జకార్తా జిగేల్‌... | Asian Games 2018 closing ceremony | Sakshi
Sakshi News home page

జకార్తా జిగేల్‌...

Published Mon, Sep 3 2018 3:19 AM | Last Updated on Mon, Sep 3 2018 3:19 AM

Asian Games 2018 closing ceremony - Sakshi

ఒక దీవి... 2 వేదికలు...45 దేశాలు... 40 క్రీడాంశాలు 11000 అథ్లెట్లు... లక్షల్లో వీక్షకులు...15 రోజుల ఏషియాడ్‌ ‘షో’కు తెరపడింది. ఆరంభానికి తీసిపోని విధంగా ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. బాలీవుడ్‌ చిత్రగీతాలు వేదికపై హైలైట్‌ అయ్యాయి. వేడుకకే శోభ తెచ్చాయి. ఇండోనేసియాలో రెండోసారీ ఆసియా క్రీడలు సూపర్‌ హిట్టయ్యాయి.   

జకార్తా: ఆటలు ఆగాయి. పాటలు సాగాయి. మిరుమిట్లు మిన్నంటాయి. వెలుగులు వెన్నెలనే పరిచాయి. ఆరంభం అదిరినట్లే... ముగింపు శోభ కనువిందు చేసింది. మొత్తానికి వేడుక ముగిసింది. వేదిక మురిసింది. అథ్లెట్లకు, అధికారులకు ఆతిథ్య ఇండోనేసియా బరువెక్కిన హృదయంతో వీడ్కోలు పలికింది. పతకాలు గెలిచిన అథ్లెట్లంతా గర్వంగా జకార్తాను వీడితే... పోరాడిన అథ్లెట్లు మళ్లీ లక్ష్యంపై స్ఫూర్తితో ముందుకు సాగారు. ఈ క్రీడల చివరిరోజు ఆదివారం మిక్స్‌డ్‌ ట్రయాథ్లాన్‌ ఈవెంట్‌ జరిగింది. జపాన్‌ బృందం ఈ గేమ్స్‌ చివరి స్వర్ణాన్ని సాధించింది.  

ఆటలేమో చూడలేదు కానీ!
ఇండోనేసియా వాసులు ఇక్కడి ‘గెలోరా బంగ్‌ కర్నో’ స్టేడియంలో జరిగిన ఆటల్ని పట్టించుకోలేదు. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ క్రీడాంశాలు ఇక్కడే జరిగినా... ఎందుకనో అంతగా ఆసక్తి కనబరచలేదు. అయితే వినోదాన్ని పంచే ముగింపు ఉత్సవానికి మాత్రం ఎగబడ్డారు. దీంతో 76 వేల సీట్ల సామర్థ్యం ఉన్న గెలోరా వేదిక ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. రెండు గంటల పాటు సాగిన ఈ ముగింపు వేడుకల్ని వారంతా తనివితీరా ఆస్వాదించారు. ముఖ్యంగా ఇండోనేసియా వారికి బాలీవుడ్‌ చిత్రాలన్నా, స్టార్లన్నా ఎక్కడలేని క్రేజ్‌. అందుకేనేమో సిద్ధార్థ్‌ స్లాథియా, డెనద పాడిన ‘కోయి మిల్‌ గయా’, ‘కుచ్‌ కుచ్‌ హోతా హై’, ‘జై హో’ పాటలకు జేజేలు పలికారు. స్టేడియంపై ఆకాశ వీధిలో బాణసంచా వెలుగులు మిరుమిట్లు గొలిపాయి.

ఆసియా స్ఫూర్తిని చాటేలా భారత్, చైనా, ఉభయ కొరియాలకు చెందిన కళాకారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మార్చ్‌పాస్ట్‌లో హాకీ ప్లేయర్‌ రాణి రాంపాల్‌ త్రివర్ణ పతా కంతో భారత జట్టును నడిపించింది. రెండువారాల క్రితం ఆరంభోత్సవంలో ఇండోనేసియా అధ్యక్షుడు జొకొ విడోడో బైక్‌ స్టంట్‌తో వేదికకు విచ్చేయగా... ఈసారి వీడియో సందేశంతో వచ్చారు. క్రీడాప్రపం చాన్ని ఉర్రూతలూగించిన ఈ గేమ్స్‌ను ఆస్వా దించిన వారికి ఆయన అభినందనలు తెలి పారు. ఈ వేడుకల్ని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ అధ్యక్షుడు థామస్‌ బాచ్, ఆసియా ఒలింపిక్స్‌ కౌన్సిల్‌ చీఫ్‌ అహ్మద్‌ అల్‌ ఫహాద్‌ స్టేడియంలోని వీఐపీ గ్యాలరీ నుంచి ప్రత్య క్షంగా వీక్షించారు. 2022 ఆసియా క్రీడలు చైనాలోని హాంగ్జౌ నగరంలో జరుగుతాయి.
    ఈ ఆసియా క్రీడల్లో 45 దేశాలు పాల్గొనగా... 37 దేశాలు కనీసం కాంస్య పతకాన్ని సాధించాయి. శ్రీలంక, పాలస్తీనా, ఈస్ట్‌ తిమోర్, బంగ్లాదేశ్, మాల్దీవులు, భూటాన్, బ్రూనై దేశాలు రిక్తహస్తాలతో వెనుదిరిగాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement