అధిక రాబడులకు మూమెంటమ్‌ ఇన్వెస్టింగ్‌.. | Sakshi
Sakshi News home page

అధిక రాబడులకు మూమెంటమ్‌ ఇన్వెస్టింగ్‌..

Published Mon, May 6 2024 2:37 AM

Momentum Investing for High Returns: Chintan Haria

చింతన్‌ హరియా - ప్రిన్సిపల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటెజీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ

అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా భారత ఎకానమీ పటిష్టంగా ముందుకు సాగుతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు సుమారు 7.6 శాతంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 7 శాతంగా ఉంటుందనే సానుకూల అంచనాలు నెలకొన్నాయి. వృద్ధి గతి (మూమెంటమ్‌) భారత్‌కు సానుకూలంగా ఉందనడానికి ఇవి నిదర్శనాలు. దీన్ని భారతీయ స్టాక్‌ మార్కెట్లకు కూడా అన్వయించుకోవచ్చు. గత కొన్నాళ్లుగా పలు స్టాక్స్‌ ధరలు పెరుగుతూనే ఉండగా, మరికొన్ని అదే గతిని ఇకపైనా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో మూమెంటమ్‌ను కీలక ఫిల్టరుగా ఉపయోగించి స్టాక్స్‌ను ఎంచుకోవడం ప్రయోజనకరంగా ఉండగలదు. మూమెంటమ్‌ ఇన్వెస్టింగ్‌ సూత్రం ప్రకారం లాభాల బాటలో ఉన్న కొన్ని స్టాక్స్‌ సమీప భవిష్యత్తులోనూ అదే గతిని కొనసాగించే అవకాశాలు ఉంటాయి. సమయానుగుణంగా ఇలాంటి స్టాక్స్‌ సమూహం మారవచ్చు గానీ సరైన మూమెంటమ్‌ స్టాక్స్‌లో కనుక ఇన్వెస్ట్‌ చేస్తే పోర్ట్‌ఫోలియో మొత్తానికి లబ్ధిని చేకూర్చగలవు. ఇలాంటి వాటిలో సులభంగా ఇన్వెస్ట్‌ చేసేందుకు ఉపయోగపడే పలు మార్గాల్లో నిఫ్టీ 200 మూమెంటమ్‌ 30 ఇండెక్స్‌ కూడా ఒకటి. ఈ సూచీ ప్రాతిపదికన ఈటీఎఫ్‌లు, ఇండెక్స్‌ ఫండ్స్‌ .. ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉన్నాయి.  

పెరిగే ధరతో ప్రయోజనం
పెరగడమైనా, తగ్గడమైనా ధరల్లో కదలికలు ఒకసారి మొదలైతే కొన్నాళ్ల పాటు స్థిరంగా అవే ధోరణులు కొనసాగుతాయనే ప్రాతిపదికన మూమెంటమ్‌ విధానం ఉంటుంది. మూమెంటమ్‌ ధోరణిని నిర్ణయించేందుకు 6 నెలలు, 12 నెలల ధరల కదలికలను పరిగణనలోకి తీసుకుంటారు. మూమెంటమ్‌ ఇన్వెస్టింగ్‌ విధానంలో ధర పెరుగుతున్న స్టాక్స్‌లో స్వల్పకాలిక పొజిషన్లు తీసుకుని, ట్రెండ్‌ బలహీనపడుతున్నప్పుడు వాటి నుంచి నిష్క్రమించడం ద్వారా మార్కెట్లో హెచ్చుతగ్గుల నుంచి ప్రయోజనం పొందే ప్రయత్నం జరుగుతుంది.

ఆ తర్వాత పరుగు అందుకుంటున్న వేరే స్టాక్స్‌పై దృష్టి పెడతారు. నిఫ్టీ 200 మూమెంటమ్‌ 30 సూచీలో నిఫ్టీ 200 స్టాక్స్‌ నుంచి ఎంపిక చేసిన 30 షేర్లు ఉంటాయి. కనీసం సంవత్సర కాలం పాటు లిస్టింగ్‌ చరిత్ర ఉండి, ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ సెగ్మెంట్లలో ట్రేడింగ్‌కి అందుబాటులో ఉన్న స్టాక్స్‌కు ఇందులో చోటు లభించే అవకాశం ఉంటుంది. మూమెంటమ్‌ స్కోరు ప్రాతిపదికన స్టాక్స్‌ను ఎంపిక చేస్తారు. 2024 మార్చి 31 నాటి డేటా ప్రకారం ప్రస్తుతం ఈ సూచీలోని టాప్‌ 5 రంగాల్లో ఆటో–ఆటో విడిభాగాల రంగానికి అత్యధికంగా 22.9%, హెల్త్‌కేర్‌కి 18 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌కి 15.5 శాతం, ఆర్థిక సేవలకు 12.2 శాతం, కన్జూమర్‌ సర్వీసెస్‌ షేర్లకు 5.8 శాతం వాటా ఉంది. సూచీలోని స్టాక్స్‌ను ఏటా జూన్, డిసెంబర్‌లో సమీక్షిస్తారు.

సాధారణ బెంచ్‌మార్క్‌కు మించి రాబడులు
ధరలు పెరిగే అవకాశమున్న వాటినే ఎంపిక చేయడం వల్ల ఈ సూచీలోని స్టాక్స్‌ ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి సాధారణ బెంచ్‌మార్క్‌ సూచీతో పోలిస్తే అధిక రాబడులు పొందేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఉదాహరణకు 2020 ఆఖర్లో అత్యంత మెరుగ్గా రాణిస్తున్న ఐటీ, హెల్త్‌కేర్‌ స్టాక్స్‌కు అధిక వెయిటేజీ లభించింది. ఇక 2022 చివర్లో ఆర్థిక సేవల రంగం రాణిస్తుండటంతో దానికి ప్రాధాన్యం పెరిగింది. 

స్వల్ప, మధ్య, దీర్ఘకాలికంగా చూసినప్పుడు నిఫ్టీ 200 సూచీతో పోలిస్తే నిఫ్టీ 200 మూమెంటమ్‌ 30 ఇండెక్స్‌ చాలా మెరుగ్గా రాణించింది. ఈ పట్టికను బట్టి చూస్తే మూడు నుంచి అయిదేళ్ల వ్యవధిలో మూమెంటమ్‌ ఇండెక్స్‌.. నిఫ్టీ 200 కన్నా 7–10 పర్సంటేజీ పాయింట్ల మేర అధిక రాబడులే అందించిన సంగతి స్పష్టమవుతోంది. నిఫ్టీ 200 మూమెంటమ్‌ 30 ఇండెక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేందుకు ఇన్వెస్టర్లు ఈటీఎఫ్‌ మార్గాన్ని ఎంచుకోవచ్చు. డీమ్యాట్‌ అకౌంటు లేని వారు ఇండెక్స్‌ ఫండ్‌ మార్గం ద్వారా ఇన్వెస్ట్‌ చేయొచ్చు.

                                                               1 ఏడాది       3 ఏళ్లు    5 ఏళ్లు 
నిఫ్టీ 200 మూమెంటమ్‌    30 టీఆర్‌ఐ    70.0%         28.6%     23.6% 
నిఫ్టీ 200 టీఆర్‌ఐ                                   38.3%         18.4%   16.5%  

Advertisement
 

తప్పక చదవండి

Advertisement