సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పులుల అభయారణ్యాలు, టైగర్ కారిడార్లలో పెద్దపులులు సందడి చేస్తున్నాయి. కెమెరా ట్రాప్‌లు, అటవీ సిబ్బంది, అడవులను ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలకు ‘సైటింగ్స్’ద్వారా వీటి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు స్పష్టమౌతోంది. దేశవ్యాప్తంగా పులుల పెరుగుదలకు సంబంధించి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ(ఎన్‌టీసీఏ) ప్రతీ నాలుగేళ్లకోసారి (2006 నుంచి) టైగర్ సెన్సస్ నిర్వహించి, సంఖ్యను ప్రకటిస్తోంది. అయితే వేటగాళ్లు, స్మగ్లర్ల నుంచి వాటిని కాపాడేందుకు ఈ ప్రాంతంలో ఇన్ని పులులున్నాయని, వాటి ఆనుపానులు ఇవని కచ్చితమైన సమాచారాన్ని నివేదికల్లో పేర్కొనరు. వాటిని ఇతరులు ట్రాక్ చేయకుండా వీటికి సాంకేతిక పేర్లు మాత్రమే పెట్టి జాగ్రత్తలు తీసుకుంటారు.
ఈ ఏడాది ఆఖరులో సెన్సస్..
2018లో నిర్వహించిన ‘టైగర్ సెన్సస్’లో తెలంగాణలో 26 పులులున్నట్టు వెల్లడైంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్(ఏటీఆర్)లో 14, కవ్వాల్ టైగర్ రిజర్వ్(కేటీఆర్)లో 12 ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ ఏడాది ఆఖరుకల్లా విడుదలయ్యే 2022 సెన్సస్‌లో ఈ రెండు రిజర్వ్‌లతో పాటు టైగర్ కారిడార్లలో వాటి సంఖ్య 30 లేదా 32 దాకా పెరిగి ఉంటుందని అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి ఏపీలో 2014లో 68 పులులున్నాయి. అందులో తెలంగాణలో 20 (ఏటీఆర్‌లో 17, కేటీఆర్‌లో 3) ఉన్నట్టు అంచనా వేశారు. ప్రస్తుతం అమ్రాబాద్‌లో 23 లేదా 24 పులులు, కవ్వాల్ రిజర్వ్‌తోపాటు ఆసిఫాబాద్, మంచిర్యాల, ఇతర టైగర్ కారిడార్ ఏరియాలలో కలిపి 7 లేదా 8 పులులు ఉండే అవకాశముందని భావిస్తున్నారు.
ఏటీఆర్‌లో పులులపై స్పష్టత..
ఏటీఆర్ పరిధిలో కెమెరా ట్రాప్‌లు, అడవుల్లో సైటింగ్‌లు, టైగర్ సఫారీల్లో కనిపిస్తుండటంతో పులుల వృద్ధిపై స్పష్టమైన అంచనా వేయడానికి వీలవుతోంది. ఇక్కడ 21 పులులున్నట్టు అధికారులు గుర్తించారు. దొరికిన ఆనవాళ్ల ఆధారంగా 23 ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక కేటీఆర్.. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉండటంతో, అక్కడి నుంచి
పులుల రాకపోకలు ఎక్కువ. అందువల్ల పులులు స్థిరంగా కనిపించడం, కెమెరా ట్రాప్‌లకు చిక్కడం తక్కువే. దీంతో ఇక్కడ స్థిరనివాసం ఏర్పరుచుకున్న పులుల సంఖ్యపై స్పష్టత రావడం లేదు. మహారాష్ట్ర నుంచి సాగే ఈ సుదీర్ఘ టైగర్ కారిడార్‌లో కదలికను బట్టి 7 లేదా 8 పులులు స్థిరనివాసం ఏర్పరుచుకున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో పెద్ద అభయారణ్యాలు..
దేశవ్యాప్తంగా 54 పులుల అభయారణ్యాలున్నాయి. 2వేల చ.కి.మీ. పైబడి అటవీ వైశాల్యమున్న అభయారణ్యాలు ఐదు ఉండగా, ఏపీ, తెలంగాణల్లోనే 3 ఉన్నాయి. ఏపీలోని నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్‌ఎస్‌టీఆర్) 3,728 చ.కి.మీలలో విస్తరించింది. తెలంగాణలోని ఏటీఆర్ 2,611 చ.కి.మీ.లుగా విస్తరించగా, కేటీఆర్ విస్తీర్ణం 2,016 చ.కి.మీ.లో ఉంది. రాష్ట్రంలో నాగర్‌కర్నూల్, నల్లగొండ జిల్లాల పరిధిలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలో కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment