మోదీని భయపెడుతున్నదిదే..
ఉపాధి, నిరుద్యోగితకు సంబంధించిన అంశాలపై సమాచారం పట్ల కొంతకాలంగా చర్చ సాగుతూనే ఉంది. సరైన సమాచారం లేకపోవడం ప్రభుత్వ విధాన రూపకల్పనపై ప్రభావం చూపుతున్నదని అరవింద్ సుబ్రమణియన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వాస్తవానికి మోడీ హయాంలో ఉపాథి కల్పన దారుణంగా పడిపోయింది. జాబ్ మార్కెట్‌లో ప్రవేశించే వారితో పోలిస్తే అతితక్కువగా ఉద్యోగాలు సమకూరుతున్నాయి. ప్రభుత్వం మాత్రం దీనికి భిన్న కారణాలు చూపుతున్నది. ఉద్యోగాలకు యువత మొగ్గుచూపడం లేదని, తాము చేపట్టిన పలు పథకాలతో వ్యాపారవేత్తలు కావాలని, స్వయం ఉపాథి పొందాలని కోరుకుంటున్నారని పేర్కొంటోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉండటం గమనార్హం.
అసలు సరైన జాబ్ డేటానే ప్రభుత్వం వద్ద లేకపోవడంతో ఉద్యోగ కల్పన దిశగా చర్యలు తీసుకోలేని పరిస్థితి మరింత ప్రమాదకరమని, ఇది 2019 సాధారణ ఎన్నికల్లో మోడీ ప్రభుత్వానికి సవాల్‌గా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యువ ఓటర్లలో మెరుగైన ఆదరణ కలిగిన మోడీకి నిరుద్యోగ అంశం కచ్చితంగా ఎదురుదెబ్బ కాగలదని అంచనా వేస్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కోటి ఉద్యోగాలు అందుబాటులోకి తెస్తామని మోదీ వాగ్ధానం చేసిన క్రమంలో దీనిపై వచ్చే ఎన్నికల్లో ఆయన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఉద్యోగ గణాంకాలు సరైన రీతిలో లేకపోతే, ఉపాథి కల్పనకు చర్యలు చేపట్టకపోతే మాత్రం రానున్న ఎన్నికల్లో యువతకు నచ్చచెప్పడం ఇబ్బందికరంగా మారవచ్చని భావిస్తున్నారు.