కాకతీయ జూపార్క్‌కు జంట పెద్ద పులులు
త్వరలో రానున్న రెండు అడవి దున్నలు
ఐదేళ్ల నిరీక్షణకు తెర..
ప్రారంభించనున్న మంత్రి సురేఖ
న్యూశాయంపేట : వరంగల్ నగరంలోని కాకతీయ జూపార్క్‌కు ఆడపులి కరీనా (15), మగ పులి శంకర్ (10) వచ్చేశాయి. పర్యాటకులు ఎప్పుడెప్పుడా అని ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న పెద్దపులుల దర్శన భాగ్యం త్వరలో కలగనుంది. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా రెండు పెద్ద పులులతోపాటు అడవిదున్నల ఎన్‌క్లోజర్‌లు, రెండు జింకల ఎన్‌క్లోజర్‌లను ప్రారంభించనున్నట్లు అటవీశాఖాధికారులు తెలిపారు.
ఐదేళ్ల కిందటే రావాల్సి ఉండే..
కాకతీయ జూపార్క్‌లో పెద్ద పులులు, అడవిదున్నల కోసం ఐదేళ్ల క్రితమే ఎన్‌క్లోజర్ పనులు ప్రారంభించారు. ఆ తరువాత ఎవరూ పట్టించుకోకపోవడం.. బడ్జెట్ లేదనే నెపంతో పనులను మధ్యలోనే వదిలేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ అటవీశాఖ మంత్రి కావడంతో జూపార్క్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్‌క్లోజర్‌ల పనులు పూర్తి చేసి రెండు పెద్ద పులులు, ఇతర జంతువులు వచ్చేలా చర్యలు తీసుకున్నారు.
హగ్ డీర్.. బార్‌కిన్ డీర్ వైజాగ్ నుంచి రాక..
కాకతీయ జూపార్క్‌కు రెండు జింక (హగ్ డీర్, బార్‌కిన్ డీర్)లను ఆంధ్రప్రదేశ్‌నుంచి తీసుకొచ్చినట్లు అటవీశాఖాధికారులు తెలిపారు. రెండు అడవిదున్నలు త్వరలో రానున్నట్లు చెప్పారు. సెంట్రల్ జూపార్క్ అథారిటీ అనుమతితో ఈ జంతువులను జూపార్క్‌కు తీసుకొస్తున్నట్లు వివరించారు. వాటి కోసం ప్రత్యేకమైన ఎన్‌క్లోజర్‌ల ఏర్పాటు చేశామన్నారు.
సిద్ధసముద్రంలో పూడిక తీస్తే మేలు..
జూపార్క్.. సిద్ధ సముద్రం చెరువు ప్రాంతంలో చుట్టూ ఎత్తయిన కొండల మధ్య 47.64 ఎకరాల్లో విస్తీర్ణం కలిగి ఉంది. ఇందులో వివిధ జంతువుల ఎన్‌క్లోజర్‌లకు పోను సిద్దసముద్రం చెరువు కొంతమేర ఉంటుంది. అప్పట్లో బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు చెరువులో పూడిక తీసి బోటింగ్ సౌకర్యం కల్పిస్తామని పార్క్‌ను సందిర్శించిన సందర్భంగా తెలిపారు. ఆ తరువాత పట్టించుకోలేదు. కొండా సురేఖ అటవీశాఖ మంత్రి కావడం, జూపార్క్‌కు ప్రతేక నిధులు కేటాయించి సిద్ధసముద్రంలో పూడిక తీసి బోటింగ్ సదుపాయం కల్పించాలని పర్యాటకులు, నగరవాసులు కోరుతున్నారు.
ఇక్కడి వాతావరణానికి అలవాటు పడాలి..
కాకతీయ జూపార్క్‌కు రెండు పెద్ద పులులు వచ్చాయి. రెండు జింకలు వైజాగ్ నుంచి ఇటీవల తీసుకొచ్చాం. రెండు అడవిదున్నలు త్వరలో రానున్నాయి. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడేదాక సంరక్షణ చర్యలు తీసుకుంటున్నాం. అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ప్రారంభిస్తాం. ఆ తరువాత సందర్శకులకు అనుమతిస్తాం.
– భీమానాయక్, అటవీ ముఖ్య సంరక్షణాధికారి, భద్రాద్రి సర్కిల్
Comments
Please login to add a commentAdd a comment