సాక్షి, న్యూఢిల్లీ : పులుల గణనకు కొత్త సాంకేతికతను వినియోగించనున్నట్లు టైగర్ కన్జర్వేషన్ అథారిటీ(ఎన్‌సీఏ), వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎల్‌ఐఐ) అధికారులు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం విలేకరులతో సమావేశం నిర్వహించారు. M-Stripes ఆండ్రాయిడ్ ఫోన్ అప్లికేషన్, డెస్క్‌టాప్ వెర్షన్‌లను ఉపయోగించి ఈ సారీ పులుల గణనలో పారదర్శకతను తీసుకువస్తున్నట్లు తెలిపారు.
పులులపై నిర్వహించిన సర్వేల వివరాలు ఈ మొబైల్ అప్లికేషన్‌లో ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతూ ఉంటాయని చెప్పారు. జియో ట్యాగింగ్ వ్యవస్థను వినియోగిస్తుండటం వల్ల ఆటోమేటిక్‌గా జంతువుల కొత్త ఫొటోలు కూడా అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. 2006లో పులుల ఫొటోలను తీసేందుకు 9,700 కెమెరాలను వినియోగించామని, 2018లో కెమెరాల సంఖ్య 15 వేలకు పెంచామని చెప్పారు.
పులులను ఎలా లెక్కిస్తారు..?
ఇంతకు ముందు 2006, 2010, 2014లో పులుల గణనను చేపట్టారు. ఫొటోలు, పులుల అడుగులు, మల పరీక్షలతో పులుల సంఖ్యను గణించేవారు. ఫొటోలతో పులుల సంఖ్యను లెక్కించడం అసాధ్యం. ఇందుకు ప్రత్యామ్నాయంగా వాటి చారాల ఆధారంగా గుర్తిస్తున్నారు.
మనిషికి వేలి ముద్రలు ఎలా ప్రత్యేకంగా ఉంటాయో.. పులుల చారాలు ఒక్కోదానికి ఒక్కోవిధంగా ఉంటాయి. నాలుగోసారి చేపట్టబోయే పులుల గణనకు కేంద్ర ప్రభుత్వం రూ.10 కోట్ల 22 లక్షలు ఖర్చు చేస్తోంది. కేంద్ర ప్రాయోజిత పథకం ప్రొటెక్షన్ టైగర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 7 కోట్లు అందుతాయి.
దేశవ్యాప్తంగా 2006లో పులుల సంఖ్య 1,411 ఉండగా, 2010లో 1,706 చేరింది. 2014లో పులుల సంఖ్య 2,226కు పెరిగింది. మూడు పర్యాయాల్లో పులులను లెక్కించడానికి ఒకే విధానం ఉపయోగించారు. ఇందులో రెండు దశలు ఉన్నాయి. ఇప్పటి వరకు రెండు దశల్లో పులులను లెక్కించేవారు.
తొలి దశలో దేశవ్యాప్తంగా పులులు ఉన్న 18 రాష్ట్రాల్లోని స్థానిక ఫారెస్ట్ అధికారులు, వేటగాళ్లు, గిరిజనుల అవగాహనను దృష్టిలో పెట్టుకుని లెక్కించేవారు. రెండో దశలో పులులకు సంబంధించి ప్రత్యేక శిక్షణ పొందిన బయాలజిస్ట్‌లతో చారాలను పరిశీలించి లెక్కించారు. ఈ విధంగా 2014లో 70 శాతం పులుల గణన ఫొటోల ఆధారంగానే జరిగింది. మిగత 30 శాతం పులుల లెక్కింపు అధికారులు అవగాహనతో అంచనా వేశారు.
నాలుగో విడత సర్వే కోసం ఆధునాతన సాంకేతికతను వినియోగించనున్నారు. నేషనల్ రిపోసిటరీ ఆఫ్ కెమెరా ట్రాప్ ఫొటోగ్రాఫ్స్ ఆఫ్ టైగర్స్(ఎన్‌ఆర్‌సీటీపీటీ)లు టైగర్ల చిత్రాలను తీస్తాయి. వీటిని పరిశీలించి ఫీల్డ్ డైరెక్టర్లు పులుల సంఖ్యను కచ్చితంగా అంచనా వేయగలుగుతారు.
Comments
Please login to add a commentAdd a comment