నూసాదువ వాటర్‌బౌల్ బీచ్ వద్ద కుటుంబంతో అనూన్యరెడ్డి
ఇండోనేషియాలోని అందమైన దీవి బాలి. ఇది ప్రకృతి రమణీయతకు ఆలవాలం. కనువిందు చేసే బీచ్‌లతో, సుందరమైన దేవాలయాలతో మధురానుభూతిని కలిగిస్తుంది. బాలి ప్రకృతి అందాలను వీక్షించి తన అనుభవాలను వెల్లడించారు నగరంలోని బంజారాహిల్స్‌కు చెందిన డాక్టర్ అనూన్యరెడ్డి. ప్రపంచంలోని ప్రకృతి అందాలను తిలకిస్తూ, నోరూరించే పుడ్స్ వివరాలతో పాటు మోటివేషనల్ మెసేజ్‌తో కొందరిలోనైనా మార్పు తీసుకురావాలన్న తపనతో ఇన్‌స్ట్రాగామ్‌లో ది సర్జన్ గర్ల్ పేరిట ఓ బ్లాగ్‌ను కూడా క్రియేట్ చేశారు ఆమె. బాలి దీవిపర్యటన వివరాలను పంచుకున్నారిలా..
శ్రీనగర్‌కాలనీ :గత నవంబర్‌లో హైదరాబాద్ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి బాలి గురహ్ రాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో దిగాం. అమ్మ, నాన్న, తమ్ముడితో కలిసి వెళ్లాను. నాన్న, తమ్ముడికి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండటంతో అక్కడే కారు అద్దెకు తీసుకుని ప్రయాణాన్ని కొనసాగించాం.
ఉలువాటు: పురా తానాలాట్ దేవాలయం నీటి మధ్యలో ఉంటుంది. అక్కడికి వెళితేగానీ అక్కడి అందాలను వర్ణించడం కష్టం. ఇక్కడే ఉలువాటు దేవాలయం ఉంది. ఇదో ప్రత్యేకమైన దేవాలయం. ఇక్కడే రామాయణ ఇతిహాసాన్ని వివరిస్తూ నాటక ప్రదర్శన చేస్తారు. కచ్చితంగా చూడాల్సిన నాటకమిది. ఉలువుటా అంటే రాతి కట్టడం అని అర్థం. ఇక్కడి కట్టడాలు కనువిందు చేస్తాయి.
నూసాపెనిడా: నూసా పెనిడా ఐలాండ్ ప్రశాంతతకు నిలయం. ఇక్కడ చాలా బీచ్‌లు ఉన్నాయి. కెలింగ్‌కింగ్ బీచ్, బ్రోకెన్ బీచ్, ఏంజెల్స్ బిలాబాంగ్, క్రిస్టల్ బే బీచ్‌లు ప్రత్యేకం. వాటర్ కూడా చాలా నార్మల్ ఉంటాయి. ఇక్కడే జీవితకాలం ఉండాలిపించేంతగా బీచ్‌లు ఉంటాయి. నూసా దువా వాటర్ బౌల్ మరో అద్వితీయమైన ప్రదేశం.
ఉబుద్: బాలిలో ఉబుద్ ఎంతో అందమైన ప్రదేశం. ఇక్కడ టిట్రా దేవాలయం ఉంది. ఇక్కడి నీటిని చాలా పవిత్రంగా చూస్తారు. ఇక్కడ తెగనుంగా వాటర్‌ఫాల్స్, తుకడ్ వాటర్‌ఫాల్స్ ఉన్నాయి. సూర్యుడి కిరణాలు పడినపుడు వాటర్ ఫాల్స్‌లోని నీరు బంగారువర్ణంగా కనిపిస్తూ మధురానుభూతిని కలిగిస్తాయి. ఉబుద్‌లోనే తెగల్లాలాంగ్ రైస్ టెర్రస్ ఆహ్లాదమైన ప్రదేశం. చాలా ఎత్తులో రైస్ టెర్రస్ ఉంటుంది. కింద రైస్ పంట ఉంటుంది. ఇక్కడ లవ్ షేప్‌లో ఉండే ఓ నిర్మాణం నుంచి చూస్తే కనులవిందుగా ఉంటుంది. ఇక్కడే స్కేర్‌డ్ మంకీ ఫారెస్ట్ ఉంది.
పురా పెనటరన్ దేవాలయం: బాలిలో మౌంట్ లెంపియాంగ్ కరంగసెమ్‌లో పురా పెనటరన్ దేవాలయం ఉంది. చాలా ఎత్తులో ఉండే అతి పురాతమైన దేవాలయం ఇది. ఇక్కడి కట్టడాలు, అందాలు వర్ణణాతీతం. ఇలాంటి దేవాలయాలు చాలా ఉన్నాయి. ఇందులో పురా దను బ్రతన్, తమన్ అయున్, సరస్వతీ దేవాలయం, బేజి దేవాలయాలు ప్రత్యేకం. బాలి గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రకృతి అందాలు, కట్టడాలు అద్వితీయం. హనీమూన్ స్పాట్‌గా కూడా ప్రత్యేకం. ప్రతిఒక్కరూ చూడాల్సిన ప్రదేశం బాలి. సరికొత్త విషయాలు, ఫుడ్, ట్రావెల్ కోసం ఇన్‌స్ట్రాగామ్‌లో నా బ్లాగ్ ఫాలో కావచ్చు.
కుటా: కుటా ప్రాంతం షాపింగ్, నైట్‌లైఫ్, సర్పింగ్ బీచ్‌లు, క్లబ్‌ల నిలయం. ఇక్కడ ఫుల్‌గా షాపింగ్, ఎంటర్‌టెయిన్‌మెంట్ ఉంటుంది. ఇక్కడ ఇండోనేషియా సంప్రదాయ వస్తువులు, కళాఖండాలను కొనుగోలు చేసుకోవచ్చు. ఇండియన్, చైనీస్, జపనీస్, అమెరికన్ స్టైల్ రెస్టారెంట్స్ ఉంటాయి. ఇండోనేషియన్ పుడ్‌లో నాసిగొరిగో, మీగొరిగోలు ప్రత్యేకం.
Comments
Please login to add a commentAdd a comment