లక్ష్య సాధకులు.. యూపీఎస్సీ ఫలితాల్లో మెరిసిన అన్నదమ్ములు! | Telangana Warangal District Santosh And Anand Job Achievements In UPSC Results | Sakshi
Sakshi News home page

లక్ష్య సాధకులు.. యూపీఎస్సీ ఫలితాల్లో మెరిసిన అన్నదమ్ములు!

Published Wed, Aug 21 2024 1:13 PM | Last Updated on Wed, Aug 21 2024 1:13 PM

Telangana Warangal District Santosh And Anand Job Achievements In UPSC Results

కేంద్ర ప్రభుత్వ కొలువులకు ఎంపిక

ఆదర్శంగా నిలుస్తున్న గిరిపుత్రులు

వరంగల్: ఆ అన్నదమ్ములు.. ఉన్నత ఉద్యోగం సాధించాలని చిన్నప్పటి నుంచే కలలు కన్నారు. దీనికి ఓ లక్ష్యం విధించుకున్నారు. ఈ మార్గంలో ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా తట్టుకుని ప్రణాళిక ప్రకారం చదివి గమ్యం చేరుకున్నారు. తల్లిదండ్రుల ఆకాంక్షకు అనుగుణంగా యూపీఎస్సీ ఉద్యోగాలు సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచారు ఈ గిరిపుత్రులు. వారే నర్సంపేట పట్టణానికి చెందిన ఆంగోత్‌ భద్రయ్య–అరుణ దంపతుల కుమారులు సంతోశ్, ఆనంద్‌. ఇటీవల యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించిన ఫలితాల్లో సంతోశ్‌ ఇండియన్‌ బ్యూరో ఆఫ్‌ మైన్స్‌లో మైనింగ్‌ ఇంజనీర్, ఆనంద్‌ కేంద్ర కార్మిక శాఖలో లేబర్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఉద్యోగం సాధించారు. ఒక ఉద్యోగం సాధించడమే కష్టంగా మారిన ప్రస్తుత రోజుల్లో ఉద్యోగం చేసూ్తనే మరో ఉద్యోగానికి అదీ జాతీయ స్థాయి ఉద్యోగాలకు సన్నద్ధమై సాధించడం గొప్ప విశేషం.

విద్యాభ్యాసం..
సంతోశ్, ఆనంద్‌ ఇద్దరూ ప్రాథమిక విద్యను నర్సంపేటలో పూర్తి చేశారు. సంతోశ్‌ పదో తరగతి హనుమకొండ, ఇంటర్‌ హైదరాబాద్, కర్ణాటక ఎన్‌ఐటీలో ఇంజనీరింగ్, జైపూర్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. అనంతరం అల్ట్రాటెక్‌ సిమెట్స్‌ (ఆదిత్య బిర్లా)లో ఇంజనీర్‌గా, కొంత కాలం పేటీఎం సంస్థలో, జాతీయ ఖనిజ అభివృద్ధి సంస్థలో రెండు సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు. సివిల్స్‌ లక్ష్యంగా ఆర్‌సీ రెడ్డి కోచింగ్‌ సెంటర్‌లో కోచింగ్‌ తీసుకున్నారు. ఒక పక్క ఉద్యోగం చేసూ్తనే.. మరోపక్క ఖాళీ సమయంలో పోటీ పరీక్షకు సన్నద్ధమై ఇండియన్‌ బ్యూరో ఆఫ్‌ మైన్స్‌లో ఇంజనీర్‌ కొలువు సాధించారు. ఆనంద్‌ పదో తరగతి బిట్స్‌ స్కూల్, ఇంటర్, ఇంజనీరింగ్‌ హైదరాబాద్, వరంగల్‌ ఎన్‌ఐటీలో ఎంబీఏ పూర్తి చేశారు. టీసీఎస్‌లో స్టాఫ్‌వేర్, ఆ తర్వాత చెన్నై పెట్రోలియం సంస్థలో హెచ్‌ఆర్‌ అధికారిగా పని చేసూ్తనే యూపీఎస్‌సీ ద్వారా కార్మిక శాఖలో ఉద్యోగం సాధించాడు.

తల్లిదండ్రులు భద్రయ్య–అరుణతో ఆనంద్, సంతోశ్‌ (ఫైల్‌)

ప్రణాళిక ప్రకారం చదివి.. లక్ష్యం చేరుకుని..
ఉన్నత చదువులతో జీవితంలో స్థిరపడిన తమ బాబాయ్‌లు, తల్లిదండ్రులను సంతోశ్, ఆనంద్‌  ఆదర్శంగా తీసుకున్నారు. యూపీఎస్‌సీలో ఉన్నత ఉద్యోగం సాధించాలని లక్ష్యం విధించుకున్నారు. ఈ నేపథ్యంలో సంతోశ్‌ రెండు దఫాలు( గ్రూప్‌–ఏ) ప్రిలిమ్స్, మెయిన్స్‌ వరకు వెళ్లారు. అయితే  ఆ ఫలితాలు నిరాశకు గురిచేశాయి. అయినా ఏమాత్రం నిరుత్సాహ పడకుండా మూడో ప్రయత్నంలో (గ్రూప్‌–బీ) గమ్యం చేరుకున్నాడు. ఇండియన్‌ బ్యూరో ఆఫ్‌ మైన్స్‌లో మైనింగ్‌ ఇంజనీర్‌ కొలువు సాధించాడు. ఇక ఆనంద్‌ మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించారు. కేంద్ర కార్మిక శాఖలో లేబర్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఉద్యోగం సాధించారు. ఈ అన్నదమ్ములు సుమారు సంవత్సరం కాలం పుస్తకాలతో దోస్తీ పట్టారు. ఎప్పుడూ చదువు ధ్యాసే. విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుని లక్ష్యం చేరుకున్నారు.  ఎందరో యువకులకు ఆదర్శంగా నిలిచారు.

కుటుంబ నేపథ్యం..
సంతోశ్, ఆనంద్‌ తల్లిదండ్రులు ఆంగోత్‌ భద్రయ్య–అరుణ దంపతులది వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం భోజెర్వు గ్రామం జగ్గుతండా. భద్రయ్య తల్లిదండ్రులు ఆంగోత్‌ చీమా–మల్కమ్మ. ఈ దంపతులకు నలుగురు కుమారులు భద్రయ్య, తారాసింగ్, మోహన్, విజేందర్‌ ఉన్నారు. భద్రయ్య టీచర్‌గా,  తారాసింగ్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో అధ్యాపకుడిగా, మోహన్‌ పిల్లల వైద్య నిపుణుడిగా, విజేందర్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఈ క్రమంలో తమ తండ్రి తప్ప అందరూ డాక్టరేట్‌లుగా ఉన్న తమ బాబాయ్‌లను స్ఫూర్తిగా తీసుకున్న సంతోశ్, ఆనంద్‌.. చిన్నప్పటి నుంచే చదువులో రాణిస్తూ వచ్చారు. ఉద్యోగ రీత్యా వీరి కుటుంబం నర్సంపేటలో స్థిరపడింది. సంతోశ్, ఆనంద్‌ తల్లి అరుణ వైద్య ఆరోగ్యశాఖలో ఎంఎస్‌డబ్ల్యూ గ్రేడ్‌–1 అధికారి, తండ్రి భద్రయ్య చెన్నారావుపేట మండలం ఎల్లాయిగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో హెడ్‌ మాస్టర్‌గా పని చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement