
2014 డిసెంబర్ ఘటన మరువక ముందే..
జకర్తా: ఇండోనేషియా విమానాలంటనే ప్రయాణికులు హడలెత్తిపోతున్నారు. గత ఏడాది డిసెంబర్ చివరి రోజుల్లో జరిగిన విషాదం అందరి మెదళ్లలో మెదులుతుండగానే.. ఇండోనేషియాకు చెందిన ట్రిగన్ ఎయిర్ ఏటీఆర్ 42 విమానం ఆదివారం పపువాలో కుప్పకూలింది. ఈ విమానంలో ఉన్న 54 మంది ప్రయాణికులు బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయని సమాచారం.
గత డిసెంబర్ 28న జావా సముద్రంలో ఎయిర్ ఏషియా విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 162మంది ప్రయాణీకులు జలసమాధి అయ్యారు. అందులో కొంతమంది మృతదేహాలు మాత్రమే వెలికితీయగలిగారు. ఈ ఘటన అప్పట్లో తీరని విషాదంగా మిగలింది. ఇప్పుడిప్పుడే ఆ ఘటనను అటు ఇండోనేషియన్ అధికారులు, ఆ విమానంలో ప్రయాణించి ప్రాణాలు కోల్పోయిన ప్రయాణీకుల కుటుంబ సభ్యులు మర్చిపోతున్నారు. ఇంతలోనే తాజాగా మరో ఘటన జరగడం అందరికి దిగ్భ్రాంతిని కలిగించింది.
ఇండోనేషియా విమానాలను నిర్వహిస్తున్న సంస్థల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు జరగుతున్నాయని ఇప్పటికే తీవ్ర విమర్శలు ఉన్నాయి కూడా. 1997లో కూడా గరుడా ఇండోనేషియా విమానం కూలిపోయి 152 మంది ప్రాణాలు కోల్పోయి అతి పెద్ద విమాన ప్రమాదంగానిలిచింది. ఆ తర్వాత కూడా దాదాపు ప్రతి ఏటా విమాన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 2005లో రెండుసార్లు విమాన ప్రమాదాలు చోటుచేసుకోగా ఒక్క 2007లో మూడుసార్లు విమానాలు కూలిపోయి అందులో ఉన్నవారంతా గాల్లోనే ప్రాణాలు విడిచారు.