ఛోటా రాజన్ భయపడుతున్నాడు
జకర్తా: ఎందరినో గడగడలాడించిన మోస్ట్ అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్కు పోలీసులకు దొరికిసరికే భయం పట్టుకుంది. ఇండోనేసియా పోలీసులకు దొరికిన చోటా రాజన్ చాలా భయపడుతున్నాడు. భారత్కు వెళ్లాలని లేదని, తనను విడుదల చేస్తే జింబాబ్వేకు పారిపోతానంటూ ఇండోనేసియా పోలీసులను వేడుకుంటున్నాడు. బాలి పోలీస్ కమిషనర్ రెయిన్హర్డ్ నయింగోలన్ ఈ విషయాలను వెల్లడించారు. భారత్కు చెందిన ఓ జాతీయ టీవీ చానెల్కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
'తనను విడుదల చేయాలని, విడుదల చేస్తే జింబాబ్వేకు పారిపోతానని ఛోటా రాజన్ కోరాడు. జింబాబ్వేకు పారిపోయేందుకు ఆస్ట్రేలియా నుంచి బాలి వచ్చినట్టు చెప్పాడు. అతను చాలా భయపడుతున్నాడు. వరసపెట్టి సిగరెట్లు కాలుస్తున్నాడు. భారత్కు వెళ్లాలని లేదని చెప్పాడు' అని బాలి పోలీస్ కమిషనర్ చెప్పారు.
ఛోటా రాజన్ తమ విచారణకు సహకరిస్తున్నాడని తెలిపారు. అతను కిడ్నీ, లివర్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడని చెప్పారు. త్వరలోనే భారత్కు పంపుతామని నయింగోలన్ తెలిపారు. ఆస్ట్రేలియా పోలీసులు అందించిన సమాచారం ఆధారంగా.. బాలి విమానాశ్రయంలో ఛోటా రాజన్ను ఇండోనేసియా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.