శవపేటికను మేడపైకి తరలిస్తున్న దృశ్యం
ఇండోనేషియా : తల్లి చనిపోయిన బాధలో ఉన్న ఆ కొడకు జీవితం విషాదంగా ముగిసింది. అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో తల్లి శవపేటిక మీద పడి తీవ్ర గాయాలపాలైన కొడుకు చనిపోవటంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటన ఇండోనేషియాలోని ఉత్తర తొరజాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర తొరజాలోని పారిండింగ్ లోయకు చెందిన సేమెన్ కొండోరుర(40) తల్లి ‘బెర్తా’ కొద్ది రోజుల క్రితం చనిపోయింది. అక్కడి సాంప్రదాయం ప్రకారం చనిపోయిన వారిని ఒక శవపేటికలో ఉంచి చెక్కతో తయారు చేసిన ఓ చిన్న పాటి మేడలో ఉంచాలి.
అనుకున్న ప్రకారం అంతా సిద్ధం చేసి శవపేటికను మేడ పైకి తరలిస్తున్న సమయంలో నిచ్చెన పక్కకు జరగటంతో అంతా ఒక్క సారిగా కుప్పకూలిపోయారు. దీంతో శవపేటిక మేడపై నుంచి సేమెన్ మీదకు జారి పడింది. బరువైన శవపేటిక అలా అంత ఎత్తు నుంచి మీద పడటంతో తీవ్ర గాయాలపాలైన అతన్ని ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సేమెన్ మృతి చెందాడు. సేమెన్ శవాన్ని తల్లి బెర్తా శవంతో పాటే ఉంచి ఘనంగా ఖననం చేశారు బంధువులు.
Comments
Please login to add a commentAdd a comment