ఖానాపురం/ నర్సంపేట రూరల్: జిల్లాలోని ఖానా పురం మండలం రంగాపురం పంచాయతీ కార్యదర్శి బైరి(రంగు) సోని (31) ఆత్మహత్య జిల్లాలో కలకలం రేపింది. ఇటీవల జేపీఎస్‌లు చేపట్టిన సమ్మెలో ఆమె చురుగ్గా పాల్గొంది. తిరిగి ఈనెల 6న మళ్లీ విధుల్లో చేరింది. ఈ క్రమంలోనే శుక్రవారం రంగాపురం విధుల్లోకి వెళ్లిన సోని గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ భద్రత లేకపోవడంతో ఆత్మహత్య చేసుకుందని జేపీఎస్‌లు, కుటుంబ సభ్యులు అంటుండగా, భర్త ప్రసాద్ వేధింపులతోనే చనిపోయిందని పోలీసులు కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. రంగాపురంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సోని నర్సంపేటలోని ప్రైవేటు ఆస్పత్రిలో మృతి చెందగా పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
తల్లిదండ్రుల సమక్షంలో పోలీసులు త్వరగా పిటిషన్‌ను తీసుకోవడంతోపాటు, పోస్టుమార్టం చేయించాలనుకోవడంపై ఆగ్రహిస్తూ పోస్టుమార్టం ఎదుట జూ నియర్ పంచాయతీ కార్యదర్శులు నిరసన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పోలీసులే దగ్గరుండి పిటిషన్ రాయించడాన్ని తప్పుబట్టారు. తల్లిదండ్రులను మభ్యపెట్టి పిటిషన్ రాయిస్తున్నారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత మృతురాలి తండ్రి శ్రీనివాస్‌తో పోలీసులు పిటిషన్ తీసుకున్నారు. పిటిషన్‌లో భర్త వేధింపుల కారణం అని రాసినట్లు తెలుసుకుని జేపీఎస్‌లు ఆగ్రహించారు.
ఈ క్రమంలో మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేయించి పోలీసులు ఇంటికి తరలించే ప్రయత్నం చేస్తుండడంతో జేపీఎస్‌లు అంబులెన్స్‌ను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం విధుల నుంచి తొలగిస్తుందనే సోని ఆత్మహత్య చేసుకుందని, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని జేపీఎస్‌లు అడ్డుకున్న సందర్భంలో సోని తల్లిదండ్రులు మంజులశ్రీనివాస్ కూడా జేపీఎస్‌లతో కలిశారు. దీంతో పోస్టుమార్టం ఎదుట ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు వెనక్కి తగ్గారు.
ఈక్రమంలో డీసీపీ కరుణాకర్, ఏసీపీ సంపత్‌రావు, డీపీఓ కల్పన, ఆర్డీఓ శ్రీనివాసులు, సీఐలు సూర్యప్రకాశ్, హతిరాం, రాజు లు సోని తల్లిదండ్రులతో పాటు జేపీఎస్‌లకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ నిరసన కొనసాగించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే జేపీఎస్ సోని మృతి చెందిందని, ఉన్నతాధికారులు కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ వేధింపులకు గురిచేయడంతోనే ఒక్కొక్కరుగా ఇబ్బందులు పడుతున్నారని టీపీఎస్‌ఎఫ్ హనుమకొండ అధ్యక్షుడు సురేష్, వికాస్, కృష్ణంరాజు, రాజు, మధు, వినోద్, అజయ్, అరవింద్ లు ఆరోపించారు
కాంగ్రెస్, బీజేపీ సంఘీభావం..
కాంగ్రెస్, బీజేపీ నాయకులు పోస్టుమార్టం వద్దకు చేరుకుని, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతూ జేపీఎస్‌లకు సంఘీభావం తెలిపారు. మృతదేహాన్ని వెళ్లనీయకుండా అడ్డుపడ్డారు. మృతురాలి కుటుంబ సభ్యులను ఓదార్చారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ తల్లిదండ్రులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో ఫోన్‌లో మాట్లాడించారు. తల్లిదండ్రులతో కలిసి బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు.
ఎమ్మెల్యే పరామర్శ..
సోని మృతి విషయాన్ని తెలుసుకున్న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆస్పత్రికి చేరుకుని, మృతదేహం వద్ద నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
విధుల్లో చేరకుంటే తొలగింపే..
వరంగల్ జిల్లా వ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు 223మంది విధులు నిర్వహిస్తున్నారు. 28నుంచి సమ్మెలోకి వెళ్లారు. ఈనెల 9న విధుల్లో చేరకుంటే టర్మినేట్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో కొంత మంది విధుల్లో చేరగా మరికొంత మంది సమ్మెలోనే కొనసాగారు. జేపీఎస్ సోని మృతితో ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లాలోని జేపీఎస్‌లందరూ శనివారం 11.30గంటలలోపు విధుల్లో చేరాలని వరంగల్ జిల్లా డీపీఓ కల్పన ఆదేశించినట్లు తెలిసింది. శనివారం లోపు విధుల్లో చేరకుంటే తొలగిస్తామని తెలపడంతో జేపీఎస్‌లు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లారు. వీరిస్థానంలో గ్రామంలో జేపీఎస్ ఉద్యోగానికి పరీక్ష రాసిన వారిని విధుల్లోకి తీసుకోవాలని అధికారులకు టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించినట్లు తెలుస్తుంది. ఒకవేళ పరీక్ష రాసిన వారు లేకపోతే ఆదివారం లోపు ఆయా గ్రామాల్లో గ్రామసభలు పెట్టి పంచాయతీ కార్యదర్శులను ఎంపిక చేయాలని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.
తాతా ఊరుకో.. నేనే నీ కుమార్తెను..
మార్చురీ గది వద్ద సోని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ క్రమంలో మృతురాలి తండ్రి శ్రీనివాస్ తన మనుమరాలు శ్లోకను పట్టుకుని బోరున విలపించాడు. తెలిసీ తెలియని పసి వయస్సులో ఉన్న శ్లోక ‘ఊరుకో తాత.. నీ కుమార్తెను ఇక నేనే.. నేను ఉన్న కదా ఏడవకు తాతా’అంటూ ఓదార్చిన సంఘటన చూపరులను కంటతడి పెట్టించింది.
జేపీఎస్‌ల అరెస్ట్..
ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ కావాలనే డిమాండ్‌తో మృతదేహాన్ని రాత్రి పది గంటల వరకు అడ్డుకున్నారు. అధికారులు సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ వినలేదు. ఈ క్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు తల్లిదండ్రులను పిలిచి కలెక్టర్ ప్రావీణ్యతో మాట్లాడించారు. తల్లికి అటెండర్ ఉద్యోగంతోపాటు కుమార్తెకు పీజీ వరకు ఉచిత విద్యకు అయ్యే ఖర్చు ప్రభుత్వం భరిస్తుందని, ప్రభుత్వంనుంచి రావాల్సిన అన్ని బెనిఫిట్స్ వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. లిఖిత పూర్వకంగా హామీలు రాసిస్తేనే విరమిస్తామని జేపీఎస్‌లు పట్టుబట్టారు. దీంతో మూడు రోజుల తర్వాత కలెక్టర్ వద్దకు వచ్చి లిఖితపూర్వకంగా డిమాండ్లను రాసిస్తే పరిష్కరిస్తామని అధికారులు తెలిపినప్పటికీ వినలేదు. దీంతో పోలీసులు వారిని ప్రత్యేక బలగాలతో అరెస్టు చేయించి స్టేషన్‌కు తరలించారు. మృతదేహాన్ని అక్కడినుంచి పంపించారు. ఇదిలా ఉండగా.. సోని మృతదేహాన్ని తరలించే అంబులెన్స్ మొరాయించగా.. పోలీసులే దగ్గరుండి మరమ్మతుచేసి పంపించడం కొసమెరుపు. కాగా, భర్త ప్రసాద్ వేధింపులతోనే సోని ఆత్మహత్య చేసుకుందని అతనిపై కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment