7.5 శాతం వృద్ధి అసాధ్యం | 6.5% to 7.5% growth rate is not good news but I am not worried | Sakshi
Sakshi News home page

7.5 శాతం వృద్ధి అసాధ్యం

Published Sat, Aug 12 2017 1:20 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM

7.5 శాతం వృద్ధి అసాధ్యం - Sakshi

7.5 శాతం వృద్ధి అసాధ్యం

ఈ ఆర్థిక సంవత్సరంపై ప్రభుత్వం అంచనా
ఎన్నో సవాళ్లున్నాయంటూ నిట్టూర్పు
రైతుల రుణ మాఫీతో 0.75 శాతం క్షీణత
పార్లమెంటులో ఆర్థిక సర్వే రెండో ఎడిషన్‌
0.75 శాతం వరకు రేట్లు తగ్గాలని అభిప్రాయం 

ఆర్థిక సర్వే ప్రధానాంశాలు

2017–18లో జీడీపీలో ద్రవ్యలోటు 3.2 శాతానికి దిగొస్తుంది. 2016–17లో 3.5%.
రిటైల్‌ ద్రవ్యోల్బణం మార్చి వరకు 4 శాతంలోపే ఉండొచ్చు.
పాలసీ రేట్లను 25–75 బేసిస్‌ పాయింట్లు తగ్గించేందుకు అవకాశాలు.
జీఎస్టీ అమలు తర్వాత పన్ను పరిధి విస్తరణ సంకేతాలు.
డీమోనిటైజేషన్‌ ప్రయోజనాలు కొనసాగుతాయి.
బ్యాంకుల రుణాలకు ఇంకా పుంజుకోని డిమాండ్‌. ఈ విషయంలో ప్రభుత్వరంగ బ్యాంకుల కంటే ప్రైవేటు రంగంలోని బ్యాంకుల రుణాల వృద్ధి రేటు ఎక్కువగా ఉంది.
రైతు రుణాల రద్దు వల్ల జీడీపీకి 0.7 శాతం విఘాతం
హెచ్‌ఆర్‌ఏ అలవెన్స్‌తో 40–100 బేసిస్‌ పాయింట్ల మేర ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం.

 న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంచనాల మేరకు గరిష్ట వృద్ధి రేటు నమోదు కష్టమేనని కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆర్థిక రంగంలో అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఈ అభిప్రాయానికి వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ రూపొందించిన ఆర్థిక సర్వే రెండో ఎడిషన్‌ను శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశ జీడీపీ వృద్ధి రేటు 6.75 నుంచి 7.5 శాతం మధ్య నమోదవుతుందని ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ఆవిష్కరించిన ఆర్థిక సర్వేలో అంచనా వేసింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో 7.5 శాతం వృద్ధి రేటు అసాధ్యమేనని పేర్కొంది. ఆర్థిక రంగం పుంజుకునేందుకు మరిన్ని రేట్ల కోతలు అవసరమని అభిప్రాయపడింది.

ఆర్బీఐ మధ్య కాలిక లక్ష్యమైన 4 శాతంలోపే ద్రవ్యోల్బణం ఉంటుందని అంచనా వేసింది. డాలర్‌తో రూపాయి విలువ బలపడడం, రైతుల రుణాల మాఫీ, విద్యుత్, టెలికం రంగ కంపెనీలు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు, కొత్త పన్ను వ్యవస్థ జీఎస్టీకి మారడం వంటి అంశాలను సవాళ్లుగా ప్రభుత్వం పేర్కొంది. ఒక్క రైతుల రుణ మాఫీయే జీడీపీ వృద్ధిని 0.7 శాతం వరకు తగ్గించేస్తుందని అంచనా వేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ ఇదే బాట అనుసరిస్తే మొత్తం భారం రూ.2.7 లక్షల కోట్లుగా ఉంటుందని, ఇది ఆర్థిక వృద్ధిని వెనక్కి లాగేస్తుందని తెలిపింది. రుణాల రద్దు ద్రవ్యోల్బణానికి దారితీసేదే అయినా స్వల్పకాలానికి ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులే ఉంటాయని అంచనా వేసింది. యూపీ, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు ప్రభుత్వాలు రైతుల రుణాలను రద్దు చేసిన విషయం తెలిసిందే.   

రేట్ల కోత అవసరం
రెపో రేటును 25–75 బేసిస్‌ పాయింట్ల మధ్య తగ్గించేందుకు అవకాశాలున్నాయని ఈ సర్వే తెలిపింది. గత నెలలో ఆర్‌బీఐ రెపో, రివర్స్‌ రెపో రేట్లను పావు శాతం మేర తగ్గించిన విషయం తెలిసిందే. వాస్తవ తటస్థ వడ్డీ రేటు 1.25 – 1.75 శాతం మధ్య ఉండాలి. దీన్ని ద్రవ్యోల్బణం లక్ష్యిత స్థాయి 4 శాతానికి అన్వయించి చూస్తే 5.25 – 5.75 శాతం మధ్య ఉండాలి’’ అని సర్వే వివరించింది. ప్రస్తుత రెపో రేటు 6 శాతం కాగా, ఉండాల్సిన దాని కంటే 25– 75 బేసిస్‌ పాయింట్లు అధిక స్థాయిలో ఉందని పేర్కొంది. ‘‘2016–17లో బ్యాంకుల స్థూల రుణ వృద్ధి రేటు సగటున 7 శాతంగా ఉంది. మానిటరీ పాలసీ ప్రయోజనాలను బ్యాంకులు పూర్తి స్థాయిలో రుణ గ్రహీతలకు బదిలీ చేయకపోవడం రుణ డిమాండ్‌ పెరగకపోవడానికి కారణం’’ అని వివరించింది. అదే సమయంలో బాండ్‌ మార్కెట్‌లో మరింత ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు ఉండడం కూడా కారణమేనని తెలిపింది.

సామర్థ్యం మేర రాణించాల్సి ఉంది
ఆర్థిక రంగం తన పూర్తి స్థాయి సామర్థ్యానికి ఇంకా చేరుకోవాల్సి ఉందని అభిప్రాయపడింది. జీడీపీ, ఐఐపీ, రుణాలు, పెట్టుబడులకు డిమాండ్, సామర్థ్య వినియోగం ఇవన్నీ 2016–17 మొదటి త్రైమాసికం నుంచీ తగ్గిపోతున్న విషయాన్ని, డీమోనిటైజేషన్‌ తర్వాత మరింత పడిపోయిన విషయాన్ని సర్వే గుర్తు చేసింది. జీఎస్టీ అమలు, ఎయిర్‌ ఇండియా ప్రైవేటీకరణ, ఇంధన సబ్సిడీలను హేతుబద్ధీకరించడం, బ్యాంకులకు సంబంధించి రెండు రకాల బ్యాలన్స్‌ షీట్ల నిర్వహణ ప్రభుత్వం చేపట్టిన సంస్థాగత సంస్కరణలుగా పేర్కొంది. జీఎస్టీ ప్రారంభమైన తర్వాత పన్ను పరిధి విస్తృతమవుతున్న ప్రాథమిక సంకేతాలు కనిపించాయని తెలిపింది. డీమోనిటైజేషన్‌ తర్వాత కొత్తగా 5.4 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు తోడయ్యారని వివరించింది. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వల పరిమితులు, రవాణా ఆంక్షలకు ముగింపు పలకాలని సూచించింది.  

వివిధ రంగాలపై....
ఇన్‌ఫ్రా: మౌలికరంగంపై మరిన్ని నిధులను వెచ్చించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సర్వే తెలిపింది. ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు బహుళ అంచల విధానాన్ని అమలు చేయనున్నట్టు తెలిపింది. హైవేల అనుసంధానతను పెంచేందుకు ఉద్దేశించిన భారతమాల ప్రాజెక్టు అమలు, రూ.లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులను పునరుద్ధరించడం, దేశీయ విమానయాన సంస్థలను సేవల విస్తృతి దిశగా ప్రోత్సహించడం, జల, రైలు రవాణాను అభివృద్ధి చేయడం వంటి చర్యలను ప్రస్తావించింది.

ఐటీ: అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ దేశాల నుంచి ఉద్యోగ వీసాల పరంగా ఉన్న ఇబ్బందులు, డిజిటల్‌ టెక్నాలజీలకు సరిపడా నైపుణ్య కార్మికుల కొరత వంటివి 150 బిలియన్‌ డాలర్ల ఐటీ, బీపీఎం రంగం ఎదుర్కొంటున్న సవాళ్లని తెలిపింది.
టెలికం: మార్కెట్లో పెరిగిపోయిన పోటీతో ఒకవైపు టెలికం సంస్థల ఆదాయాలు పడిపోతుండగా, మరోవైపు బ్యాంకుల మొండి బకాయిల్లో (ఎన్‌పీఏ)టెలికం రంగానికి ఇచ్చిన రుణాల వాటా పెరుగుతుండడంపై సర్వే ఆందోళన వ్యక్తం చేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement