బడ్జెట్ ప్రింటింగ్ షురూ..!!
♦ సాంప్రదాయక ‘హల్వా’ రుచులతో ఆరంభం
♦ బాధ్యతల్లో దాదాపు 100 మంది అధికారులు
♦ బడ్జెట్ ప్రవేశపెట్టేదాకా వారంతా ఇక అక్కడే...
న్యూఢిల్లీ: ఈసారి బడ్జెట్ రుచి ఎలా ఉంటుందో గానీ... ఆర్థిక శాఖలో మాత్రం తియ్యని హల్వా తయారయింది. ఈ హల్వాను రుచి చూడటానికి నార్తబ్లాక్ బేస్‌మెంట్‌లో... మంత్రి అరుణ్ జైట్లీ సహా ఆర్థిక శాఖకు చెందిన కీలక అధికారులంతా శుక్రవారం హాజరయ్యారు. సహాయ మంత్రి జయంత్ సిన్హా, ప్రధాన సలహాదారు అరవింద్ సుబ్రమణియన్, కార్యదర్శి రతన్ వాటెల్, రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అదియా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్, పెట్టుబడుల ఉపసంహరణ విభాగం కార్యదర్శి నీరజ్ గుప్తా, ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి అంజులీ దుగ్గల్, బడ్జెట్ రూపకల్పనలో కీలక బాధ్యతలు నిర్వహించే అధికారులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఒకరికొకరు హల్వాను తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంతో... బడ్జెట్లో చివరి మెట్టయిన ముద్రణ కార్యక్రమం మొదలైనట్లే. నార్త్‌బ్లాక్‌లోనే ఉన్న ప్రింటింగ్ ప్రెస్‌లో ఈ ముద్రణ మొదలవుతుంది. ఈ నెల 29న పార్లమెంట్లో 2016-17 సార్వత్రిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేదాకా... దీన్లో పాల్గొన్న కీలక అధికారులంతా నార్త్‌బ్లాక్‌కే పరిమితమవుతారు. ఎన్‌డీఏ ప్రభుత్వానికి ఇది రెండవ పూర్తిస్థాయి బడ్జెట్ కాగా, తొలి మధ్యంతర బడ్జెట్‌ను కలుపుకుంటే మూడవది.
బయటి ప్రపంచంతో సంబంధాలు కట్
హల్వా కార్యక్రమం అనంతరం బడ్జెట్ ముద్రణ ప్రక్రియతో సంబంధమున్న ముఖ్య అధికారులందరికీ బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. ఈ కార్యక్రమం అనంతరం మంత్రులు, అతికొద్ది మంది ఉన్నత స్థాయి ఆర్థిక శాఖ అధికారులకు మాత్రమే ఇళ్లకు వెళ్లడానికి అనుమతి ఉంటుంది. మిగిలినవారికి కనీసం వారి ఆప్తుల్ని ఫోన్లో లేదా ఈ-మెయిల్ ద్వారా సంప్రదించే అవకాశం ఉండదు. మరీ అత్యవసరమైన విషయమైతే ఉన్నతాధికారుల సమక్షంలో వారికి తెలియజేయటం, వారితో మాట్లాడించటం వంటివి చేస్తారు. 100 మందికిపైగా అధికారులు ప్రస్తుతం బడ్జెట్ రూపకల్పన ప్రక్రియలో పాల్గొంటున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి.
అంత గోప్యత ఎందుకు?
ఏటా బడ్జెట్లో కీలక నిర్ణయాలుంటాయి. దీంతో స్టాక్‌మార్కెట్లు, పలు వ్యాపారాలు ప్రభావితమవుతాయి. అందుకే బడ్జెట్‌ను ఎంతో పకడ్బందీగా, గోప్యంగా తయారు చేస్తారు. ఎందుకంటే ఇది ముందే బయటకు వెల్లడైతే ఆయా వర్గాలు ముందే అప్రమత్తమయ్యే అవకాశముంటుంది. ఒక దేశానికి ఎంత పటిష్ట స్థాయిలో రక్షణ ఉంటుందో... బడ్జెట్ ముద్రణ విషయంలో కూడా అంతే స్థాయి నిఘా ఉంటుంది. అత్యాధునిక పర్యవేక్షణ పరికరాలు, పటిష్టమైన సైనిక భద్రత, ఆధునిక నిఘా పరికరాలు, జామర్లు, పెద్ద స్కానర్లు... ఇలా అనేక పరికరాల్ని ఏర్పాటు చేస్తారు. వీటితో పాటు ఈ బడ్జెట్ ప్రక్రియ కొనసాగినంత కాలం నార్త్‌బ్లాక్‌లోని ఆర్థికశాఖ కార్యాలయం నుంచి వెళ్లే ఫోన్లన్నింటినీ ట్యాప్ చేసేందుకు ఒక ప్రత్యేక ఎక్స్ఛేంజీని ఏర్పాటు చేస్తారు. ఆర్థికశాఖ కార్యాలయ వరండాలలో ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పనిచేయకుండా ప్రత్యేక జామర్లు ఏర్పాటుచేస్తారు.
ఈ కార్యాలయానికి వెళ్లే మార్గంలో పెద్ద ఎక్స్‌రే స్కానర్‌ను ఏర్పాటుచేసి, దానిని కంప్యూటర్‌తో అనుసంధానిస్తారు. ఈ పరికరాల వల్ల ఏ చిన్న వస్తువు తీసుకువెళ్తున్నా ఇట్టే తెలిసిపోతుంది. అలాగే బడ్జెట్‌ను ముద్రించే సమయంలో ఆర్థికశాఖ కార్యదర్శి... ప్రధానితోను, ఆర్థిక మంత్రితోను సమన్వయం చేస్తూ సమావేశాలకు హాజరవుతూ ఉంటారు. ముద్రణ సమయంలో అనునిత్యం ఐబీ అధికారులు, ఢిల్లీ పోలీసులు కునుకులేకుండా కాపలాకాస్తుంటారు. మధ్య మధ్యలో సెక్యూరిటీని పరీక్షించేందుకు ‘మాక్ డ్రిల్’ పద్ధతిలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా కొన్ని పత్రాలు బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. వీరిని గనుక సమర్థంగా పట్టుకోగలిగితే భద్రత చక్కగా ఉన్నట్లే. లేకుంటే భద్రత సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవు.