Stocks Prices
-
కాసుల వర్షం కురిపించిన ఈ ఐదు షేర్లు..
-
అధిక రాబడులకు మూమెంటమ్ ఇన్వెస్టింగ్..
అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా భారత ఎకానమీ పటిష్టంగా ముందుకు సాగుతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు సుమారు 7.6 శాతంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 7 శాతంగా ఉంటుందనే సానుకూల అంచనాలు నెలకొన్నాయి. వృద్ధి గతి (మూమెంటమ్) భారత్‌కు సానుకూలంగా ఉందనడానికి ఇవి నిదర్శనాలు. దీన్ని భారతీయ స్టాక్ మార్కెట్లకు కూడా అన్వయించుకోవచ్చు. గత కొన్నాళ్లుగా పలు స్టాక్స్ ధరలు పెరుగుతూనే ఉండగా, మరికొన్ని అదే గతిని ఇకపైనా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో మూమెంటమ్‌ను కీలక ఫిల్టరుగా ఉపయోగించి స్టాక్స్‌ను ఎంచుకోవడం ప్రయోజనకరంగా ఉండగలదు. మూమెంటమ్ ఇన్వెస్టింగ్ సూత్రం ప్రకారం లాభాల బాటలో ఉన్న కొన్ని స్టాక్స్ సమీప భవిష్యత్తులోనూ అదే గతిని కొనసాగించే అవకాశాలు ఉంటాయి. సమయానుగుణంగా ఇలాంటి స్టాక్స్ సమూహం మారవచ్చు గానీ సరైన మూమెంటమ్ స్టాక్స్‌లో కనుక ఇన్వెస్ట్ చేస్తే పోర్ట్‌ఫోలియో మొత్తానికి లబ్ధిని చేకూర్చగలవు. ఇలాంటి వాటిలో సులభంగా ఇన్వెస్ట్ చేసేందుకు ఉపయోగపడే పలు మార్గాల్లో నిఫ్టీ 200 మూమెంటమ్ 30 ఇండెక్స్ కూడా ఒకటి. ఈ సూచీ ప్రాతిపదికన ఈటీఎఫ్‌లు, ఇండెక్స్ ఫండ్స్ .. ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉన్నాయి. పెరిగే ధరతో ప్రయోజనంపెరగడమైనా, తగ్గడమైనా ధరల్లో కదలికలు ఒకసారి మొదలైతే కొన్నాళ్ల పాటు స్థిరంగా అవే ధోరణులు కొనసాగుతాయనే ప్రాతిపదికన మూమెంటమ్ విధానం ఉంటుంది. మూమెంటమ్ ధోరణిని నిర్ణయించేందుకు 6 నెలలు, 12 నెలల ధరల కదలికలను పరిగణనలోకి తీసుకుంటారు. మూమెంటమ్ ఇన్వెస్టింగ్ విధానంలో ధర పెరుగుతున్న స్టాక్స్‌లో స్వల్పకాలిక పొజిషన్లు తీసుకుని, ట్రెండ్ బలహీనపడుతున్నప్పుడు వాటి నుంచి నిష్క్రమించడం ద్వారా మార్కెట్లో హెచ్చుతగ్గుల నుంచి ప్రయోజనం పొందే ప్రయత్నం జరుగుతుంది.ఆ తర్వాత పరుగు అందుకుంటున్న వేరే స్టాక్స్‌పై దృష్టి పెడతారు. నిఫ్టీ 200 మూమెంటమ్ 30 సూచీలో నిఫ్టీ 200 స్టాక్స్ నుంచి ఎంపిక చేసిన 30 షేర్లు ఉంటాయి. కనీసం సంవత్సర కాలం పాటు లిస్టింగ్ చరిత్ర ఉండి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్లలో ట్రేడింగ్‌కి అందుబాటులో ఉన్న స్టాక్స్‌కు ఇందులో చోటు లభించే అవకాశం ఉంటుంది. మూమెంటమ్ స్కోరు ప్రాతిపదికన స్టాక్స్‌ను ఎంపిక చేస్తారు. 2024 మార్చి 31 నాటి డేటా ప్రకారం ప్రస్తుతం ఈ సూచీలోని టాప్ 5 రంగాల్లో ఆటో–ఆటో విడిభాగాల రంగానికి అత్యధికంగా 22.9%, హెల్త్‌కేర్‌కి 18 శాతం, క్యాపిటల్ గూడ్స్‌కి 15.5 శాతం, ఆర్థిక సేవలకు 12.2 శాతం, కన్జూమర్ సర్వీసెస్ షేర్లకు 5.8 శాతం వాటా ఉంది. సూచీలోని స్టాక్స్‌ను ఏటా జూన్, డిసెంబర్లో సమీక్షిస్తారు.సాధారణ బెంచ్‌మార్క్‌కు మించి రాబడులుధరలు పెరిగే అవకాశమున్న వాటినే ఎంపిక చేయడం వల్ల ఈ సూచీలోని స్టాక్స్ ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి సాధారణ బెంచ్‌మార్క్ సూచీతో పోలిస్తే అధిక రాబడులు పొందేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఉదాహరణకు 2020 ఆఖర్లో అత్యంత మెరుగ్గా రాణిస్తున్న ఐటీ, హెల్త్‌కేర్ స్టాక్స్‌కు అధిక వెయిటేజీ లభించింది. ఇక 2022 చివర్లో ఆర్థిక సేవల రంగం రాణిస్తుండటంతో దానికి ప్రాధాన్యం పెరిగింది. స్వల్ప, మధ్య, దీర్ఘకాలికంగా చూసినప్పుడు నిఫ్టీ 200 సూచీతో పోలిస్తే నిఫ్టీ 200 మూమెంటమ్ 30 ఇండెక్స్ చాలా మెరుగ్గా రాణించింది. ఈ పట్టికను బట్టి చూస్తే మూడు నుంచి అయిదేళ్ల వ్యవధిలో మూమెంటమ్ ఇండెక్స్.. నిఫ్టీ 200 కన్నా 7–10 పర్సంటేజీ పాయింట్ల మేర అధిక రాబడులే అందించిన సంగతి స్పష్టమవుతోంది. నిఫ్టీ 200 మూమెంటమ్ 30 ఇండెక్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు ఇన్వెస్టర్లు ఈటీఎఫ్ మార్గాన్ని ఎంచుకోవచ్చు. డీమ్యాట్ అకౌంటు లేని వారు ఇండెక్స్ ఫండ్ మార్గం ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. 1 ఏడాది 3 ఏళ్లు 5 ఏళ్లు నిఫ్టీ 200 మూమెంటమ్ 30 టీఆర్ఐ 70.0% 28.6% 23.6% నిఫ్టీ 200 టీఆర్ఐ 38.3% 18.4% 16.5% -
ఆందోళనకర స్థాయిలో షేర్ల ధరలు
న్యూఢిల్లీ: స్టాక్స్ ధరలు భారీ స్థాయిలో పెరిగిపోవడం ఆందోళనకరమని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మరింత అప్రమత్తత అవసరమని, తగినంత స్థాయిలో వృద్ధి దన్ను లేకపోతే... షేర్ల ధరలు భారీ పతనానికి గురికావచ్చని హెచ్చరించారు. 2016–17లో 7.1 శాతంగా ఉన్న వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.75 శాతానికి మందగించవచ్చన్న అంచనాలున్నట్లు అరవింద్ పేర్కొన్నారు. భారత్, అమెరికా ఆర్థిక వ్యవస్థలు భిన్న విధానాలను అనుసరిస్తున్నప్పటికీ... ఈ మధ్య కాలంలో రెండు దేశాల స్టాక్ మార్కెట్స్‌కి సంబంధించి ధర– రాబడుల నిష్పత్తి దాదాపు ఒకే స్థాయికి చేరిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వేల్యుయేషన్స్ని నిలబెట్టుకోవాలంటే అందుకు తగ్గట్లుగా వృద్ధి సాధించడంతో పాటు అంచనాలకు అనుగుణంగా కంపెనీల ఆదాయాలు కూడా ఉండాలన్నారు. లేని పక్షంలో కరెక్షన్‌కి లోనయ్యే అవకాశాలను తోసిపుచ్చలేమని చెప్పారాయన. ప్రస్తుత పరిస్థితుల్లో పోర్ట్‌ఫోలియోను ఎప్పటికప్పుడు సవరించుకోవాల్సిన అవసరం ఉందని అరవింద్ పేర్కొన్నారు. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో మిగతా దేశాలతో పోలిస్తే భారత స్టాక్ మార్కెట్లు భారీగా ఎగిశా యి. 2015 డిసెంబర్ ఆఖరు నుంచి చూస్తే రూపాయి మారకంలో నిఫ్టీ 45%, సెన్సెక్స్ 46% పెరిగాయి. అమెరికాతో పోలిస్తే భారత్‌లో స్టాక్‌మార్కెట్ బూమ్ చాలా భిన్నమైనదని అరవింద్ పేర్కొన్నారు. కంపెనీల లాభాలు మెరుగ్గా ఉంటాయన్న అంచనాలు, పోర్ట్‌ఫోలియోలో బంగారం... రియల్టీ కాకుండా ఈక్విటీలకు కేటాయింపులు భారీగా పెరగడం, వడ్డీ రేట్లు వంటి అంశాలు దేశీ స్టాక్ మార్కెట్ బూమ్కి కారణమని చెప్పారు. ఈ సందర్భంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. న్యాయ సంస్కరణలకు పెద్దపీట ఆర్థికంగా స్త్రీ, పురుషుల్లో సమానత్వానికి చర్యలు, శాస్త్ర,సాంకేతిక అభివృద్ధిపై దృష్టి, న్యాయ సంస్కరణల ఆవశ్యకత వంటి అంశాలు ఆర్థిక సర్వేలో ఈ దఫా పేర్కొనదగిన ప్రత్యేక అంశాలన్నారు. న్యాయ వ్యవస్థలో సంస్కరణల జోలికి వెళ్లే సాహసం చేయవద్దని కుటుంబ సభ్యులు, స్నేహితులు సూచించినప్పటికీ, ఈ విషయంలో విప్లవాత్మక అంశాలు, సూచనలను సర్వేలో జోడించినట్లు తెలిపారు. -
మార్కెట్ అస్థిరతే పెట్టుబడికి అనువు..
మార్కెట్లు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో తెలియవు. అందుకే అవి ఎప్పుడూ ఒకేలా ఉండవు. అవి బాగున్నా.. బాగోలేకున్నా.. మన ఇన్వెస్ట్మెంట్లను మాత్రం కొనసాగిస్తూనే ఉండాలి. ఈక్విటీ మార్కెట్లు ఈ ఏడాది ఇప్పటి వరకు ఏమంత ఆశాజనకంగా లేవు. మార్కెట్లు బాగోలేనప్పుడే అందులో పెట్టుబడుల్ని చేయాలి. అప్పుడే అసలు ధర వద్ద స్టాక్స్ లభిస్తాయి. ఎప్పుడూ షేర్ల విలువ ఆధారంగా పెట్టుబడి కేటాయింపులు జరగాలి. ఏడాది ప్రారంభంలో పోర్ట్‌ఫోలియోను ఒకసారి సరిచూసుకొని ఇన్వెస్ట్మెంట్లను రెగ్యులర్‌గా కొనసాగించటానికి ప్రయత్నించాలి. మంచి పోర్ట్‌ఫోలియో నిర్మాణం ఒక కళ. అంచనాలకు అనుగుణంగా గతేడాది.. గతేడాది మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే ఉంది. దేశ ఆర్థిక వృద్ధి మాత్రం మందగించింది. ఆర్బీఐ భావించినట్లుగానే వడ్డీరేట్లను 125 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ చర్య డెట్ (బాండ్ల) పోర్ట్‌ఫోలియోలకు బాగా అనుకూలించింది. మార్కెట్లు కూడా పర్వాలేదనిపించాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ విభాగాలు మంచి పనితీరు కనబరచాయి. ఈ ఏడాది సంగతేంటి? ప్రస్తుత ఏడాదిలో చైనా ఆర్థిక మందగమనం, ముడి చమురు ధరల పతనం వంటి అంశాలు అంతర్జాతీయంగా ప్రభావాన్ని చూపనున్నాయి. ఏదేమైనప్పటికీ అంతర్జాతీయంగా భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ఇన్వెస్టర్లు ప్రస్తుత ఈక్విటీ మార్కెట్ల పనితీరు (అస్థిర త)ను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వడ్డీ రేట్లు అనువుగా ఉండటం, ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలో ఉండటం వంటి అంశాలు ఇన్వెస్టర్లకు ఉపయుక్తమైనవి. ఇక ఆర్బీఐ ఈ ఏడాది వడ్డీ రేట్లను మరో 50 బేసిస్ పాయింట్లు తగ్గేంచే అవకాశం ఉంది. ఈక్విటీ ధరలు తగ్గుతున్నాయ్.. ఈక్విటీ షేరుధరలు తగ్గుతున్నాయి. ముఖ్యంగా లార్జ్ క్యాప్ విభాగంలో ఈ పరిస్థితి అధికంగా కనిపిస్తోంది. ఈ ఏడాది డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్స్‌కు అధిక ప్రాధాన్యమివ్వండి. అలాగే ఈక్విటీ ఫండ్స్‌తో పోలిస్తే మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకొని నిలబడే హైబ్రిడ్ ఫండ్స్ ఉత్తమం. ప్రస్తుతం మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ విభాగాలు వాటి షేరువారీ ఆర్జన (ఈపీఎస్)తో పోలిస్తే 20 రెట్లు ధరకు (పీఈ) ట్రేడ్ అవుతున్నాయి. అదే సమయంలో లార్జ్ క్యాప్ స్టాక్స్ మాత్రం 16 రెట్లకు ట్రేడ్ అవుతున్నాయి. అందువల్ల లార్జ్ క్యాప్ షేర్లు మంచి విలువకు లభిస్తున్నట్లు లెక్క. రంగాల వారీగా చూస్తే.. ఆటో, ఫైనాన్షియల్, ఐటీ రంగాలు ఆశాజనకంగా లేవు. ఫార్మా రంగ కంపెనీలు పర్వాలేదు. వాటి షేరు ధరలు ఒక స్థాయిలోనే ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ విభాగంలో మాత్రం అధిక విలువ ఉంది. స్టాక్స్ ధరలు అనుకూలం మార్కెట్ల పనితీరు దేశంలో వినియోగంపై ఆధారపడి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్లు పెరిగితేనే మార్కెట్లు మంచి పని తీరును కనబరుస్తాయి. దీనికి సమయం పడుతుంది. కొందరు ఇన్వెస్టర్లు మార్కెట్లు మరింత పడే వరకు వేచి ఉంటారు. మార్కెట్లు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో తెలియదు. ప్రస్తుత ధరలు పెట్టుబడులకు అనువుగా ఉన్నాయి. సిప్ ఇన్వెస్ట్మెంట్లను పెంచుకునేటప్పుడు హైబ్రిడ్ ఫండ్స్‌కు తగిన ప్రాధాన్యమివ్వండి. అసలు ధరలకు స్టాక్స్ అం దుబాటులో ఉన్నప్పుడు వాటితో పోర్ట్‌ఫోలియోను మెరుగుపరచుకోవాలి. అసెట్స్ పెరిగే కొద్ది వాటి ప్రభావం దీర్ఘకాలంలో ఎక్కువగా ఉంటుంది. అసెట్స్‌ను పెంచుకోవడానికి ఈ ఏడాది అనుకూలం. - నిమేశ్ షా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ మేనేజింగ్ డెరైక్టర్, సీఈవో -
తనఖా బాటలో ప్రమోటర్ల వాటాలు..
* 46 శాతం పైగా షేర్లు తనఖాలోనే * వీటి విలువ రూ. 2 లక్షల కోట్ల పైమాటే.. ముంబై: ఓవైపు స్టాక్స్ ధరలు అంతకంతకూ పతనమవుతుండగా.. మరోవైపు కంపెనీల ప్రమోటర్ల షేర్ల తనఖా మరింతగా పెరుగుతోంది. దాదాపు 517 కంపెనీల ప్రమోటర్ల వాటాల్లో సుమారు 46.35 శాతం షేర్లు తనఖాలోనే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎనిమిదేళ్ల క్రితం అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పటి తర్వాత ఇది అత్యధిక స్థాయి కావడం గమనార్హం. ప్రైమ్ డేటాబేస్ గణాంకాల ప్రకారం గతేడాది ఆఖరు త్రైమాసికంలో ప్రమోటర్ల వాటాల తనఖా 14 శాతం పెరిగింది. ఇలా కుదవ పెట్టిన షేర్ల విలువ సెప్టెంబర్ త్రైమాసికం ఆఖరులో రూ. 1.78 లక్షల కోట్లుగా ఉండగా.. డిసెంబర్ త్రైమాసికంలో ఏకంగా రూ. 2.03 లక్షల కోట్లకు చేరింది. కుదవ పెట్టేందుకు మరిన్ని షేర్లు లేక.. అలాగని తీసుకున్న రుణాన్ని చెల్లించేసేంతగా నిధులూ లేక ప్రమోటర్లు చేతులెత్తేస్తే తలెత్తే పరిణామాలు తీవ్రంగానే ఉంటాయని పరి శీలకులు చెబుతున్నారు. షేరు భారీగా పతనం కావడంతో పాటు కంపెనీ యాజమాన్యమే మారిపోయే అవకాశాలు ఉండటంతో తాజా పరిస్థితి ఆయా సంస్థల ఇన్వెస్టర్లను కలవరపరుస్తోంది. వంద శాతమూ ఉన్నాయి.. సుమారు పాతిక కంపెనీల ప్రమోటర్లు నూటికి నూరు శాతం వాటాలను తనఖా పెట్టేశారు. బజాజ్ హిందుస్తాన్ షుగర్, గోకల్దాస్ ఎక్స్‌పోర్ట్స్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్, ఎస్ఈఎల్ మాన్యుఫాక్చరింగ్, సుబెక్స్, స్పెంటెక్స్ ఇండస్ట్రీస్, పిపావవ్ డిఫెన్స్ అండ్ ఆఫ్‌షోర్ ఇంజనీరింగ్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. ఇక దాదాపు 80 కంపెనీల్లో ప్రమోటర్లు తమ వాటాల్లో 90 శాతాన్ని, సుమారు 200 పైగా సంస్థల ప్రమోటర్లు 50 శాతం వాటాలను తనఖాలో ఉంచారు. తనఖాలో ఉంచిన షేర్ల విలువపరంగా చూస్తే అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, కెయిర్న్ ఇండియా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎస్సార్ ఆయిల్ సంస్థలు టాప్‌లో ఉన్నాయి. ఇవి తనఖా ఉంచిన షేర్ల విలువ రూ. 40,000 కోట్ల పైమాటే. డిసెంబర్ త్రైమాసికంలో 82 సంస్థల ప్రమోటర్ల షేర్ల తనఖా గణనీయంగా పెరిగింది. అయితే, తనఖాలో ఉన్న షేర్లను విడిపించుకుంటున్న ప్రమోటర్లూ ఉన్నారు. మంగళం సిమెంటు, ఆశాపురా మైన్‌కెమ్, సెంచరీ ఎంకా మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. తనఖా ఎందుకు.. కార్యకలాపాల విస్తరణకు, కంపెనీ ఎదుగుదలకు, ఇతర ప్రాజెక్టులకు నిధులు సమీకరించుకునేందుకు, కంపెనీ నిర్వహణా నిధుల కోసం, వ్యక్తిగత అవసరాల కోసం ప్రమోటర్లు షేర్లను తనఖా పెట్టడం సర్వసాధారణమే. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీలు) షేర్ల విలువలో దాదాపు 50 శాతం దాకా రుణాలు ఇస్తుంటాయి. దీంతో ఎక్కువగా ప్రమోటర్లు వాటివైపు మొగ్గుచూపుతుంటారు. అలాగే మిగతా మార్గాలతో పోలిస్తే తనఖా ద్వారా రుణాలు కాస్త చౌకగా లభించే అవకాశాలుండటం కూడా ప్రమోటర్లు ఇటువైపు మళ్లడానికి కారణం. పరిణామాలేంటి.. ప్రమోటర్ల వాటాలు భారీ స్థాయిలో తనఖాలో ఉండటం ఇన్వెస్టర్లకు అంత శ్రేయస్కరం కాదని మార్కెట్ పరిశీలకుల విశ్లేషణ. ప్రమోటర్లు తమ వాటాల్లో 50 శాతం పైగా షేర్లను తనఖా పెట్టినప్పుడో.. లేదా కంపెనీ మొత్తం ఈక్విటీ క్యాపిటల్‌లో 20 శాతం పైగా షేర్లు తనఖాలో ఉన్నప్పుడో సమస్య తలెత్తుతుంది. షేరు ధర నిర్దిష్ట స్థాయికి మించి పతనమైతే ప్రమోటర్లు.. మార్జిన్‌ను కొనసాగించేందుకు మరిన్ని షేర్లు తనఖా పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ అందుకు తగినన్ని షేర్లు ప్రమోటర్లు పెట్టలేకపోయినా, తీసుకున్న అప్పును తిరిగి చెల్లించేంతగా నిధులు వారి వద్ద లేకపోయినా.. రుణమిచ్చిన సంస్థలు తక్షణం చర్యలకు ఉపక్రమిస్తాయి. తనఖా పెట్టిన షేర్లను అమ్మేసుకుని డబ్బు రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తాయి. దీంతో స్టాక్ ధర మరింతగా పతనమవుతుంది. ఫలితంగా ఇన్వెస్టర్లకు మరిన్ని నష్టాలూ రావొచ్చు. ప్రమోటర్లు తీసుకున్న రుణాలను చెల్లించలేకపోయినప్పుడు రుణదాతలు ఇలా తమ దగ్గరున్న షేర్లను అమ్మేసిన ఉదంతాలు అనేకం ఉన్నాయి.