గత ఏడాది మరణాలు 182.. ఈ ఏడాది 122 మరణాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పులుల మరణాలు గణనీయంగా తగ్గాయని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్‌టీసీఏ) వెల్లడించింది. పులుల సంరక్షణ చర్యలు పటిష్టం చేయడం, వణ్యప్రాణి చట్టాల కఠిన అమలు, అభయారణ్యాలలో వేటగాళ్ల కట్టడి చర్యల ఫలితంగా మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని పేర్కొంది. గత ఏడాదిలో మొత్తం మరణాల సంఖ్య 182గా ఉండగా, ఈ ఏడాది కేవలం 122 మరణాలే సంభవించినట్లు తెలిపింది.
ఈ ఏడాది సంభవించిన మరణాల్లో అధికంగా మధ్యప్రదేశ్‌లో 44, తర్వాతి స్థానంలో మహారాష్ట్రలో 21 పులుల మరణాలు సంభవించాయి. తెలంగాణలో ఈ ఏడాది జనవరిలో కవ్వాల్ రిజర్వ్ ప్రాంతంలో రెండు పులులు మృతి చెందినట్లు నివేదిక పేర్కొంది. దేశ వ్యాప్తంగా 2012 నుంచి 2024 డిసెంబర్ 25 వరకు దేశ వ్యాప్తంగా మొత్తంగా 1,366 పులులు మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 2020లో 106, 2021లో 127, 2022లో 122, 2023లో 182 పులులు మరణించాయి.
అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 355, మహారాష్ట్రంలో 261, కర్ణాటకలో 179 పులులు మరణించగా, ఆంధ్రప్రదేశ్‌లో 14, తెలంగాణలో 11 మరణాలు సంభవించాయి. వణ్యప్రాణి సంరక్షణ ప్రాంతాల పరిధిలో జరిగిన మరణాలు 50శాతం వరకు ఉండగా, వెలుపల జరిగిన మరణాలు 42 శాతంగా ఉండగా, మరో 8 శాతం వేటగాళ్ల నుంచి స్వా«దీనం చేసుకున్న సందర్భాలున్నాయి. ఆహారం, నీటి కోసం తమ భూభాగాలను విడిచిపెట్టి బయటికి రావడం, ఆహారం కోసం పులుల మధ్య ఘర్షణలు జరగడం, ఇతర జంతువులతోనే వేటకై పోటీ ఉండటంతో మరణాలు జరుగుతునట్లు నివేదిక తెలిపింది. అయితే గత ఏడాది ప్రాజెక్ట్ టైగర్‌లో బాగంగా గ్రీన్ కవర్ పెంచడం, బఫర్ జోన్‌లలో నిర్మాణాల కట్టడి, అటవీ భూముల బదలాయింపుల నిలుపుదల, వేటగాళ్లపై నిరంతర నిఘా, రాత్రి వేళల్లో సఫారీల నిలుపుదల, టైగర్ రిజర్వ్‌లో నిర్మాణ కార్యకలాపాల కట్టడి వంటి చర్యలతో పులుల మరణాలు తగ్గాయని అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment