
సాక్షి, చెన్నూర్: మంచిర్యాల జిల్లా చెన్నూర్ అటవీ డివిజన్ పరిధిలో పులుల సంతతి పెరుగుతోంది. ఈ ప్రాంతంలో ఒకే పులి ఉన్నట్లు భావిస్తున్న అటవీ అధికారులు.. ప్రస్తుతం 3 పులులు ఉన్నట్లు గుర్తించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వాటి పరిరక్షణకు పకడ్బందీ చర్య లు చేపట్టారు. ఇందులో భాగంగా తొమ్మిది బృం దాలు ఏర్పాటు చేశారు. చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి గతంలో కే–4 పులి సంచారం మాత్రమే కనిపించేది. నెల రోజుల నుంచి ఈ ప్రాంతంలో మూడు పులులు సంచరిస్తున్నట్లు ఇటీవల సీసీ కెమెరాల్లో లభించిన పుటేజీల ఆధారంగా నిర్ధారించారు. మూడేళ్ల క్రితం కోటపల్లి మండలం పిన్నారంలో పులి హతమైన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అటవీశాఖ పులుల సం చారాన్ని గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది.
వేట ప్రారంభం
డివిజన్‌లోని చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో పులులు వేట ప్రారంభించాయి. 15 రోజుల నుంచి ఆవులు, మేకలపై దాడి చేస్తూ హత మారుస్తున్నాయి. కోటపల్లి మండలం పంగిడిసోమారం అటవీ ప్రాంతంలో బుధవారం ఒకే రోజు ఐదు ఆవులపై పంజా విసిరాయి. పులి దాడి చేసిన ప్రాంతాన్ని అధికారులు సందర్శించారు. అటవీ ప్రాంతానికి వెళ్లవద్దని ఆయా గ్రామాల ప్రజలకు సూచించారు. గత నెలలో చెన్నూర్ అటవీ ప్రాంతంలో ఒకే రోజు నాలుగు మేకలపై దాడి చేశాయి. శీతాకాలం కావడంతో పులి ఆకలి తీర్చుకునేందుకు ఆటవీ ప్రాంతంలో సంచరించే అవకాశాలు ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో వన్యప్రాణుల నుంచి పంటల సంరక్షణ కోసం కొందరు రైతులు అమరుస్తున్న విద్యుత్ వైర్లు ప్రమాదవశాత్తు పులికి తగిలితే పెను ప్రమాదం జరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
నిర్ధారించిన అధికారులు
చెన్నూర్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలో మూడు పులులు సంచరిస్తున్నట్లు అధికారులు ద్రువీకరించారు. గతంలో ఈ ప్రాంతంలో కే–4 ఆడపులి ఒక్కటే సంచరించేదని, ఆసిఫాబాద్ నుంచి ఏ–1, సిర్పూర్ నుంచి ఎస్–1 రెండు మగ పులులు రెండు ఈ ప్రాంతానికి వచ్చినట్లు చెబుతున్నారు. అవి ఆవుల మందలపై దాడి చేస్తున్నాయని అనుమానిస్తున్నారు. మూడు పులులు సంచరిస్తున్నా.. పులులన్నీ కలసి ఉండవని అధికారులు తెలిపారు. రోజుకో ప్రాంతానికి వెళ్తాయని చెబుతున్నారు.
పులులు సంరక్షణకు 9 బృందాలు
పులుల సంరక్షణ కోసం 9 బృందాలను ఏర్పాటు చేశామని చెన్నూర్ డివిజన్ ఫారెస్టు అధికారి రాజారావు తెలిపారు. నిత్యం పులుల కదలికనలు గమనిస్తూ రక్షణ చర్యలు చేపడుతున్నామని చెప్పారు. పులి ఒకే ప్రదేశంలో ఉండదన్నారు. కోటపల్లి మండలంలో పనిచేస్తున్న స్ట్రైకింగ్ ఫోర్స్, బేస్ క్యాంప్ సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. గ్రామాల్లో పులి సంచారం ఉందని, అటవీ ప్రాంతానికి వెళ్ల వద్దని దండోరా వేయిస్తున్నామని చెప్పారు. గతంలో జరిగిన ఘటన మళ్లీ చోటు చేసుకోకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని ఆయన వివరించారు.