కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసమే రాజన్ దొరికిపోయాడా?
ముంబై: అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ తనకుతానుగా అరెస్టయి.. కావాలనే భారత్ తిరిగి వస్తున్నాడా? ప్రస్తుతం కనిపిస్తున్న కారణాలు అవుననే అంటున్నాయి. 55 ఏళ్ల ఛోటా రాజన్ అత్యవసరంగా మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన అవసరముంది. భారత్‌లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవడానికి అతను గత ఏడాదికాలంగా ప్రణాళికలు రచిస్తున్నాడని, ఇక్కడ అతనికి కిడ్నీ దానం ఇవ్వడానికి కుటుంబసభ్యులు ప్రయత్నిస్తున్నారని ముంబై క్రైమ్ బ్రాంచ్ వర్గాలు తెలిపాయి.
'ఛోటారాజన్ రెండు మూత్రపిండాలూ చెడిపోయాయి. దీంతో ఆయన ప్రస్తుతం డయాలసిస్ మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఆయన బతకాలంటే ఒక కొత్త కిడ్నీ అవసరముంది. పరారీ ఖైదీగా ఉన్న రాజన్ విదేశాల్లో ఈ శస్త్రచికిత్స చేయించుకోవడం వీలుపడదు' అని క్రైమ్ బ్రాంచ్ అధికారి ఒకరు తెలిపారు. భారత్ తిరిగొస్తే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు అధికారులు అనుమతించే అవకాశముందని రాజన్ భావిస్తున్నాడని ఆయన వివరించారు.
సుదీర్ఘకాలంగా ప్లానింగ్!
ఛోటా రాజన్ అలియాస్ రాజేంద్ర సదాశివ నికాల్జే గత ఏడాదే తన ఆరోగ్య పరిస్థితి గురించి భారత్‌లోని తన కుటుంబసభ్యులకు వివరించాడు. గత రెండు దశాబ్దాలుగా పరారీలో అజ్ఞాత జీవితం గడుపుతున్న అతని రెండు కిడ్నీలు చెడిపోయాయి. దీంతో రాజన్ మేనల్లుడు ఒకరు కిడ్నీ దానం చేయడానికి ముందుకొచ్చినట్టు సమాచారం.
రాజన్ తన వైద్య పరీక్షల వివరాలు కుటుంబసభ్యులకు మెయిల్ ద్వారా పంపించగా.. వాటిని దక్షణ ముంబైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలోని నెఫ్రాలజిస్టుకు చూపించారు. దీంతో ఇద్దరి కిడ్నీలు మ్యాచ్ అవుతాయని, రాజన్‌కు ఆయన మేనల్లుడు కిడ్నీ ఇవ్వవచ్చునని వైద్యుడు సలహా ఇచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే మలేషియాలోని బాలిలో ఛోటారాజన్ అరెస్టయ్యాడు. ఒకవైపు దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఛోటా షకీల్ నుంచి ప్రాణహాని, మరోవైపు అనారోగ్యం కారణంగానే అతను అరెస్టు అవ్వడానికి సిద్ధపడినట్టు పోలీసువర్గాలు భావిస్తున్నాయి.