెక్షన్‌కి లోనయ్యే అవకాశాలను తోసిపుచ్చలేమని చెప్పారాయన. ప్రస్తుత పరిస్థితుల్లో పోర్ట్‌ఫోలియోను ఎప్పటికప్పుడు సవరించుకోవాల్సిన అవసరం ఉందని అరవింద్ పేర్కొన్నారు.
గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో మిగతా దేశాలతో పోలిస్తే భారత స్టాక్ మార్కెట్లు భారీగా ఎగిశా యి. 2015 డిసెంబర్ ఆఖరు నుంచి చూస్తే రూపాయి మారకంలో నిఫ్టీ 45%, సెన్సెక్స్ 46% పెరిగాయి. అమెరికాతో పోలిస్తే భారత్‌లో స్టాక్‌మార్కెట్ బూమ్ చాలా భిన్నమైనదని అరవింద్ పేర్కొన్నారు.
కంపెనీల లాభాలు మెరుగ్గా ఉంటాయన్న అంచనాలు, పోర్ట్‌ఫోలియోలో బంగారం... రియల్టీ కాకుండా ఈక్విటీలకు కేటాయింపులు భారీగా పెరగడం, వడ్డీ రేట్లు వంటి అంశాలు దేశీ స్టాక్ మార్కెట్ బూమ్‌కి కారణమని చెప్పారు. ఈ సందర్భంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు.
న్యాయ సంస్కరణలకు పెద్దపీట
ఆర్థికంగా స్త్రీ, పురుషుల్లో సమానత్వానికి చర్యలు, శాస్త్ర,సాంకేతిక అభివృద్ధిపై దృష్టి, న్యాయ సంస్కరణల ఆవశ్యకత వంటి అంశాలు ఆర్థిక సర్వేలో ఈ దఫా పేర్కొనదగిన ప్రత్యేక అంశాలన్నారు. న్యాయ వ్యవస్థలో సంస్కరణల జోలికి వెళ్లే సాహసం చేయవద్దని కుటుంబ సభ్యులు, స్నేహితులు సూచించినప్పటికీ, ఈ విషయంలో విప్లవాత్మక అంశాలు, సూచనలను సర్వేలో జోడించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment